భారతదేశంలో ప్రతి సంవత్సరం కోట్లాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ భవిష్యత్తును నిర్ణయించే పోటీ, ప్రవేశ, నియామక పరీక్షలకు హాజరవుతుంటారు. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, పోలీస్ నియామకాలు, ఉపాధ్యాయ అర్హత వంటి పరీక్షలు వంటి వ్యవస్థలు దేశంలో అవకాశాల గేట్‌వేలుగా నిలుస్తాయి.
గత రెండు దశాబ్దాలుగా ఒక ప్రమాదకరమైన ధోరణి పెరుగుతున్నది. ప్రశ్నాపత్రాల లీకేజీలు, మాస్ కాపీయింగ్, డిజిటల్ మోసాలు, ఇన్సైడర్ నెట్‌వర్క్‌లు, పరీక్షల మాఫియా ధోరణి ఎక్కువవుతున్నది. నీట్-2024 వివాదం ఈ సమస్యను జాతీయ చర్చకు తీసుకొచ్చినప్పటికీ, ఇది ఒక్క ఘటన కాదు. 2019 నుంచి కనీసం 65 ప్రధాన పరీక్షల లీకేజీలు లేదా తీవ్రమైన అక్రమాల కారణంగా ప్రభావితమయ్యాయని మీడియా విశ్లేషణలు సూచిస్తున్నాయి. 2004 నుంచి ప్రధాన పరీక్షల లీకేజీల టైమ్‌లైన్: 2005లో ఏఐపీఎంటీ (మెడికల్ ప్రవేశ పరీక్ష) దేశవ్యాప్తంగా వైద్య ప్రవేశ పరీక్షల్లో అక్రమాలు బయటపడ్డాయి. 2015లో ఏఐపీఎంటీ లీక్ అయింది. సుప్రీంకోర్టు జోక్యంతో పరీక్ష రద్దయి, మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది.
2017లో ఎస్ఎస్సీ సీజీఎల్ వివాదం చెలరేగింది. పరీక్షా కేంద్రాల కంప్యూటర్ల ద్వారా ప్రశ్నలు బయటకు వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. దేశవ్యాప్తంగా అభ్యర్థులు నిరసనలు చేపట్టారు. 2017లో నీట్ భద్రతా లోపాలు తలెత్తాయి. 2018లో సీబీఎస్ఈ 10, 12 తరగతుల పేపర్ లీక్ అయ్యా యి. ఎకనామిక్స్, గణిత పరీక్షలు వివాదాస్పదమయ్యాయి. వీటి వల్ల లక్షలాది మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. 2021 యూపీటెట్ లీక్ కావడంతో పరీక్షను రద్దు చేశారు. 2021లో ఆర్ఈఈటీ లీక్ (రాజస్థాన్) అయింది. 2022లో రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష లీక్ అయింది. 2024లో యూజీసీ-ఎన్ఈటీ రద్దు చేశారు. 2024లో నీట్ యూజీ వివాదం చెలరేగింది. దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా విద్యార్థులను ప్రభావితం చేసిన ఘటనగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం విచారణను సీబీఐకి అప్పగించింది.
మానవ జోక్యం ఎక్కువగా ఉండటం. ప్రశ్నాపత్రం తయారీ నుంచి ముద్రణ, రవాణా, నిల్వ, పంపిణీ వరకు అనేక దశల్లో మనుషుల ప్రమేయం ఉంటుంది. ప్రింటింగ్ ప్రెస్‌లో భద్రత లోపాలు, డిజిటల్ సైబర్లో భద్రత బలహీనతలు, పరీక్షా కేంద్రాల వద్ద అవినీతి, కోచింగ్ మాఫియా, రాజకీయఅధికార రక్షణ, బలహీనమైన ఆడిట్ వ్యవస్థ. ఇలా సుమారు 12 రకాలుగా లీకేజీలు జరుగుతున్నాయని రాధాకృష్ణన్ కమిటీ నివేదికను సమర్పించింది. పరీక్షల లీకేజీల మానవ మూల్యం.. దేశవ్యాప్తంగా పరీక్షల రద్దు, వాయిదాలు, లీకేజీల కారణంగా మానసిక ఒత్తిడి పెరిగిందని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, తీవ్ర మానసిక కుంగుబాటు, కుటుంబాల ఆర్థిక నష్టం నమోదయ్యాయి. అయితే ‘లీకేజీల వల్ల నేరుగా మరణించిన వారి కచ్చిత సంఖ్య’ గురించి అధికారిక జాతీయ డాటాబేస్ లేదు. కాబట్టి ఏ సంఖ్యనూ కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. ఇటీవల నీట్ యూజీ వివాదం నేపథ్యంలో పలువురు విద్యార్థుల మరణాలు, ఆత్మహత్యలు జాతీయస్థాయిలో చర్చకు వచ్చాయి.
