న్యూఢిల్లీ, మార్చి 11: భారతదేశ ముడి చమురు సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం బుధవారం భరోసా ఇచ్చింది. ఎల్పీజీ లభ్యతపై ప్రజలు భయాందోళన చెందవద్దని ప్రభుత్వం కోరింది. భౌగోళిక రాజకీయ అంతరాయాల నేపథ్యంలో పంపిణీ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం గృహోపయోగ ఎల్పీజీ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి(మార్కెటింగ్, చమురు శుద్ధి) సుజాత శర్మ బుధవారం తెలిపారు. గృహ వినియోగ రంగానికి ఎల్పీజీ సరఫరా జరుగుతున్నదని, దవాఖానలు, విద్యా సంస్థలు వంటి గృహేతర రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆమె చెప్పారు.
లభ్యతలో ఉన్న ఎల్పీజీని న్యాయంగా, పారదర్శకంగా పంపిణీ చేసేలా ప్రణాళిక ఖరారు చేసేందుకు కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీ రాష్ట్ర అధికారులు, పారిశ్రామిక సంఘాలను సంప్రదిస్తున్నట్లు ఆమె తెలిపారు. కొత్త వర్గాల నుంచి ఎల్ఎన్జీ కార్గోలను మన గ్యాస్ కంపెనీలు సమీకరించాయని, రెండు ఎల్ఎన్జీ కార్గోలు భారత్కు వస్తున్నాయని సుజాత శర్మ తెలిపారు. గృహ వినియోగదారులు ఎల్పీజీ రీఫిల్లింగ్ కోసం 25 రోజులు ఎదురుచూడాల్సి ఉంటుందని, ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ కోసం భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారి చెప్పారు. ప్రభుత్వ చర్యల వల్ల ఎల్పీజీ ఉత్పత్తి 25 శాతం పెరిగినట్లు ఆమె వివరించారు. హొర్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా ఇతర మార్గాల ద్వారా కూడా ముడి చమురు సరఫరాలు జరుగుతున్నట్లు మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. ఇదివరకు ఏర్పడిన పరిమాణాలతో పోలిస్తే ప్రస్తుత సరఫరా మరింత భద్రంగా ఉన్నట్లు వారు చెప్పారు.