బోయినపల్లి రూరల్, మార్చి 11 : భక్తులను ఆశీర్వదించాల్సిన పూజారి, ఓ భక్తుడికే టోకరా ఇచ్చాడు. తిరుమల దర్శనం టికెట్లతోపాటు రైలు టికెట్లు బుక్ చేస్తానంటూ నమ్మించి, అతడికి తెలియకుండా ఫోన్ నుంచి 18.46 లక్షలను కాజేశాడు. తీరా బాధితుడు బ్యాంకుకు వెళ్లడంతో అసలు మోసం తెలిసి నివ్వెరపోయాడు. తర్వాత ఫిర్యాదు చేయడంతో మోసం చేసిన పూజారిపై బుధవారం కేసు నమోదైనట్టు బోయినపల్లి ఎస్ఐ రమాకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల ప్రకారం.. బోయినపల్లి మండలానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి గంగాధర మండలం ఒద్యారం గ్రామంలోని వేంకటేశ్వర దేవాలయానికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో పూజారి సాయి తరుణ్‌తో పరిచయం ఏర్పడింది. రెండు నెలల క్రితం తాను తిరుపతి వెళ్లాలని చెప్పడంతో సాయి తరుణ్ తిరుపతి దర్శనం టికెట్లు, రైలు టికెట్లు ఫోన్ ద్వారా బుక్ చేస్తానని నమ్మబలికాడు.
ఒద్యారం వెళ్లినప్పుడల్లా విశ్రాంత ఉద్యోగి ఫోన్ తీసుకొని, అతడికి తెలియకుండా డబ్బులు తనకు తెలిసిన వ్యక్తికి యూపీఐ చేయడం మొదలు పెట్టాడు. తర్వాత మెసేజ్‌లు డిలీట్ చేశాడు. టికెట్లు బుక్ కావడం లేదని సాకులు చెబుతూ నమ్మించాడు. ప్రతిసారి రప్పించి, ఓసారి ఓ టికెట్లు అయిపోయాయని, మరోసారి సర్వర్ బిజీ ఉందని కారణాలు చెబుతూ ఫోన్ నుంచి డబ్బులు మాయం చేస్తూనే ఉన్నాడు. రెండు రోజుల క్రితం విశ్రాంత ఉద్యోగి తనకు డబ్బులు అవసరం పడి డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్లగా, డబ్బులు లేవని సిబ్బంది చెప్పడంతో హతాశుడయ్యాడు. తర్వాత స్టేట్మెంట్ తీసుకొని, రెండు నెలల కాలంలో దఫదఫాలుగా మొత్తం 18.46 లక్షలను ఇల్లంతకుంట మండలం నర్సకపేట గ్రామానికి చెందిన దామర హరీశ్ నంబర్‌కు ట్రాన్స్ఫర్ అయినట్టు గుర్తించాడు. తర్వాత తనకు జరిగిన మోసంపై బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.