మోర్తాడ్, ఆగస్టు 14: బీడీ కార్మికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా కటాఫ్ తేదీని తొలగించి ప్రతినెలా రూ.4,016 జీవనభృతిని ఇవ్వాలని ప్రగతిశీల బీడీవర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రమేశ్, జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తెమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు కమ్మర్‌పల్లిలో బీడీ కార్మికులతో శుక్రవారం ర్యాలీ నిర్వహించి, తహసీల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ నరేశ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీడీ కార్మికులకు జీవనభృతిని పెంచాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికుల ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసులో కోట్ల రూపాయలు మురుగుతున్నాయని, పెన్షన్లు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీడీ కార్మికులకు తగినంత ఆకు, తంబాకు ఇవ్వడంతోపాటు 26రోజుల పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నాన్ పీఎఫ్ కార్మికులకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఈఎస్ఐ కార్మికులకూ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. నాయకులు రాజేశ్వర్, అరవింద్, ఎస్.సురేశ్, కిషన్, డాక్టర్ సత్యనారాయణ, దహల్సింగ్, బాలయ్య, భాను, బీడీ కార్మికులు పాల్గొన్నారు.