సంగారెడ్డి ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జిల్లాపై శీతకన్ను వేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడస్తున్నా జిల్లాలో అభివృద్ధి పనులు జరగడంలేదు. రేవంత్‌రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టాక జిల్లాకు పెద్ద పరిశ్రమలు, కొత్త ప్రాజెక్టులు రాలేదు. నిధులు ఇవ్వడం లేదు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు అటకెక్కాయి. జిల్లా అంతటా రోడ్లు గుంతలు పడి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో యువకులు రహదారులపై నాట్లు వేసి నిరసన తెలిపారు. విద్యుత్, తాగునీరు, సాగునీటి సమస్యలతో రైతులు సతమతమవుతున్నారు. తాగునీరు అందక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.
అందోల్, నారాయణఖేడ్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదు. సంగారెడ్డిలో మూడురోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పనుల పేరిట జలాలను ఖాళీ చేశారు. దీంతో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. వర్షాల లేమి, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో జిల్లాలో నీటి ఇక్కట్లు పెరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గానికి తాగునీటి సరఫరా కోసం రూ.20 నుంచి రూ.50 కోట్ల నిధులు అవసరం ఉంది. విద్యుత్ సరఫరా సరిగ్గా లేక ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ స్థానంలో కేవలం 8 నుంచి 9గంటలు మాత్రమే కరెంట్ వస్తుంది. కొత్త పింఛన్ల కోసం వందలాది మంది అర్హులు ఎదురుచూస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్తరేషన్ కార్డులు, తులం బంగారం,మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని సంగారెడ్డి జిల్లా ప్రజలు సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేస్తున్నా రు. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్‌సీల్లో సరైన వైద్యసేవలు అందడం లేదు. ప్రభుత్వ దవాఖానల్లో వైద్యు లు, మందుల కొరత వేధిస్తోంది. వైద్యారోగ్యశాఖ మంత్రి సంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు సరైన వైద్యసేవలు అందడం లేదు.
సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ సంగమేశ్వ,బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని 397 గ్రామాల పరిధిలో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కేసీఆర్ రూ.2653 కోట్లు మంజూరు చేయడంతోపాటు పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను బంద్ పెట్టింది. సంగమేశ్వ, బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిలిపివేయడంతో ఐదు నియోజకవర్గాల్లోని రైతాంగానికి సాగునీరు అందడం లేదు.
సంగారెడ్డి జిల్లాలో ప్రజలు కొత్తరేషన్కార్డులకోసం నెలలు తరబడి ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 4.48 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్తరేషన్‌కార్డుల కోసం ఆరువేల మంది అర్హులు దరఖాస్తు చేసుకున్నారు. స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీకి శనివారం సంగారెడ్డికి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి కొత్తరేషన్‌కార్డుల జారీపై ప్రకటన చేయాలని జిల్లాలోని పేదలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో 1,51,268 మంది పింఛ న్లు తీసుకుంటున్నారు. కొత్త పింఛన్ల కోసం 30వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త పింఛన్లు మంజూరు చేయడంలేదు.
పటాన్చెరు నియోజకవర్గం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో 54 మంది కార్మికులు మృతి చెందారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు కోటి ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి 13 నెలలు గడస్తున్నా ఇప్పటి వరకు సాయం అందలేదు. మాజీ మంత్రి హరీశ్‌రావు మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తూ వారికి పరిశ్రమ, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకుంటున్నారు. కోటి రూపాయల సాయం అందజేయాలని బాధితులతో కలిసి హరీశ్‌రావు ఆందోళన చేపట్టినా ప్రభుత్వం స్పందించడం లేదు.
జహీరాబాద్ నియోజకవర్గంలోని నిమ్జ్ భూనిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి మాటను నిలబెట్టుకోలేదు. గత ఏడాది మేలో ఆయన జహీరాబాద్‌లో పర్యటించారు. న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లోని నిమ్జ్ భూనిర్వాసితులు 5612 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఏడాది దాటినా ఇంత వరకు ఇండ్లు దక్కలేదు.
సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. సింగూరు ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల పక్కన ఇరువైపులా కట్టల మరమ్మతు పనుల కోసం ప్రభుత్వం రూ.61 కోట్లు కేటాయించింది. పనుల్లో జాప్యంతోపాటు నాసిరకంగా పనులు చేస్తున్నారు. మరో ఏడాది పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ అదనంగా మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. రెండేండ్లుగా సింగూరు ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడే కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు కింద పంటల సాగు తగ్గింది. క్రాప్‌హాలిడే నేపథ్యంలో ప్రభుత్వం ఇన్‌ఫుట్‌సబ్సిడీ ఇవ్వాలని సింగూరు ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రోరైలు విస్తరిస్తామని ప్రకటించి, ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు విస్తరించాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ రహదారి 65 విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. హైదరాబాద్-ముంబయి వయా జహీరాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం జహీరాబాద్ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.