బూర్గంపహాడ్, సెప్టెంబర్ 29 : వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటిస్తే రోగాలు దూరమవుతాయని బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ బానోత్ సరోజ అన్నారు. మంగళవారం గ్రామంలో డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పారిశుధ్య సిబ్బంది, ఏఎన్ఎంలతో ఇంటింటికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. మురుగునీటి కాల్వల్లో దోమలు వ్యాప్తి చెందకుండా క్లోరోఫాం చల్లించి నివారణ చర్యలు చేపట్టారు. ఇంటి పరిసరాల్లో నీటితొట్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. సీజనల్గా వచ్చే మలేరియా, డెంగ్యూ, జ్వరాలు దరిచేరకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె అవగాహన కల్పించారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగునీటి ప్రాంతాల్లో దోమలు వ్యాప్తిచెందకుండా పారిశుధ్య సిబ్బందిచే బ్లీచింగ్ చల్లించి క్లోరోఫాంను వేయించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి రవి, ఏఎన్ఎం తులసి, ఆశావర్కర్లు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.