నకిరేకల్, ఆగస్టు 3: నకిరేకల్ మండలంలో మట్టిమాఫియా రెచ్చిపోతున్నది. నకిరేకల్, కట్టంగూర్, శాలిగౌరారం మండలాల సరిహ ద్దు ప్రాంతాల్లో వందల కొద్ది టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నా ఇరిగేషన్, రెవెన్యూ, మైనింగ్, అటవీశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం పలు అనుమానులకు దారితీస్తోంది. అక్రమార్కులు కడపర్తి గ్రామస్తులను బహిరంగంగానే బెదిరింపులకు గురిచేస్తున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. నకిరేకల్ మం డలం, శాలిగౌరారం మండలాల సరిహద్దు ప్రాంతాల్లో మట్టి మాఫి యా రోజు రోజుకు పెట్రేగిపోతూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అనుమతులు తీసుకోకుండానే భూముల నుంచి భారీ మొత్తంలో మట్టి తవ్వి టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకునేందుకు యత్నించిన గ్రామస్తులను బెదిరింపులకు గురిచేస్తూ “అడ్డొస్తే టిప్పర్లతో తొక్కించుకుంటూ వెళ్తాం, పర్మిషన్ లేకున్నా మట్టిని తరలిస్తాం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ హెచ్చరిస్తున్నారని స్థానికులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిరేకల్ మం డలం కడపర్తి, శాలిగౌరారం మండలం వల్లాల శివారులో గతకొంత కాలంగా ఎలాంటి అనుమతి లేకున్నా కొంతమంది అక్రమార్కులు మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. టిప్పర్ మట్టికి రూ.4 వేల నుంచి 6 వేలు వసూలు చేస్తూ రోజుకు వందలాది లోడ్లు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గుడి, బడి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పేరుతో అనుమతులు తీసుకోకుండానే పెద్ద ఎత్తున ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్నారన్నారు.
దందాను అడ్డుకుంటే బెదిరింపులు..
మట్టి దందాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కడపర్తి గ్రామస్తులను, రైతులను మట్టి మాఫియా నేరుగా బెదిరిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “అడ్డొస్తే టిప్పర్లతో తొక్కించుకుంటూ వెళ్తాం, పర్మిషన్ లేకు న్నా మట్టిని తరలిస్తాం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, పోలీస్ స్టేషన్ పెట్టుకుంటావో పెట్టుకో” అంటూ హెచ్చరిస్తున్నారని స్థానికు లు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి మాఫియాపై జిల్లా ఎస్పీ, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని, గ్రామస్తులమంతా కలిసికట్టుగా అడ్డుకుంటామని తేల్చిచెబుతున్నారు.
గ్రామస్తులకు ఇబ్బందులు
మట్టి అక్రమ రవాణా కారణంగా గ్రామ రహదారులపై దుమ్మూ ధూళి విపరీతంగా ఎగిసిపడుతూ ఇండ్లలో పడుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుమ్మూ ధూళితో చిన్నారులు, వృద్ధులు శ్వాస కోశ సమస్యలతో బాధపడుతన్నట్లు తెలిపారు. వేగంగా వెళ్తున్న టిప్పర్లు కారణంగా ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగినా అధికారులు స్పందించకపోవ డం గమనార్హం. ఈ విషయమై ఆర్ఐ శ్యాం సుందర్రెడ్డిని వివరణ కోరగా కడపర్తి, వల్లాల శివారులో ఉన్న రైతు తన పట్టాభూమిలో మట్టిని చదును చేస్తున్నాడని తెలిపారు. ఇరిగేషన్ ఏఈ చందనను వివరణ కోరగా ‘మట్టి తరలించేందుకు కడపర్తి గ్రామం నుంచి ఎవ రూ ఎలాంటి అనుమతి తీసుకోలేదు.. మా వర్క్ ఇన్స్పెక్టర్ను పంపి, స్థల పరిశీల చేసి రిపోర్ట్ పంపిస్తాం” అని పేర్కొన్నారు. ఏది ఏమైనా నకిరేకల్ మండలంలో మట్టి మాఫియాను అరికట్టడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమైనట్లు తెలుస్తోంది.
పట్టించుకోని అధికారులు
మట్టి తవ్వకాలపై మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. పట్టా భూమి అయినా అనుమతులు తీసుకోవడం లేదని, పలుమార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లే మట్టి మాఫియా రెచ్చి పోతోందని, ఈ వ్యవహారంలో ఎవరి ప్రమే యం ఉందో విచారణ జరిపించాలని కడపర్తి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
దుమ్మూ ధూళితో శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి..
కట్టంగూర్ మండలం చెర్వు అన్నారం టు కడపర్తి రోడ్డులో అక్రమం గా మట్టిని తరలిస్తున్నారు. వందల టిప్పర్లు వస్తుండటంతో గతంలో వేసిన కంకర రోడ్లు పాడైపోయాయి. పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. సాయంత్రం పూట నిమ్మకాయల లోడ్లతో ఆటోలు వెళ్లాలంటే గుంత ల్లో దిగబడిపోతున్నాయి. నిమ్మకాయలను మార్కెట్కు తరలించాలం టే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గ్రామం మధ్యలో నుంచి టిప్పర్లు వెళ్లడంతో దుమ్మూధూళితో శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. మట్టి మాఫియాకు వెంటనే అడ్డుకట్ట వేయాలి. అన్నారం టు కడపర్తి రోడ్డుకు బీటీ నిర్మాణం చేపట్టాలి.
– తొడుసు శ్రీను, రైతు, కడపర్తి గ్రామం