సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ఆబ్కారీ శాఖలో సీఐలకు సంబంధించిన బదిలీల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సమాచారం. ఆబ్కారీ శాఖలో జరుగుతున్న సీఐల బదిలీలలో పెద్ద ఎత్తున లాబీయింగ్ జరుగుతుందని, ఇందులో భాగంగా రూ.3కోట్లకు 13మంది సీఐల పోస్టింగ్ ప్యాకేజీకి ఒప్పందం కుదిరిందంటూ వచ్చిన ఆరోపణలపై నమస్తే తెలంగాణ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రభుత్వం అంతర్గత విచారణకు ఆదేశించడంతో పాటు బదిలీల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి ఈనెల 6లోపు బదిలీలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు శనివారం నాటికే రావాల్సి ఉండగా అంతలోనే ఈ బది‘లీల’వ్యవహారం దుమారం రేపింది. దీంతో ఈ వారంలో జరగాల్సిన సీఐల బదిలీలు మరింత ఆలస్యం కానున్నట్లు ఆబ్కారీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పలు ప్రభుత్వ శాఖల్లో..
ఈ మధ్య కాలంలో పలు ప్రభుత్వ శాఖల్లో పరిపాలన పక్కదారి పడుతోంది. అర్హులైన వారిని పక్కన బెట్టడం, అర్హత లేని వారికి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేవారి, ముడుపులు చెల్లించుకునే వారికే ఫోకల్ పోస్టింగ్లను అంగట్లో సరుకులా అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 65 మంది సీఐలకు సంబంధించిన బదిలీల ఉత్తర్వులను రాత్రికి జారీ చేసి, ఉదయానికి నిలిపివేసిన విషయం తెలిసిందే. సైబరాబాద్ పోలీసు కమిషనర్గా రమేశ్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా మే 2న 65 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే.
అయితే ఆ బదిలీల్లో పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగిందని, ఒక డీసీపీ చక్రం తిప్పి తనకు అనుకూలమైన వారికి ఫోకల్ పోస్టింగ్లు ఇప్పించుకున్నాడని, అవినీతి ఆరోపణలు ఉన్నవారినే అందలం ఎక్కించారంటూ కొందరు సీఐలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం, మరికొందరు తమ ఆమాత్యుల వద్ద మొరపెట్టుకోవడంతో సీఐల బదిలీలను నిలిపివేశారు. దాదాపు మూడు నెలల తరువాత గతంలో జారీచేసిన బదిలీల జాబితాను పూర్తిగా మార్చివేసి, ఇటీవలే సీఐలను బదిలీ చేసి, పోస్టింగ్లు కల్పించిన విషయం తెలిసిందే. ఈ తరహాలోనే తాజాగా ఆబ్కారీ శాఖలోనూ సీఐల బదిలీలు, పోస్టింగ్లు కల్పించడంలో పెద్ద ఎత్తున లాబీయింగ్ జరుగుతుందనే ఆరోపణలు వస్తుండడం తీవ్ర కలకలం రేపుతోంది. అటు పోలీసు శాఖలోనూ, ఇటు ఎక్సైజ్ శాఖలోనూ ఎస్ఐ, సీఐల పోస్టులకు హరాజ్ పాడుతున్న చందంగా పరిపాలన వ్యవహారం పక్కదారి పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.