పెద్ద మనుషుల ఒప్పందం పేరుతో ఆనాడు తెలంగాణ మోస పోయింది. తెలంగాణ బిడ్డలు గోస పడ్డరు. సమైక్య పాలనపై పిడికిళ్లెత్తినరు. జంగు చేసి జైళ్లల్ల పడ్డరు. లాఠీ దెబ్బలు తిన్నరు. తుపాకీ తూటాలకు బలై పోయినరు. 369 మంది తెలంగాణ బిడ్డలు నెత్తుటి మడుగులో అసువులు బాసినరు. ఆ బిడ్డల మరణాన్ని చూసి చలించిపోయిన సుమిత్రాదేవి నిండు సభలో అడుగుపెట్టింది. పోలీసు కాల్పుల్లో గాయపడ్డవాళ్లని ఎత్తుకుని దవాఖానలో చేర్పించి, అక్కడి నుంచి నేరుగా శాసన సభ సమావేశాలకు వచ్చింది. ‘క్రూరమైన పాలనకు సాక్ష్యం కావాలా? ఇదిగో నా చీరె చెంగు. నెత్తుటిలో తడిచిన ఈ చీరె చూసైనా ఈ పాలన ఎంత దుర్మార్గమైనదో తెలుసుకో. మన ప్రభుత్వం జరిపిన హత్యాకాండకు విద్యార్థుల నెత్తుటితో తడిసిన నా చీరే సాక్ష్యం’ అంటూ రక్తసిక్తమైన చీరెను చూపిస్తూ నిండు సభలో నిలదీసింది.
ఆనాడు దగాపడ్డ తెలంగాణ గొంతుకై పండిత ఈశ్వరీబాయి చట్టసభలో కాంగ్రెస్ పాలకులకు చెమటలు పట్టించింది. విద్య, ఉద్యోగం, సంక్షేమంలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గణాంకాలతో వివరించి అధికార పక్షంపై గర్జించింది. ఆమెకు సదాలక్ష్మి తోడయ్యింది. తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని అడుగడుగునా ప్రశ్నించింది. చట్టసభల్లో సీమాంధ్ర పాలకుల్ని గడగడలాడించింది. ముగ్గురు మహిళలు సివంగులై తెలంగాణ నేల కోసం నిలబడ్డ తీరు, తెలంగాణ హక్కుల కోసం తిరగబడ్డ ధైర్యం తెలంగాణ చరిత్ర పేజీల్లో ఒక స్ఫూర్తిమంతమైన అధ్యాయంగా నమోదైంది.
చరిత్రలో ప్రసిద్ధమైన నీతి వాక్యాల్లో ‘చరిత్ర పునరావృతమవుతుంది’ అన్నమాటకు అత్యంత ప్రాధాన్యం ఉంది. చరిత్రలో చదివిన ఘటన లాంటి మరో సంఘటన ఏదో ఒకటి మనుషులు తమ జీవితకాలంలో చూస్తారు. అప్పుడు చరిత్ర పునరావృతం అవుతుందన్న మాట నిజమేనని గుర్తుచేసుకుంటారు. ఇప్పుడూ అదే గుర్తు చేసుకుంటున్నారు. కానీ, ఇది నిన్నటి చరిత్రకంటే ఇంకా భిన్నమైనది. ఒక తరం కండ్లముందు చూసిన చరిత్రనే మళ్లీ చూడటం అరుదు. అలాంటి అరుదైన ఘటనకు తెలంగాణ శాసన సభ వేదికైంది.
