న్యూఢిల్లీ: ఎల్పీజీ సిలిండర్ల కొరత నేపథ్యంలో భారతీయులు ఇండక్షన్ స్టవ్‌లను తెగ కొనేస్తున్నారు. దీంతో ఆన్లైన్, ఆఫ్ లైన్ స్టోర్లలో వివిధ రకాల ఇండక్షన్ స్టవ్‌లు స్టాక్ లేకుండా పోతున్నాయి! కొన్ని ఆఫ్‌లైన్ స్టోర్లు, సూపర్ మార్కెట్లలో మాత్రం స్టాక్ పరిమితంగా ఉంటున్నది. మెట్రో పాలిటన్ నగరాల్లోని ప్రజలు ముందు జాగ్రత్త చర్యగా వీటిని కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. గ్యాస్ కొరత ఉండదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తున్నా.. సిలిండర్ల సరఫరాలో జాప్యం కారణంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో ప్రత్యామ్నాయం కోసం విద్యుత్తుతో పనిచేసే స్టవ్‌లను వంటకు ఉపయోగించాలని ప్రజలు భావిస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో భారీ ధర పలుకుతుండటం కూడా ఇండక్షన్ స్టవ్‌లకు గిరాకీ పెరగడానికి కారణమైంది.