సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): స్టాక్స్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు సంపాదించవచ్చని నమ్మించి ఓ సాప్ట్వేర్ ఉద్యోగికి సైబర్‌నేరగాళ్లు రూ.17 లక్షలు టోకరా వేశారు. నాచారానికి చెందిన బాధితుడి ఫోన్ నెంబర్‌ను క్యూ5.5 ఏబీఎస్ఎల్ విజినరీ గ్రూప్ పేరుతో ఉన్న వాట్సాఫ్ గ్రూప్‌లో యాడ్ చేశారు. అందులో అందరూ తాము ట్రేడింగ్‌లో లాభాలు ఆర్జించామని స్క్రీన్‌షాట్స్ పోస్టు చేస్తున్నారు. కొత్తవారు ఎవరైనా గ్రూప్‌లో ఉంటే ఏబీఎస్ఎల్హెచ్ఎన్డబ్ల్యూ పేరుతో ఉన్న యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని కేవైసీ పూర్తి చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని సూచించారు.
బాధితుడు అకౌంట్ క్రియేట్ చేసుకొని రూ.50 వేలు పెట్టుబడి పెట్టాడు. అందులో కొంత లాభం రాగా, రూ. 30 వేలు విత్ డ్రా చేసుకున్నాడు. దీంతో ఆ యాప్‌పై నమ్మకం కుదిరి దఫ దఫాలుగా రూ.18 లక్షలు పెట్బుటడి పెడుతూ వెళ్లాడు, స్క్రీన్‌పై లాభాలు కన్పిస్తున్నా విత్ డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోయింది. రూ.లక్ష అందులో నుంచి విత్ డ్రా చేసుకోగా మిగతా రూ.17 లక్షలు బాధితుడు మోసపోవడంతో మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.