గద్వాల : గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్మిచేడు గ్రామంలో జరిగిన రెండు చోరీ కేసుల ( Thefts Cases ) ను పోలీసులు ఛేదించారు. మహారాష్ట్రలోని ధారాశివ్ (ఉస్మానాబాద్) జిల్లాకు చెందిన రితిక్ షిండేను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు గోయం పరారీలో ఉన్నాడని సీఐ టంగుటూరి శ్రీనివాస్ ( CI Srinivas ) వెల్లడించారు.
ప్లాస్టిక్ సామాన్లు విక్రయించే పేరుతో గద్వాల పరిసర గ్రామాల్లో తిరుగుతూ ఇళ్లను రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. బాధితులు కెంపు ఎల్ల బుజ్జమ్మ, ప్రేమల హైరోజమ్మల నుంచి చోరీ చేసిన రూ.2.45 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించి, సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్సై శ్రీకాంత్ , కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.