‘మీకు మేమున్నాం. మీ కోసం.. మీ బిడ్డల కోసం మాట్లాడి తీరుతాం’ అని ప్రజా క్షేత్రంలో మాటిచ్చి సబితమ్మ శాసన సభకు బయలుదేరింది. ‘కొట్లాడైనా సరే కోటి మంది నిరుద్యోగుల గొంతు వినిపిస్తాం’ అని సునీతమ్మ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకుంది. ‘కళ్యాణ లక్ష్మి కానుకే కాదు, ఆడవాళ్లకు ఇచ్చిన హామీలన్నీ అడుగుతా’నంటూ పేదింటి ఆడబిడ్డకు మాటిచ్చిన కోవా లక్ష్మి అసెంబ్లీలో మాట్లాడేందుకు సిద్ధమై వస్తున్నది. ఈ ముగ్గురమ్మలు శాసన సభలో కోట్లాది తల్లుల గొంతుకై నిలదీస్తరని ప్రభుత్వానికి భయం పట్టుకుంది. హామీల కొంగుజాపితే ఓట్లేసిన తల్లుల తరఫున నడుముకు కొంగు బిగించి ఈ ముగ్గురూ వస్తున్నరని ఏలికలకు అర్థమైంది. ఈ అమ్మల అమ్ముల పొదిలో అస్ర్తాలున్నయి. అవి రాజకీయ లక్ష్యాన్ని ఛేదించే శస్ర్తాలు కావు. ఆడినమాట తప్పినవాడి స్వరూపాన్ని ఎత్తి చూపేవి. సత్యాన్ని సంధిస్తే ఆత్మ రక్షణకు అబద్ధాల హామీలు ఇక మిగల్లేవు.
ఆ అసత్యాల అస్ర్తాలన్నీ ఎన్నికల్లో, ఆ తర్వాత వంద రోజుల పాలనలోనే చెల్లిపోయినయ్. వెయ్యి రోజులైనా తీరు మారలేదు. ఇక మిగిలిందేమీ లేదు. తప్పు చేశామని ఒప్పుకోవడం తప్ప. నిన్నటి హామీలన్నీ నీటి మీద రాతలేనని తేలిపోయాక తప్పుని ఒప్పుకొనే హుందాతనం ఏలేవాళ్లకు ఇసుమంతైనా లేదు. అన్ని రంగాల్లోనూ ఆగమైన దుస్థితి. ఒక ఇంట్లో నలుగురి కడుపు నింపిన ఆటోలో పెట్రోలు నింపుకోవడమే కష్టమైపోయిందని, బిడ్డల ఆకలి చెప్పుకొన్న తల్లులు, ఆటో అన్నల బాధలు చెబితే పరువెక్కడ పోతుందోనని ఏలేటోళ్లు భయపడ్డరు. సత్యం అంగీకరించలేనివాళ్లు అద్దంపై రాయి విసిరినట్టే ఆడబిడ్డల కష్టాలు చెప్పేందుకు సిద్ధమైన మహిళా శాసన సభ్యులపై ప్రభుత్వం ముందే దాడికి సిద్ధమైంది. నిండు సభలో స్త్రీలను అవమానించిన దుష్ట చక్రవర్తుల నుంచి స్ఫూర్తి పొందారేమో! నాలుగు గోడల మధ్య కాదు నడి వీధిలో చీరెలాగే దుస్సాహసానికి ఒడిగట్టింది కాంగ్రెస్ సర్కార్. సామాన్యుడి గొంతు వినిపించేటోళ్ల గొంతు నొక్కేందుకు తెగబడింది.

