న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: బంగారం ధరలు మరింత తగ్గుతాయా? అంటే అవుననే సమాధానమే మార్కెట్ ఇస్తున్నది. గతకొద్ది రోజులుగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న పుత్తడి విలువను అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. దేశ, విదేశీ మార్కెట్లలో నెలకొన్న ఈ పరిస్థితులనుబట్టి మున్ముందు పసిడి రేట్లు పడిపోవడమైతే పక్కా అన్న అంచనాలే ఎక్కువగా వినిపిస్తుండటం గమనార్హం.
ప్రస్తుతానికైతే కళతప్పిన గోల్డ్ మార్కెట్‌కు ప్రధాన కారణం పశ్చిమాసియా సంక్షోభమే. గత 7 నెలలుగా జరుగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ అట్టుడికిపోతున్నది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తికి ఈ ఉద్రిక్తకర వాతావరణంతో బ్రేకులుపడ్డాయి. అలాగే క్రూడ్ సహా అంతర్జాతీయ వాణిజ్య రవాణాకు కీలకమైన హొర్ముజ్ జలసంధి ఇంచుమించుగా మూసుకుపోయింది. దీంతో గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర పెరుగడం మొదలైంది.
ప్రపంచ పెట్రో ఉత్పత్తుల రవాణాలో 20-25 శాతం హొర్ముజ్ మీదుగానే జరుగుతున్నది మరి. ఈ నేపథ్యంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అవన్నీ బంగారానికి ఉన్న డిమాండ్‌ను తగ్గిస్తూపోతున్నాయి. ధరల్లో కరెక్షన్కు దారితీస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు, ఇరాన్ పట్టుదల దృష్ట్యా ఇప్పట్లో గల్ఫ్ వార్‌కు ముగింపు కార్డు పడే పరిస్థితైతే కనిపించడం లేదు. హొర్ముజ్ జలసంధిని తెరువడానికి అమెరికా-ఇరాన్ మధ్య డీల్‌ను ట్రంప్ తాజాగా తిరస్కరించినది తెలిసిందే. దీంతో పుత్తడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో.. దానికి అనుగుణంగా భారతీయ మార్కెట్లో భారీగానే దిగుతాయని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలి ద్రవ్య సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచిన విషయం తెలిసిందే. పెట్రో ఉత్పత్తులు ఖరీదెక్కుతున్న వేళ ద్రవ్యోల్బణం విజృంభిస్తున్నది మరి. ధరల కట్టడికి మున్ముందూ వడ్డింపులు తప్పవని ఫెడ్ రిజర్వ్ స్పష్టమైన సంకేతాలనిస్తుండటం గమనార్హం. ఇదే జరిగితే బంగారం ధరలు ఇంకా పడిపోయే అవకాశాలే ఉన్నాయి. అవును.. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచితే అమెరికా బాండ్లలో రాబడులు మదుపర్లకు ఆకర్షణీయంగా మారుతాయి. బాండ్లపై పెట్టుబడులకుగాను ఇన్వెస్టర్లకు గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి. గోల్డ్‌పై ఈ తరహా ఆదాయానికి చాన్స్ లేదు. అందుకే ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టిన తమ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఉపసంహరించుకుంటున్నారు.
అలాగే బాండ్లలోకి విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులతో డాలర్ విలువ బలపడుతుంది. పెరిగే డాలర్ వాల్యూ చాలా దేశాలకు బంగారం దిగుమతుల్ని భారం చేస్తుంది. ఇది కూడా ఇప్పుడు గోల్డ్ రేట్లను దిద్దుబాటుకు గురిచేస్తుండగా.. వీటన్నిటి వెనుక గల్ఫ్ వార్ మాత్రమే ప్రధానంగా కనిపిస్తున్నది. ఇక పెరుగుతున్న ముడి చమురు ధరలతో చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాల్లో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ అమాంతం పెరిగిపోతున్నది. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 110 డాలర్లకు చేరువైనది విదితమే. ఈ పరిణామం కూడా గోల్డ్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడికి కారణమవుతున్నదని మెజారిటీ విశ్లేషకుల మాట.
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మంగళవారం మరింతగా తగ్గుముఖం పట్టాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ రూ.1.50 లక్షల మార్కు దిగువకు వచ్చింది. రూ.1,400 దిగి రూ.1,48,600 (అన్ని పన్నులు సహా) వద్ద స్థిరపడింది. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కిలో రూ.2.32 లక్షలు పలుకుతున్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం రేటు రూ.1,250 పడిపోయి రూ.1,36,400 వద్ద నిలిచింది.
రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా తగ్గుముఖం పడుతున్న ధరలు కొనుగోలుదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. అయితే ధరల్లో లోపించిన స్థిరత్వం అమ్మకాలను ప్రభావితం చేయవచ్చన్న ఆందోళనలూ వారిలో కనిపిస్తున్నాయి. నిజానికి ఈ ఏడాది జనవరి 29న 24 క్యారెట్ తులం పుత్తడి ధర ఆల్‌టైమ్ హై రికార్డును తాకుతూ రూ.1,83,000 పలికింది. అలాగే కిలో వెండి రేటు రూ.4,04, 500గా నమోదైంది. ఫిబ్రవరి ఆఖర్లో మొదలైన గల్ఫ్ వార్తో తగ్గుతున్నాయి.
అమెరికా ప్రభుత్వ బాండ్లలో రాబడులు ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ప్రధానమైన పదేండ్ల ట్రెజరీ నోట్ ఈల్డ్ 2007 జూన్ తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. 5.23 శాతంగా నమోదైంది. ఒకానొక దశలో 5.27 శాతానికి చేరింది. దీంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా గోల్డ్ నుంచి తమ పెట్టుబడులను బాండ్ల వైపునకు మళ్లించారు. ఇది బంగారం ధరల్ని కుప్పకూల్చింది. ఔన్స్ గోల్డ్ రేటు 4,139 డాలర్లకు పరిమితమైంది. పెరుగుతున్న ముడి చమురు ధరలతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ పెంచుతున్న వడ్డీరేట్లు.. అక్కడి బాండ్ మార్కెట్‌ను ఆకర్షణీయంగా మారుస్తున్నాయి మరి. ఇక ఔన్స్ సిల్వర్ 60.5 డాలర్లుగా నమోదైంది.