మహబూబ్‌నగర్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అతనో జిల్లా ఉన్నతాధికారి.. నిక్కచ్చిగా వ్యవహరించే స్వభావం ఆయనది. అక్రమాలను సహించలేని నైజం ఆ అధికారిది. కానీ తాము చెప్పిందే వేదం అన్నట్టు వ్యవహరిస్తున్న అధికార పార్టీ నేతల తీరు ఆ అధికారికి నచ్చలేదు. ఇలా అయితే తాము కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు సహకరించలేమని చెప్పి ఓ జిల్లా మంత్రి.. మరో కాంగ్రెస్ నాయకుడు కలిసి సీఎంవోలో చక్రం తిప్పారు. వచ్చిన రెండు నెలలకే ఆ ఉన్నతాధికారి బదిలీ కావడం సంచలనం సృష్టించింది. 2025 జూన్ 19న నారాయణపేట జిల్లా పేరపళ్లలో చేపడుతున్న పంప్‌హౌస్ ప్రెజర్ మెయిన్ జాయమ్మ చెరువు విస్తరణ భూసేకరణకు తమకు అనుకూలంగా ఉన్న పత్రికల్లో అధికారులు భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఏమైందో ఏమో కానీ సదరు ఉన్నతాధికారి బదిలీ అయిన సరిగ్గా నెల తర్వాత జూన్ 8న ఇదే నోటిఫికేషన్లు మార్చి తాజాగా విడుదల చేశారు. అంతేకాకుండా మరో వంద ఎకరాలను ముంపులోకి చేర్చి ఈ వారంలో మరో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ జిల్లాలో ఇసుక మైనింగ్ భూసేకరణలో అడుగడుగునా అడ్డుతగులుతూ.. పరిపాలన గాడిలో పెడుతున్న ఆ అధికారిని బదిలీ చేయించి అనుకున్నది సాధించారనేందుకు ఆ నోటిఫికేషన్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఎత్తిపోతల పథకంతో భూమి కోల్పోతున్న వారి పేర్లు కాకుండా, కమీషన్లు ఇచ్చిన వాళ్ల పేర్లు నోటిఫికేషన్లోకి రావడంతో అసలైన రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి పాలమూరులోని ఆ జిల్లా.. అధికార పార్టీ నేతలకు కాసులు కురిపిస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా ఈ జిల్లాలో ఇసుక, మైనింగ్, నల్లమట్టి దందా అడ్డూఅదుపు లేకుండా సాగుతున్నది. వాగులు వంకలన్నీ ఖాళీ చేస్తూ, అనుమతుల్లేకుండా తరలించేస్తున్నారు. చెరువులు, కుంటల్లో ఉన్న లక్షలాది క్యూబిక్ మీటర్ల నల్లమట్టి రాత్రింబవళ్లు విరామం లేకుండా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వీటి వల్ల ప్రభుత్వానికి నయాపైసా ఆదాయం కూడా రావడం లేదు. ఈ జిల్లాలోని రెండు పట్టణాల్లో ఇసుక, నల్లమట్టి, మైనింగ్ లోడ్లతో టిప్పర్లు చీమల్లా తిరుగుతుంటాయి.
ఈ దందాలపై ఎవరు కన్నేసినా వారిపై దాడులకు ఉసిగొల్పుతుంటారు. అది ప్రైవేట్ వ్యక్తులైనా.. పోలీసులైనా.. అధికారులైనా.. అందరికీ అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో రౌడీషీటర్లను అడ్డంపెట్టి దందాలు సాఫీగా నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన ఉన్నతాధికారులందరూ సదరు మంత్రికి, ఓ అధికార పార్టీ నేతకు సలాం కొట్టాల్సిందే. అయితే పరిపాలనలో తనదైన ైస్టెల్లో ఈ అక్రమాలను సహించని ఆ ఉన్నతాధికారి వచ్చీరావడంతోనే కొరడా ఝులిపించారు. ఇసుక దందాను ఆన్లైన్ చేశారు. నల్లమట్టి తరలిస్తున్న టిప్పర్ల నుంచి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా క్యూబిక్ మీటర్‌కు ఇంత అంటూ చార్జీలు విధించారు.
ఇక కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ల్యాండ్ అక్విజేషన్ శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో అక్రమాలు జరుగకుండా కిందిస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా ఈ పనులు చేపడుతున్న నంబర్ టు మంత్రికి చెందిన కనస్ట్రక్షన్ కంపెనీపై కూడా అనుమతుల కొరఢా ఝులిపించారు. ఇక భూసేకరణలో తమ ఇష్టం వచ్చిన వాళ్ల పేర్లను చేర్చేందుకు ససేమిరా అనడం.. సదరు అధికారి ఉంటే తమ పప్పులు ఉడకవని భావించిన అధికార పార్టీ నేతలు హడావిడిగా నంబర్ టు మంత్రిని కలిసి సీఎంవోపై ఒత్తిడి తెచ్చి రెండు నెలల్లోనే బదిలీ చేయించి అక్రమాలకు అడ్డు తొలగించుకున్నారు.
