Bomb Threat | ముంబై: బాంబులు పేలుస్తామనే ఈమెయిల్ ముంబై మేయర్ (Mayor) రితూ తావ్డే అధికారిక మెయిల్‌కు వచ్చింది. ఈ ఈమెయిల్ రావడం ఇది మూడోసారి. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15కు ముందు పాఠశాలలు, మెట్రో, స్టాక్ ఎక్స్చేంజ్, ప్రముఖ వ్యక్తులపై బాంబు దాడులు చేస్తామని హెచ్చరిక ఆ ఈమెయిల్లో ఉంది. అంతేకాకుండా ఖలిస్తాన్ అనుకూల నినాదాలతో పాటు కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఘాట్కోపర్, మరోల్ నాకా, అంధేరి, గుండవలి, ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్నినస్ వంటి ప్రాంతాల్లో కారు బాంబులతో దాడి చేస్తామని హెచ్చరించింది. అలాగే పిల్లలను పాఠశాలలకు పంపవద్దని, ముంబై మెట్రోలోకి తీసుకురావద్దని కోరింది.
ఖలిస్తాన్ జిందాబాద్, సిక్కులకు స్వాతంత్య్ర దినోత్సవం లేదు అని ఆ మెయిల్లో ఉంది. అంతేకాకుండా ప్రధాని మోదీకి మద్దతుగా ఉన్న హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లను వేర్వేరుగా దాడిచేయడమే లక్ష్యమని వెల్లడించింది. ఆగస్టు 15న భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయం, స్వాతంత్య్ర వేడుకలకు అంతరాయం కలిగించడంతో పాటు మధ్యాహ్నం 12:11 గంటలకు ముంబైని అస్థిరపరుస్తామని, 3:11 గంటలకు మేయర్ కార్యాలయంపై దాడి చేస్తామని ఆ మెయిల్లో రాసి ఉంది. ఇలా మూడోసారి మెయిల్ రావడంతో సైబర్ పోలీసులు మెయిల్ ఐపీ (IP) అడ్రస్, పంపిన వ్యక్తి వివరాలను గుర్తించే పనిలో పడ్డారు.