Dev Ji | మావోయిస్టుల అగ్ర నేత హిడ్మా ఎన్కౌంటర్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తూ పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టు ఉద్యమంలో కీలక నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ పోలీసుల ఎదుట లొంగిపోయారని ఊహాగానాలు వస్తున్నాయి. ఇటీవలే ఆయన ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయారని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తిప్పిరి తిరుపతి విషయానికొస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల ఆయన స్వస్థలం. తిప్పిరి తిరుపతి దాదాపు 43 ఏండ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. దళిత కుటుంబంలో పుట్టిన ఆయన.. ఇంటర్ వరకు కోరుట్లలోనే చదివారు. 1978 ప్రాంతంలో రైతుకూలీ పోరాటాలు, విద్యార్థి సంఘాలు, రాడికల్ స్టూడెంట్ యూనియన్ పోరాటాల్లో పాల్గొని కూలీరేట్ల పెంపుదలలో భాగస్వాములయ్యారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్ కోరుట్ల శాఖలో కీలకంగా ఉన్న ఆయన 1982లో ఆర్ఎస్యూ విద్యార్థులపై సాగిన మారణహోమంపై ఒగ్గుకథ రూపంలో ప్రచారం చేశారు. ఆరెస్సెస్, ఏబీవీపీ తిరుపతిపై పలుమార్లు దాడులకు దిగాయి. అప్పట్నుంచే పీపుల్స్‌వార్ కార్యక్రమాల ప్రాధాన్యం వివరించడంతో ఆయనపై నిర్బంధం పెరిగిపోయింది. పలుకేసులతో జైలుకు సైతం వెళ్లారు.
గణపతి కార్యదర్శిగా పీపుల్స్‌వార్ పార్టీ తన ప్రస్తానాన్ని కొనసాగించిన క్రమంలో మల్లోజుల కోటేశ్వర్రావు, నల్లా ఆదిరెడ్డి, శీలం నరేశ్, పులి అంజన్న, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి, నంబాల కేశవరావు, మాధవ్, తిప్పిరి తిరుపతి కీలక భూమిక పోషించారు. పీపుల్స్‌వార్‌లో దళ సభ్యుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన తిరుపతి, పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కార్యదర్శిగా, ఛత్తీస్‌గఢ్ స్టేట్ కమిటీ మెంబర్‌గా, దళ కమాండర్‌గా, జోనల్ కమిటీ మెంబర్‌గా, స్టేట్ కమిటీ మెంబర్‌గా, ప్లాటూన్ కమాండర్‌గా పనిచేసినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం కేంద్ర మావోయిస్టు పార్టీ మిలటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేస్తున్నట్టు సమాచారం. 2010వ సంవత్సరంలో ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో 74 మంది జవాన్ల మృతికి కారణమైన ఘటనలో తిప్పిరి తిరుపతి కీలక పాత్ర పోషించారు. పీపుల్స్‌వార్, మరికొన్ని విప్లవ గ్రూపులు కలిసి 2004లో మావోయిస్టు పార్టీగా అవతరించాయి. పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణ్‌రావును మావోయిస్టు కేంద్ర కమిటీ తొలి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. వృద్ధాప్యం నేపథ్యంలో గణపతి స్థానంలో నంబాల కేశవరావు కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన ఈ ఏడాది మేలో ఎదురుకాల్పుల్లో చనిపోయిన నేపథ్యంలో మావోయిస్టు కేంద్ర కమిటీ కొత్త కార్యదర్శిగా మావోయిస్టు పార్టీ మిలటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేస్తున్న తిప్పిరి తిరుపతిని నియమించినట్టు ప్రకటించింది.
మావోయిస్టుల కదలికలతో ఏపీలో హై అలర్ట్ కొనసాగుతోంది. అడవిలో నుంచి ఏపీకి వచ్చిన మావోయిస్టుల కోసం భద్రతాబలగాల గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో 31 మంది మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు.. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లా కొప్పవరంలో ఇద్దరు మావోయిస్టులను అరెస్టుచేశారు. అలాగే ఏలూరులో 15 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో చాలావరకు దేవ్‌జీ అనుచరులు ఉన్నట్లుగా తెలుస్తోంది.