నారాయణపేట జిల్లా పేరపళ్లలో చేపడుతున్న కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో భూములు కోల్పోతున్న రైతుల వివరాలతో 2025 జూన్ 19న తమ పత్రికల్లో భూసేకరణ నోటిఫికేషన్లు వేశారు. ఇక ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ భూసేకరణలో అసలైన లబ్ధిదారులకు ఇస్తే తమకేం వస్తుందని ఓ ఎమ్మెల్యే పీఏ, అధికార పార్టీ నాయకుడి అండతో అక్రమాలకు స్కెచ్ వేశాడు. ఇష్టానుసారంగా భూములను కోల్పోయే లిస్టులోకి చేర్చేందుకు తమకు అనుకూలంగా ఉన్న అధికారులతో బేరసారాలు మొదలుపెట్టారు. అప్పట్లో ఉన్న భూసేకరణ అధికారితోపాటు ఆర్డీవోగా వ్యవహరిస్తున్న అధికారిని బుట్టలోకి వేసుకొని భారీ ఎత్తున అక్రమాలకు తెరలేపారు. దీంతో తమకు కమీషన్లు ఇచ్చిన వాళ్లను, పార్టీ మారిన వాళ్లను, స్థానిక నేతలు చెప్పిన పేర్లను చేరుస్తూ ఎకరాలకు ఎకరాలు కొత్త జాబితా సిద్ధం చేశారు.
నిరుడు ఇచ్చిన నోటిఫికేషన్లు కాదని తాజాగా జూన్ 8న మరో నోటిఫికేషన్ మార్చి విడుదల చేయడం చర్చనీయాంశమైంది. ఈ రెండు నోటిఫికేషన్లను పరిశీలిస్తే అక్రమాలు బయటపడే అవకాశం ఉన్నదని గ్రామస్తులు చెప్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నాయకులు చెప్తే భూసేకరణ నోటిఫికేషన్లను మార్చడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. అంతటితో ఆగకుండా మరో 100 ఎకరాలను తమ అనుచరుల కోసం పెంచి ముంపునకు గురవుతున్నట్టు సృష్టించి రూ.కోట్లు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధంచేశారు. ఈ వ్యవహారం బయటపడటం.. దీనిపై విచారణ జరుగుతుండటంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.
‘కొడంగల్ ఎత్తిపోత.. కోట్లు మేత.. పరిహారంలో ఫలహారం’.. శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. ఏకంగా ఈ భూసేకరణ అక్రమాలపై ల్యాండ్ రెవెన్యూ కమిషనర్‌ను విచారణకు ఆదేశించింది. సోమవారం నారాయణపేట జిల్లాకేంద్రానికి చేరుకున్న ఆయన కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోలతో సమావేశమై ఆ తర్వాత హుటాహుటిన పేరపళ్లకు చేరుకున్నారు. మీడియాకు సమాచారం ఇవ్వకుండా ఉన్నతాధికారులను వెంట బెట్టుకొని ప్రధాన కమిషనర్ భూపరిపాలన శాఖాధికారి శివకుమార్ నాయుడు నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణ బృందం ముంపు భూములను సందర్శించింది. పేరపళ్ల, దామరగిద్ద తండా శివార్లలోని సర్వే నంబర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడే ఉన్న కొద్దిమంది రైతులను అడిగి తెలుసుకున్నారు.
ఈ భూములు మీవేనా? ముంపునకు గురవుతున్నాయా? నష్టపరిహారం వస్తున్నట్లు చెప్పారా? అని ఆరా తీశారు. రైతులు మాత్రం తమ పేర్లు ఉన్నాయో లేదో ఎవరూ ఏం చెప్పలేదని సమాధానమిచ్చారు. నలుగురు రైతుల భూమి ముంపులో లేకున్నా పరిహారం జాబితాలో ఉన్నదని ఆర్డీవో వెల్లడించారు. దీనికంతటికీ తహసీల్దారే కారణమని కమిషనర్‌కు చెప్పడంతో దీనిపై నివేదిక ఇవ్వాలని ఆర్డీవోను ఆదేశించినట్టు సమాచారం. ఆ తర్వాత కలెక్టరేట్‌కు చేరుకొని గంట పాటు కలెక్టర్ ప్రియాంకతో సమావేశమయ్యారు.
పేరపళ్లలో జరుగుతున్న భూ అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’లో వస్తున్న వరుస కథనాలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పేరపళ్ల భూ అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ ప్రారంభం కావడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వాస్తవంగా ఎత్తిపోతల పథకం కింద ఎన్ని భూములు పోతాయో సమగ్రంగా విచారణ జరిపి బాధితులకు కాంగ్రెస్ నేతల కమీషన్ల నుంచి కాపాడాలని, నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం అందించాలని ప్రజలు కోరుతున్నారు.