Pulses Rates : పండుగల వేళ పప్పుల ధరలు (Pulses price) సామాన్య ప్రజలకు షాకిస్తున్నాయి. నిత్యావసరాలైన పప్పుధాన్యాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా శనగ (Bengal gram), కంది (Red gram), పెసర (Green gram) లాంటి పప్పుల ధరలు గత కొన్ని వారాల్లోనే చుక్కలనంటాయి. ‘ఇండియన్ పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్ (IPGA)’ గణాంకాల ప్రకారం కొన్ని రకాల పప్పుల హోల్సేల్ ధరలు (Whole Sale Rates) గడిచిన నెల రోజుల్లోనే 11 శాతానికిపైగా పెరిగాయి.
దేశంలో అత్యధికంగా వినియోగించే శనగపప్పు ధర నెల రోజుల్లో 11 శాతం, వారం రోజుల్లో 5.5 శాతం పెరిగింది. పెసరపప్పు 10.6 శాతం, కందిపప్పు 6.5 శాతం, బఠాణీ 6 శాతం మేర పెరిగాయి. గడిచిన ఏడాదితో పోలిస్తే శనగపప్పు ధర 23 శాతం, బఠాణీ 47 శాతం, మినప పప్పు ధర 24 శాతం అధికంగా ఉన్నాయి. సోమవారం నాటి రిటైల్ మార్కెట్ సగటు ధరలను పరిశీలిస్తే కిలో శనగపప్పు రూ.88.72, కందిపప్పు రూ.125.72, పెసరపప్పు రూ.112.14, మసూర్ పప్పు రూ.90.43 గా నమోదయ్యాయి.
పండుగ సీజన్ కావడంతో ఇళ్లలో నిత్యావసర సరుకుల నిల్వలు పెంచుకోవడం ఈ ధరల పెరుగుదలకు తక్షణ కారణంగా కనిపిస్తున్నప్పటికీ దీని వెనుక బలమైన సరఫరా ఆందోళనలు కూడా ఉన్నాయని వ్యాపారులు, పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా పప్పుధాన్యాలను అధికంగా పండించే మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు, నేలలో తేమ తగ్గడం వంటి కారణాలతో ఖరీఫ్ పంట దిగుబడిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రత్యేకంగా కందిపప్పు ఉత్పత్తిపై ప్రభావం చూపనుంది.