కంఠేశ్వర్/కామారెడ్డి, ఆగస్టు 14: జెండా పండుగకు ఉభయ జిల్లాలు ముస్తాబయ్యాయి. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థల్లోనూ మువ్వన్నెల జెండాలను ఎగురవేసేందుకు సన్నాహాలు చేశారు. కలెక్టరేట్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. నిజామాబాద్‌లోని పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, కామారెడ్డిలో మరో ప్రభుత్వ సలహాదారు వి.హన్మంత్‌రావు జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు.
ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజామాబాద్‌లో పంద్రాగస్టు వేడుక ఏర్పాట్లను కలెక్టర్ భవేశ్ మిశ్రా, సీపీ సాయిచైతన్య, అదనపు కలెక్టర్ భుజంగరావు శుక్రవారం పరిశీలించారు. వేదిక, బారికేడింగ్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట జిల్లా రెవెన్యూ అధికారి గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, ట్రైనీ ఆర్డీవో సందీప్, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, ఏసీపీ ప్రకాశ్ తదితరులున్నారు.