ప్రపంచంలో అతిపెద్ద పరీక్షలు నిర్వహించిన దేశాలు, వాటికి హాజరైన అభ్యర్థుల వివరాలు: గావ్కావో (చైనా), సుమారు 1.31.4 కోట్ల మంది విద్యార్థులు హాజరయ్యారు. నీట్ యూజీ (భారత్), 20 లక్షలకుపైగా హాజరయ్యారు. యూసీఎస్సీ సీఎస్ఈ (భారత్), 1012 లక్షల మంది రాశారు. ఎస్ఎస్సీ సీజీఎల్ (భారత్), లక్షల సంఖ్యలో పరీక్షకు హాజరయ్యారు. ఎస్ఏటీ (అమెరికా), 1520 లక్షల మంది రాశారు. జేఈఈ మెయిన్ (భారత్), 10 లక్షలకుపైగా పరీక్ష రాశారు.
ప్రపంచ దేశాలు ఏమి చేస్తున్నాయి? చైనా (గావ్కావో)లో బయోమెట్రిక్ ధృవీకరణ, ఏఐ ఆధారిత పర్యవేక్షణ, ఆర్ఎఫ్ జ్యామర్లు, డ్రోన్ నిఘా వినియోగిస్తున్నాయి. దక్షిణ కొరియాలో పరీక్ష సమయంలో విమానాల మార్గాల్లో మార్పులు చేస్తున్నారు. సింగపూర్‌లో ఎండ్-టు-ఎన్క్రిప్టెడ్ ప్రశ్నాపత్రాలు రూపొందిస్తున్నారు. అమెరికాలో క్వశ్చన్ పూల్ ర్యాండమైజేషన్, అడాప్టివ్ టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. బ్లాక్‌చెయిన్ క్వశ్చన్ పేపర్ సిస్టమ్ కింద ప్రతి ప్రశ్నాపత్రం డిజిటల్ హ్యాష్‌తో భద్రపరచాలి. లాస్ట్ మినిట్ పేపర్ జనరేషన్: పరీక్షకు 3060 నిమిషాల ముందు మాత్రమే ప్రశ్నాపత్రం రూపొందాలి. జీరో ప్రింటింగ్ మాడల్, కేంద్రాల్లో సురక్షిత ప్రింటింగ్ చేయాలి. ఏఐ సర్వైలెన్స్ ఉండాలి. అసాధారణ కార్యకలాపాలను ఏఐ గుర్తించాలి. బయోమెట్రిక్ + ఫేస్ రికగ్నిషన్ చేయాలి.
జియో-ఫెన్స్డ్ ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. క్వాంటమ్ ఎన్క్రిప్షన్ ఉండాలి. మల్టీ సెట్ డైనమిక్ పేపర్స్. ప్రతి అభ్యర్థికీ భిన్నమైన ప్రశ్న క్రమం ఉండాలి. ఇండిపెండెంట్ నేషనల్ ఎగ్జామ్ ఇంటిగ్రిటీ అథారిటీ ఏర్పాటు చేయాలి. రియల్ టైమ్-పబ్లిక్ ఆడిట్ డ్యాష్‌బోర్డు ఉండాలి. ప్రశ్నాపత్రం ముందుగా ఎవరికీ తెలియకూడదు. ముద్రణ అవసరం లేకుండా ఉండాలి. ఏఐ ద్వారా పర్యవేక్షణ ఉండాలి. ప్రతి ప్రశ్నకూ డిజిటల్ ట్రాకింగ్ ఉండాలి. సెంటర్ స్థాయిలో అక్రమాలకు అవకాశం ఉండకూడదు. పరీక్ష అనంతరం ఆటోమేటెడ్ ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి. భారతదేశంలో పరీక్షల సంక్షోభం కేవలం లీకేజీల సమస్య కాదు. ఇది విద్యార్థుల విశ్వాసం, ప్రతిభ, సమాన అవకాశాలపై దాడి. ఒక ప్రశ్నాపత్రం లీక్ అవడం అంటే కేవలం కొన్ని ప్రశ్నలు బయటకు రావడం కాదు; లక్షలాది మంది యువత శ్రమ, కుటుంబాల ఆశలు, దేశ భవిష్యత్తు దెబ్బతినడం.
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
కేశవపంతుల వేంకటేశ్వర్లు 91827 77959