ఇది శ్రావణ మాసం. నోముల కాలం. అంతా మంచే జరగాలని వ్రతాలు ఆచరించే సమయం. అంతేకాదు.. తెలంగాణ శాసన సభ వర్షాకాల సమావేశాలు జరిగే కాలమూ ఇదే. ఎన్నో ఇళ్లల్లో శ్రావణ మాస వ్రతాలు, పూజలు ఎంత నిష్ఠగా చేసుకుంటారో టీవీనీ అంతే శ్రద్ధగా ఆలకిస్తుంటారు. మొన్నా అలాగే చూశారు! ముగ్గురమ్మలు కదలివచ్చారు. ఆ తల్లుల భక్తి, చిత్తం పిల్లల ఉద్యోగాల మీద, ఫీజు రీయింబర్స్మెంట్ మీద. వాళ్ల ఎదురు చూపులు నోటిఫికేషన్ల కోసం. ఏ తల్లులు దేవుడిని కోరినా బిడ్డ బాగే కదా కోరుకునేది. చెలకలో ఉన్న రైతు ఆలయానికి దూరంగా ఉన్నా.. భూదేవిని బాగా పండాలని కోరుకుంటూ కష్టిస్తున్నాడు. ఆ కష్టానికి తగ్గ రైతు బంధు కోసం ఎదురుచూస్తున్నాడు. రైతు బాంధవుడైన పాత పాలకుడు దేవుడిలా వరమిచ్చినా కొత్తగా వచ్చిన పాలకుడు కరుణించకపాయె. నీళ్లకు, నిధులకు అడ్డం పడుతున్న సర్కార్ గండం తప్పించమని ప్రకృతికి మొక్కే రైతు కూడా సెల్ఫోన్లో అసెంబ్లీ సమావేశాలు వింటున్నాడు. విద్యార్థుల గురించి చెప్పేదేముంది. ఎదురుపడితే నిలదీసేంత పౌరుషంతో తిరుగుతున్నారు. కంటబడితే వదలరనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు తప్పించుకు తిరుగుతున్నరు. పాలకులకు పిల్లల సంగతి బాగా తెలుసు.
అందుకే అంతగనం భయపడుతున్నరు. కాళోజీ వారసులమంటూ ‘దోస్తుగ ఉండే వారితో మేమును… దోస్తీ చేస్తం ప్రాణమిస్తం’ అని నిన్న యూత్ డిక్లరేషన్ పేరుతో మాయమాటలు చెప్పిన లీడర్ల కోసం వెదుకుతున్నరు. తప్పించుకు తిరగే లీడర్ ఒక్కడూ దొరకట్లే. ఇప్పుడు దొరకబుచ్చుకునే కాలమొచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ కావాలని, పాలిటెక్నిక్ చదువు ఉండాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని చలో అసెంబ్లీ’ అంటూ బయలెల్లారు. ‘దోపిడి చేసే ప్రాంతేతరులను… దూరం దాకా తన్ని తరుముతం’ అని కాళోజీ చెప్పినట్టే చేసిన వేడి నెత్తురాయె! ‘ప్రాంతం వాడే దోపిడి చేస్తే.. ప్రాణంతోనే పాతర వేస్తం’ అంటూ కదం తొక్కారు. ఆ బిడ్డల్ని అడ్డుకుని నోములు నోచే తల్లుల నోట్లో మట్టి కొట్టాలని శాసన కర్తలు ముందే రాసుకున్నరు. అసెంబ్లీకి చుట్టుపక్కల అర కిలోమీటరు వరకు పోలీసుల్ని మోహరించి, ఆంక్షలు పెట్టి, అడ్డుగోడలు కట్టి అడిగేటోళ్లను కట్టడి చేసినరు. కోట్లాది మంది అమ్మల తరపున అడిగేందుకు ముగ్గురు ఆడబిడ్డలు సిద్ధమైతే ప్రభుత్వం భయంతో వణికిపోయింది. ఈ ఆడబిడ్డలు అసెంబ్లీలో మాట్లాడితే ఇప్పటికే దిగజారిన పరువు పాతాళానికి పడిపోతుందనే ఈ ఎత్తుగడ.
బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం గౌలిగూడ చమన్ దగ్గర పోలీసులను దింపి ఉద్యమకారుల్ని అడ్డగించింది. పిడికిలెత్తిన పిల్లగాళ్ల మీద లాఠీలతో విరుచుకుపడింది. తుపాకులతో కాల్చింది. తూటాలకు గాయపడి, లాఠీ దెబ్బలకు కదల్లేని స్థితిలో ఉన్న పిల్లల్ని కొడుతుంటే సదాలక్ష్మి అడ్డుకోబోయింది. అయినా మాట వినని పోలీసుని గల్లా పట్టి కొట్టింది. కింద పడేసి తొక్కింది. ఇదెవరో అతిశయోక్తిగా అన్నది కాదు. సదాలక్ష్మి చరిత్ర రాసిన గోగు శ్యామల అన్వేషణలో… తెలంగాణ ఉద్యమంలో ఉద్ధండుడైన కేశవరావ్ జాదవ్ చెప్పిన సత్యం. కండ్లెదురుగా ఓ వీరనారి పోలీసుల్ని గల్లాపట్టి కొట్టిన పోరాట దృశ్యం తెలంగాణ ఉద్యమ చరిత్రకు ఆయన అందించిన ఒక జ్ఞాపకం. అదే స్ఫూర్తితో సబితమ్మ పోలీసుల్ని ప్రశ్నించింది. ఎదిరించింది. మంద బలం ముందు భంగపడినా.. ప్రజా బలంతో మీ అన్యాయం కదిలిస్తామని చెప్పిన ధైర్యం మళ్లీ సదాలక్ష్మిని గుర్తు చేసింది.

తొలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో చెన్నారెడ్డిని జైలులో నిర్బంధిస్తే ఆ ఉద్యమ నాయకత్వాన్ని భుజానికెత్తుకుని తెలంగాణ పోరాటం నడిపిన వీరనారి సదాలక్ష్మి. ఆ ధీరకు వారసురాలే సబితమ్మ. తెలంగాణ తొలి ఉద్యమం నెత్తురోడినా, తెలంగాణ ఆకాంక్ష నీరుగారిపోయింది. నిస్తేజంగా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ రగిలించిన పటోళ్ల ఇంద్రారెడ్డి వారసత్వం ఆమె. తెలంగాణ ఉద్యమానికి ఆనాడు ఊపిరులూదిన సిటీ కాలేజ్‌లో ఇంద్రారెడ్డి సభ జరుపుకొని నగరం నడిబొడ్డున ఉన్న అసెంబ్లీ ముందుగా ఊరేగింపు తీసినట్టే.. నేటి తెలంగాణ గోస చెప్పేందుకు సబితమ్మ అసెంబ్లీకి ఊరేగింపుగా వచ్చింది. ఇంద్రారెడ్డి చెప్పిన నీళ్ల లెక్కలు మళ్లీ గుర్తుచేస్తుందనే భయంతో రాజ్యం ఉలిక్కిపడింది. గేటు ముందే దౌర్జన్యానికి తెగబడింది. పొరుగు రాష్ట్రం నీళ్లు దోచుకుపోతుంటే అడ్డుకునే సత్తువ లేని ప్రభుత్వం.. సబితమ్మ చెప్పే నిజాలకు అడ్డుపడింది. కానీ, కట్టలు తెంచుకున్న ఆగ్రహంలో ఈ సర్కార్ కొట్టుకుపోయే రోజు ఒకటొస్తుందని గుర్తించేలా చేసింది సబితమ్మ.
సబితమ్మ చెంతనే ఉన్న కోవ లక్ష్మిని నూకి పారేసింది పోలీసు క్రౌర్యం. ఈ అధికారం మీకెక్కడిది అన్నందుకు మాజీ హోం మంత్రినే ఖాకీ జులుం జుట్టుపట్టి నెట్టింది. చట్టాన్ని దాటి చేయిచేసుకోవడం తప్పని చెప్పినా ఆగడం ఆగలేదు. ఆధిపత్యాన్ని, అధికారాన్ని ప్రదర్శించేందుకు స్త్రీలపై దురుసుగా ప్రవర్తించడం, స్త్రీలను అగౌరవపరుస్తూ మాట్లాడటం పురుషాధిక్య సమాజంలో వేల ఏండ్లుగా అమలులో ఉన్నదే. ఇప్పుడది మళ్లీ జడలు విప్పింది. ఆనాటి తెలంగాణకు ఈశ్వరీబాయి, సదాలక్ష్మి, సుమిత్రాదేవి అండగా నిలబడ్డట్టు.. రాష్ర్టాన్ని దగా చేస్తున్న రేవంత్‌ను నిలదీసేందుకు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి అదే తీరుగ నిలబడి తెలంగాణ వారసత్వాన్ని చాటుకున్నరు.
