హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఇబ్రహీంపట్నం పరిధిలోని చర్లపటేల్గూడెం బీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో డీటీపీ ఆపరేటర్ విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయమై ‘గురుకులంలో కామపిశాచి’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ మంగళవారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం రాష్ట్రవ్యాప్తం గా చర్చనీయాంశంగా మారడంతో, ఈ ఉదంతాన్ని కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించడంతోపాటు, హుటాహుటిన సదరు గురుకులం బాటపట్టారు.
గురుకులానికి అసిస్టెంట్ సెక్రటరీ..
పత్రికలో వెలువడిన కథనంతో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి విచారణ కోసం ప్రత్యేకంగా అసిస్టెంట్ సెక్రటరీని గురుకులానికి పంపించారు. సమగ్ర నివేదిక అందించాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గురుకుల పాఠశాలలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు, బోధనా, బోధనేతర సిబ్బంది పనితీరు, విద్యార్థినుల రక్షణ ప్రమాణాలపై ఆరా తీశారు. పాఠశాల ప్రిన్సిపాల్, మహిళా అధ్యాపకులు, ఇతర సిబ్బందితో విడివిడిగా మాట్లాడి వివరాలు సేకరించారు. క్యాంపస్‌లో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీటీపీ ఆపరేటర్)ను ఉన్నపళంగా ఆ గురుకులం నుంచి తప్పించి మరో బాలుర పాఠశాలకు బదిలీ చేశారు. ప్రాథమిక విచారణ నివేదిక అందిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సొసైటీ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.
విచారణ కమిటీ ఏర్పాటు
గురుకుల పాఠశాల కథనంపై రంగారెడ్డి కలెక్టర్ సైతం స్పందించారు. గురుకులంలో నెలకొన్న పరిస్థితులపై విచారణకు ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. జిల్లా శిశుసంక్షేమ శాఖ అధికారి శాంతిశ్రీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పద్మావతి, వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ అనిత, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పద్మావతి, ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ సీడీపీవో వినీతతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ బృందం గురుకులాన్ని సందర్శించడంతోపాటు, విద్యార్థులు, మహిళా సిబ్బందితో మాట్లాడి వివరాలను సేకరించింది. నివేదికను నేరుగా కలెక్టర్‌కు సమర్పిస్తామని వెల్లడించింది. అదేవిధంగా పోలీస్ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) వర్గాలు ప్రత్యేక దృష్టిసారించాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సైతం అధికారులను వివరాలు కోరినట్టు సమాచారం.
విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యం : సొసైటీ సెక్రటరీ సైదులు
ఇదే విషయమై బీసీ గురుకుల సొసైటీ సైదులు స్పందించారు. పేద విద్యార్థినుల విద్యా ప్రయోజనాలు, గురుకులాల ప్రతిష్ట దెబ్బతినకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విచారణకు ఆదేశించామని, ఎవరు దోషులుగా తేలినా తక్షణమే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్యాంపస్‌లోని అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)ని ఏర్పాటు చేశామని వివరించారు. విద్యార్థుల భద్రతే ముఖ్యంగా సదరు డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను తక్షణం బదిలీ చేశామని, విచారణ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దళిత బిడ్డల భద్రతను గాలికొదిలిన ప్రభుత్వం : ఎర్రోళ్ల శ్రీనివాస్
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దళిత విద్యార్థుల భద్రతను రేవంత్ సర్కార్ గాలికొదిలేసిందని ఎస్సీ,ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. దళిత, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకునే గురుకుల పాఠశాలల పట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మంగళవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వచ్చిన ‘గురుకులంలో కామపిశాచి’ కథనాన్ని ఆయన ఎక్స్ ఖాతాకు జోడిస్తూ రేవంత్ సరార్ను తూర్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభు త్వం దళితులపై కపట ప్రేమ చూపుతున్నదని, మాటల్లో ప్రేమ ఒలకబోస్తూ చేతల్లో మా త్రం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. ఈ మూడేండ్లల్లో ఒక్కసారైనా గురుకులాల నిర్వహణ, అకడి పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారా..? అని ఆయన నిలదీశారు. గతంలో అనేక గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు పాము, తేలు కాట్లువంటి ప్రమాదకర ఘటనలు చోటుచేసుకున్నా ప్రభుత్వం ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు.