Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో 11వ రోజు ఎపిసోడ్ ఆసక్తికరమైన మలుపులతో సాగింది. తొలి వారంలోనే ఎలిమినేట్ అయిన ఆర్జే చరణ్ అనూహ్యంగా మళ్లీ హౌస్‌లోకి అడుగుపెట్టి హౌస్‌మేట్స్‌కు షాక్ ఇచ్చాడు. అంతేకాదు, రీ ఎంట్రీతోనే చరణ్‌కు బిగ్ బాస్ ప్రత్యేక అధికారాన్ని కూడా ఇచ్చాడు. మరోవైపు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ రెండో స్థాయిలో జరిగిన పరిణామాలు కూడా ఆసక్తిని రేకెత్తించాయి. ఎపిసోడ్ ప్రారంభంలో వర్షిణి, ముఖేష్ మధ్య సాన్నిహిత్యం మరోసారి చర్చకు వచ్చింది. వర్షిణి కొంతకాలంగా ముఖేష్‌తో సన్నిహితంగా ఉంటున్న విషయాన్ని హౌస్‌లోని ఇతర సభ్యులు గమనిస్తున్నారు. ఇదే విషయాన్ని నరేష్, అమన్లతో వర్షిణి మాట్లాడుతున్న సమయంలో నరేష్ నేరుగా ప్రశ్నించాడు. ముఖేష్ అంటే ఇష్టమా? అతడు లవర్నా, ఫ్రెండా అంటూ అడగడంతో వర్షిణి సిగ్గుపడుతూ అలాంటిదేమీ లేదని చెప్పింది.
అయితే ముఖేష్‌ను తానే అడిగి తెలుసుకుంటానని నరేష్ చెప్పాడు. ఈ సంభాషణ జరుగుతున్న సమయంలో ముఖేష్ వర్షిణికి తెలియకుండా ఆమె వెనుకే కూర్చుని ఉండటం, ఒక్కసారిగా ఆమెను తాకడంతో వర్షిణి భయపడటం, ఆ తర్వాత సిగ్గుతో నవ్వడం ఎపిసోడ్లో ప్రత్యేకంగా నిలిచింది. ఇక కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ రెండో స్థాయిలో త్రిగుణ్, రామ్ ప్రసాద్, దేబ్జానీ పోటీ పడ్డారు. మొదటి దశను మిగతా ఇద్దరికంటే ముందుగా పూర్తి చేసిన దేబ్జానీ.. రెండో దశలో మాత్రం వెనుకబడింది. దీంతో ఆమె కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశాన్ని కోల్పోయింది. అదే సమయంలో యమలోకంలోని భటుల వేషధారణలో కొందరు హౌస్‌లోకి ప్రవేశించడంతో హౌస్‌మేట్స్‌లో ఉత్కంఠ నెలకొంది. వారిలో కొందరు ఎవరినైనా ఎలిమినేట్ చేయడానికి వచ్చారని సభ్యులు భావించారు. వారి అనుమానం నిజమే అనిపించేలా షాలినిని ఒక భటుడు చేయి పట్టుకుని గేట్ వరకు తీసుకెళ్లాడు. తాను నిజంగానే ఎలిమినేట్ అయ్యానా అంటూ షాలిని ఆందోళన చెందింది.
కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. మిగతా భటులు బయటకు వెళ్లిపోయినప్పటికీ, షాలిని చేయి పట్టుకున్న వ్యక్తి మాత్రం హౌస్‌లోనే ఉండిపోయాడు. అతడి మాస్క్ తొలగించగా అందరికీ ఊహించని సర్ప్రైజ్ ఎదురైంది. తొలి వారంలో ఎలిమినేట్ అయిన ఆర్జే చరణ్ తిరిగి హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. చరణ్‌ను చూసిన హౌస్మేట్స్ ఆనందంతో అతడిని ఆప్యాయంగా పలకరించారు. బిగ్ బాస్‌కు కృతజ్ఞతలు తెలిపిన చరణ్.. ఈసారి మరింత సీరియస్‌గా గేమ్ ఆడతానని చెప్పాడు. చరణ్ రీ ఎంట్రీతో పాటు అతడికి బిగ్ బాస్ ఇచ్చిన ప్రత్యేక అధికారం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్లుగా ఉన్న వారిలో ఒకరిని నేరుగా తొలగించే అవకాశం చరణ్‌కు ఇచ్చారు. లేదంటే తనకు నచ్చిన ఒక కంటెండర్‌ను ఎంచుకుని అతడితో పోటీ పడి గెలిస్తే, అతడిని తప్పించి తాను కెప్టెన్సీ కంటెండర్‌గా మారే అవకాశం కూడా ఉంది.
ఈ రెండు అవకాశాల్లో పోటీ చేయడానికే చరణ్ మొగ్గు చూపాడు. తన ప్రత్యర్థిగా త్రిగుణ్‌ను ఎంచుకున్నాడు. ఈ పోటీకి రామ్ ప్రసాద్‌ను సంచాలకుడిగా బిగ్ బాస్ నియమించాడు. అయితే ఆట ప్రారంభానికి ముందే రామ్ ప్రసాద్‌కు నిబంధనలు అర్థం కాక గందరగోళం మొదలైంది. రూల్స్ తనకు అస్సలు అర్థం కావడం లేదని, తాను సంచాలకుడిగా ఉండలేనని రామ్ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశాడు.బిగ్ బాస్ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదని, ఆట నిబంధనలు బోర్డుపై స్పష్టంగా రాసి ఉన్నాయని చెప్పాడు. అయినప్పటికీ రామ్ ప్రసాద్‌కు పూర్తిగా క్లారిటీ రాలేదు. అంతేకాదు, హౌస్‌లోని ఇతర సభ్యులు కూడా ఆట నిబంధనల విషయంలో అయోమయానికి గురయ్యారు.
టాస్క్‌లో వివిధ రంగుల్లో ఉన్న పలకలను నిచ్చెనకు నిర్ణీత విధంగా అమర్చాల్సి ఉంది. అయితే నిబంధనలపై స్పష్టత లేకపోవడంతో రామ్ ప్రసాద్ తొలుత చరణ్ విజేతగా ప్రకటించాడు. దీంతో బిగ్ బాస్ జోక్యం చేసుకుని చరణ్ అన్ని నిబంధనలను పాటించాడా అని ప్రశ్నించాడు. దీంతో రామ్ ప్రసాద్ మరోసారి అయోమయానికి గురయ్యాడు. చివరకు నిబంధనలను మరోసారి పరిశీలించిన తర్వాత త్రిగుణ్ విజేతగా ప్రకటించారు.ఇలా 11వ రోజు ఎపిసోడ్లో వర్షిణి–ముఖేష్ సాన్నిహిత్యం, దేబ్జానీ కెప్టెన్సీ కంటెండర్ అవకాశాన్ని కోల్పోవడం, యమభటుల గెటప్‌లో వచ్చిన సభ్యులు, ముఖ్యంగా ఆర్జే చరణ్ అనూహ్య రీ ఎంట్రీ, అతడికి లభించిన ప్రత్యేక అధికారం ప్రధాన హైలైట్స్‌గా నిలిచాయి.