‘అబలయని దేశమున కబళింప తలపడిన
పర రాజులకు స్త్రీల పటుశౌర్యమును జూపి
రాజ్యతంత్రము నడిపెరా
తెలగాణ రాణి రుద్రమదేవిరా’
అని అన్న రావెళ్ల మాటలు మర్చిపోకండి.
చరిత్ర పునరావృతం కావడంలో ఆశ్చర్యం లేదు. కానీ, ఒక జీవితంలో ఒకే వేదికపై ఒకే విధమైన రెండు సాహసాలు కండ్లారా చూడటం మాత్రం అరుదైనదే. ఉగ్గుపాలతో ధీరత్వం తాపే తెలంగాణ తెగువ ఇదే. ‘గతాన్ని గుర్తుంచుకోలేనివాళ్లు దాన్ని మళ్లీ అనుభవించాలి’ అని తత్వవేత్త జార్జ్ శాంటయాన హెచ్చరికను గ్రహించిన వాళ్లు గట్టెక్కారు. గతాన్ని విస్మరిస్తున్న రేవంత్ అపఖ్యాతిపాలైన పాలకుల జాబితాలో ఒకడిగా చేరిపోతాడు. ‘అన్యాయాన్ని ఎదిరించినవాడే నాకు ఆరాధ్యుడు’ అన్న కాళోజీ బాటలో నడుస్తున్న సబితమ్మ, సునీతమ్మ, కోవ లక్ష్మక్కలే మాకు ఆరాధ్యులని నేటి తెలంగాణ సకల జనం అంటున్నది.
ఇప్పుడున్న అసెంబ్లీ ప్రాంగణంలోని జూబ్లీహాలు ఒకప్పుడు నిజాం రాజు దర్బారు. ఆయన పట్టాభిషేకానికి పాతికేండ్ల సందర్భంగా నిర్మించాడు. కాబట్టి ఆ పేరొచ్చింది. ఆ హాలు పక్కనే కళల ప్రదర్శన కోసం ప్రజల విరాళాలతో సిటీ హాల్ నిర్మించారు. ఈ హాలులో చిత్ర ప్రదర్శనలు జరిగేవి. నాటకాలు ఆడేవాళ్లు. గజళ్లు పాడేవాళ్లు. ఆ రోజుల్లో సిటీ హాల్లో ద్రౌపది వస్ర్తాపహరణం నాటకం తరచుగా వేసేవాళ్లు. రాజకీయాలు అనేక మలుపులు తిరిగిన తర్వాత ఈ సిటీ హాల్ అసెంబ్లీ హాలుగా మారిపోయింది. స్పష్టంగా చెప్పాలంటే సమైక్య పాలకులు ఆక్రమించారు. గుంజుకున్న హాల్‌కి బాకీగా రవీంద్ర భారతిని ఇచ్చారు. నెహ్రూ దీనిని ప్రారంభించారు. రవీంద్రభారతిలో జరిగే నాటకాల కంటే ఈ అసెంబ్లీలో జరిగే వాదోపవాదాలే బాగా రక్తికట్టేవి. ఒకప్పుడు సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి వంటి హేమాహేమీలు ప్రతిపక్షంలో ఉండేవాళ్లు. నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు వంటి కాకలుతీరిన నాయకులు ప్రతిపక్షం సవాళ్లను స్వీకరించేవాళ్లు. తరిమెల అసెంబ్లీని పందుల దొడ్డితో పోల్చిన రోజుల్లోనూ.. సభలో ఏ స్త్రీ గౌరవానికీ ముప్పు వాటిల్లలేదు. ఆరుట్ల కమలాదేవి ఉప ప్రతిపక్ష నేతగా, ప్రతిపక్ష