జఫర్‌గఢ్, మార్చి 1 : సామాజిక ఉద్యమకారుడు, మా ఇల్లు ఆశ్రమ వ్యవస్థాపకుడు గాదె ఇన్నయ్య అరెస్ట్ దుర్మార్గమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. పేద పిల్లలకు అండగా నిలిచిన వ్యక్తిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేధిస్తున్నాయన్నారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం సాగరంలో గాదె ఇన్నయ్య తండ్రి సలోమోన్రెడ్డి వృద్ధాప్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న పల్లా ఆదివారం ఆయన భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఇన్నయ్యను, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తండ్రిని కోల్పోయి, మరోవైపు అరెస్ట్‌తో బాధలో ఉన్న ఇన్నయ్యకు ఆయన ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 2001 నుంచి తెలంగాణ సాధించే వరకు ఇన్నయ్యతో పాటు వారి కుటుంబం ఉద్యమంలో మమేకమైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తూ ఇన్నయ్యపై కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇన్నయ్యను జైలులో ఉంచడం అన్యాయమన్నారు. తెలంగాణ ఉద్యమం తర్వాత ‘మా ఇల్లు’ ప్రజాదరణ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో మంది పేద పిల్లలకు అండగా ఉన్నారన్నారు. ఆశ్రమంలోని పేద పిల్లలకు సాయం చేస్తున్న దాతలను కూడా బెదిరించడం దురదృష్టకరమన్నారు.
సమాజంలో అవసరాలు ఉన్నవారికి ప్రభుత్వాలు సాయం చేయనపుడు మానవత్వంతో ముందుకొచ్చిన ఇన్నయ్యను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇన్నయ్య జైలుకు వెళ్లాడనే బెంగతో కేవలం నెలన్నర రోజుల వ్యవధిలోనే తల్లి, తండ్రి కన్ను మూయడం మరింత బాధాకరమన్నారు. ఇన్నయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అధినేత కేసీఆర్, నేతలు కేటీఆర్, హరీశ్‌రావుతో మాట్లాడి ఇన్నయ్య కుటుంబానికి అవసరమైన సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వాలు, పోలీసులు ఇప్పటికైనా గమనించి, సమాజానికి ఉపయోగపడే వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని పల్లా కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు పిన్నింటి విజయ్ కుమార్, పీఏసీఎస్ మాజీ చైర్మెన్ గుండ్రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, యువజన నాయకులు కేసిరెడ్డి రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.