నవీపేట, ఆగస్టు 14: మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక భాగంలో విద్యార్థుల కోసం నిర్మించి నిరుపయోగంగా ఉన్న హాస్టల్ భవనాన్ని విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తహసీల్ కార్యాలయం ఎదుట పీడీఎస్యూ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ సాయికిరణ్గౌడ్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షుడు రేహాన్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలో వందల మంది విద్యార్థుల కోసం గత ప్రభుత్వ హయాంలోనే నిర్మించిన హాస్టల్ భవనం నేటికీ నిరుపయోగంగా ఉందన్నారు.
నిత్యం విద్యార్థులు కళాశాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వెళ్తున్నారని అన్నారు. కళాశాల నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు రోడ్డు మార్గం సరిగాలేక పోవడంతో ఇరిగేషన్ కాలువపై వేసిన ఇనుప పైప్పై నుంచి విద్యార్థులు సర్కస్ ఫీట్లు చేస్తూ వెళ్లాల్సి వస్తున్నదని అన్నారు. అదుపు తప్పి కింద పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు గణేశ్, రూపేశ్, సంపత్, ఆయాన్ తదితరులు పాల్గొన్నారు.