నేతగా పాలకుల్ని ఎండగట్టినప్పుడు ఏ ఒక్కరూ ఆమెను పల్లెత్తు మాట అనలేదు. ప్రజల కోసమే ప్రశ్నించాలి. ప్రజల కోసం బదులివ్వాలనే శాసన కర్తల కట్టుబాటు కొన్ని దశాబ్దాలు కొనసాగింది. ఇప్పుడు అధికార పక్షం కట్టుతప్పింది. ప్రశ్నించే గొంతు నొక్కడమే కాదు, అసెంబ్లీ ప్రాంగణాన్ని దుశ్శాసన పర్వానికి వేదికగా మార్చింది. స్వేచ్ఛ.. సమానత్వం.. సౌభ్రాతృత్వం అన్న ప్రజాస్వామిక స్ఫూర్తికి తిలోదకాలిచ్చింది.
ఇప్పుడీ రంగస్థలంపై ప్రజాస్వామ్యాన్ని మళ్లీ ప్రతిష్ఠించుకోవాలి. మన ఆడబిడ్డలను అవమానించిన నీచ పాలకులకు కర్రు కాల్చి వాత పెట్టాలె. ఆ రోజు ఎంతో దూరంలో లేదని అసెంబ్లీ సాక్షిగా మౌనముద్రలో ఉన్న మహాత్ముడు.. ఆ పక్కనే ఉన్న అంబేద్కర్ మహాశయుడితో ఇప్పటికే చెప్పి ఉంటాడు!!
అసెంబ్లీలు, పార్లమెంట్ ఉన్నది దేనికి? ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి. ప్రజల బాధలు తీర్చేందుకు అధికార పక్షం కట్టుబడటానికి! ఈ చర్చల్లో ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకోవడానికి వాదోపవాదాలు జరిగితే చూడటానికి భలే రసవత్తరంగా ఉంటుంది. కానీ, మొన్నటి సంఘటన జుగుప్సాకరంగా ఉంది. ఎంత అమానవీయం. ఒక స్త్రీ పట్ల ఇంత కర్కషంగా వ్యవహరించడం న్యాయమేనా. పురాణాల్లో ద్రౌపదిని వివస్త్రను చేయబూనిన దుశ్శాసనుడిలా పోలీసులు ప్రవర్తించవచ్చునా? నిండు సభలో అబల వస్ర్తాలు గుంజుతుంటే వినోదం చూస్తూ వికటాట్టహాసం చేసినట్టు.. నేటి ఏలికలు బాధితులను బద్నాం చేస్తూ తొండిగా వాదిస్తే తప్పు ఒప్పవుతుందా? ‘అడ్డుకునే హక్కు నీకెక్కడిది?’ అని ప్రశ్నించిన మహిళా ఎమ్మెల్యేలను సభాపతి కూడా కాపాడలేకపోయాడు. ఆ దుశ్శాసన పర్వంలో భంగపడ్డ ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు ఎవరికి చెప్పుకోవాలి? పురాణాల నుంచి రాచరికాలు దాటొచ్చిన ప్రజాస్వామ్యంలో కూడా స్త్రీకి ఇదే అవమానమా? నవ సమాజ నిర్మాణం కోసం పాటుపడతామంటూ ఏలికలు చెప్పే మాటలు పంద్రాగస్టు ప్రసంగానికే పరిమితమైతే ఎలా? ప్రజా ప్రతినిధులకే ఇంతటి అవమానం జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు!