హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో అనవసరంగా వేలుపెట్టామా? అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌ను ఇరికించేందుకు వేచిన పాచికలన్నీ ఫెయిలయ్యాయా? కేసీఆర్‌ను బద్నాం చేయాలనుకుంటే.. మనమే ఉల్టా బద్నాం అయ్యే పరిస్థితి ఏర్పడిందా? వేలుపెట్టి దిబ్బతిన్నామా? బూచిగా చూపిన అసైన్డ్ భూమి ఇప్పుడు మన మెడకే ఉరితాడై చుట్టుకోనున్నదా? మనం ఏదో ఉన్నదనుకుంటే.. అధికారులేమో ఏమీ లేదని నివేదిక ఇచ్చారు.. ఇప్పుడేం చేద్దాం? ఈ డ్యామేజ్‌ను ఎట్లా కంట్రోల్ చేసుకుందాం?’ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శిబిరాన్ని ఆందోళనకు గురిచేస్తున్న అంశాలు.
కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఇంచ్ అసైన్డ్ భూమి కూడా లేదని రెవెన్యూ అధికారులు ముఖ్యమంత్రికి రహస్య నివేదిక ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నివేదిక నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, కుట్రదారుల శిబిరంలో అంతర్మథనం మొదలైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఫాంహౌస్ భూముల్లో అనవసరంగా ఏలుపెట్టి తప్పుచేశామనే భావనలో ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కేసీఆర్‌ను అసైన్డ్ వివాదంలో ఇరికిద్దామనుకుంటే.. అది రివర్స్‌గా తమ ప్రభుత్వాన్నే ఇరకాటంలో పడేసే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది.
మాజీ సీఎం కేసీఆర్ 388 ఎకరాల అసైన్డ్ భూమిని ఆక్రమించుకున్నారని, విచారణకు, సర్వేకు సీఎం రేవంత్ ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు ఆగమేఘాలపై ఎర్రవెల్లి భూముల్లో వాలిపోయారు. రెండు రోజులుగా రాత్రనక, పగలనక, తిండీ తిప్పలు మానేసి భూముల వెంట తిరుగుతున్నారు. సీఎం చెప్పిన 325 సర్వే నంబర్లో, వ్యవసాయ క్షేత్రంలో మొత్తం సర్వే చేశారు. ఈ సర్వేలో కుట్రదారుల కండ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించినట్టుగా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో 388 ఎకరాలు కాదు కదా… ఒక్క ఇంచ్ కూడా అసైన్డ్ భూమి లేదని రెవెన్యూ అధికారులు తేల్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ రహస్య నివేదికను ఇప్పటికే రెవెన్యూ అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి చేరవేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
‘అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. బొల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట’ పాత సినిమాలోని ఓ పాట ఇది. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి బ్యాచ్ పరిస్థితి కూడా అచ్చం అలాగనే ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కేసీఆర్ ఫాంహౌస్‌పై రెవెన్యూ అధికారులు ఇచ్చిన రహస్య నివేదిక చూసిన సీఎం రేవంత్‌రెడ్డి, కుట్రల బ్యాచ్ బిత్తరపోయినట్టు తెలిసింది. నిజం నిగ్గుతేలడంతో తీవ్ర ఆందోళనకు గురువుతున్నట్టు తెలిసింది. రెవెన్యూ శాఖ నివేదికను, నిజాన్ని జీర్ణించుకోవడంలేదని తెలిసింది. ఫాంహౌస్‌లో ఏమైనా దొరుకుతుందేమో.. దాన్ని పట్టుకొని రచ్చ చేద్దామనుకుంటే ఇలా జరిగిందేమిటనే ఆందోళనలో ఉన్నట్టు చర్చ జరుగుతున్నది.
అసెంబ్లీ వేదికగా ఏదో గొప్పగా సవాల్ విసిరితిమి.. ఇప్పుడు ఏం చేద్దామనే మథనంలో ఉన్నట్టు తెలిసింది. నివేదిక చూసిన సీఎం రేవంత్‌రెడ్డి రెవెన్యూ అధికారులపై చిందులేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘నేనేం చెప్పిన.. మీరేం చేశారు? ఇదేం నివేదిక?’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఏమైనా తప్పులు వెదకాలని చెబితే, మీరేమో కేసీఆర్‌కు క్లీన్‌చీట్ ఇచ్చేలా నివేదిక ఇస్తరా?’ అంటూ ఊగిపోయినట్టు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై రెవెన్యూ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘ఆదేశాల ప్రకారం సర్వే చేసినం… అక్కడ ఏం ఉన్నదో అదే నివేదిక ఇచ్చినం. సీఎం అనుకున్నట్టు అక్కడ అసైన్డ్ భూమిలేకపోతే మేం ఏం చేస్తాం’ అని రెవెన్యూ అధికారులు చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులపై కుట్రల బ్యాచ్ బెదిరింపులకు దిగుతున్నట్టు తెలిసింది.
తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించి కేసీఆర్‌ను బద్నాం చేద్దామనుకున్న కాంగ్రెస్ సర్కార్ కుట్రలు బెడిసికట్టాయి. ఇప్పుడు అవి కాంగ్రెస్ పార్టీకే రివర్స్ అవుతున్నాయి. కేసీఆర్ అసైన్డ్ భూములు అక్రమించుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆరోపించడం, రెవెన్యూ అధికారుల సర్వేలో అవన్నీ తప్పుడు ఆరోపణలని తేలడంతో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్‌పై ఇంత నీచపు ఆరోపణలకు దిగజారుతారా? అనే చర్చ నడుస్తున్నది.
రాజకీయాల కోసం ఇంత దిగజారాలా? అసెంబ్లీ వేదికగా తప్పుడు ఆరోపణలు చేయాలా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇలా రేవంత్‌రెడ్డి ఆరోపించినట్టుగా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో అసైన్డ్ భూమి లేదనే వాస్తవం బయటకు పొక్కడంతో కుట్రల బ్యాచ్‌కు కంటిమీద కునుకులేదని తెలిసింది. ఇది కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని భారీ డ్యామేజ్ చేసే అవకాశం ఉన్నదనే ఆందోళన వారిలో నెలకొన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో డ్యామేజ్ కంట్రోల్‌కు ఏం చేద్దామని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే మరో డ్రామాను రక్తికట్టించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కేసీఆర్ ఫాంహౌస్‌లోని అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకొని దళితులకు పంచుతామంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
ఇప్పుడు పరువు పోకుండా ఉండేందుకు అక్కడే ఉన్న అసైన్డ్ భూమిని పంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. అప్పటికే ఆ భూమిపై పట్టాలిచ్చారు. అయితే, ఇప్పుడు పరువు నిలుపుకొనేందుకుగాను గతంలో ఇచ్చిన పట్టాలనే మళ్లీ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. కేసీఆర్ ఫాంహౌస్‌తో సంబంధంలేని అసైన్డ్ భూముల పట్టాలను మళ్లీ పంచి.. దీన్నే కేసీఆర్ ఫాంహౌస్‌లోని అసైన్డ్ భూమిగా తప్పుడు ప్రచారం చేయాలని కుట్రలు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతోపాటు ఇప్పటికే ఎర్రవెల్లి గ్రామ ప్రజలు కేసీఆర్‌కు పూర్తి మద్దతుగా నిలిచారు. సర్వేకు వచ్చిన అధికారులకు నిజాలన్నీ తేల్చి చెప్పారు. కేసీఆర్ ఒక్క ఇంచ్ కూడా తమ భూమి గుంజుకోలేదని, పైగా తమ భూములను చదును చేయించి, వ్యవసాయానికి అనువుగా మార్చి.. నీళ్లు ఇచ్చి పుణ్యం కట్టుకున్నారని చెప్పారు. పక్క గ్రామాల రైతుల భూములపై అసత్య ప్రచారం చేస్తూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది.
కేసీఆర్ ఫాంహౌస్‌లో అసైన్డ్ భూమి దొరుకుతుందేమోనని సీఎం రేవంత్‌రెడ్డి ఆశపడ్డారు. కానీ, కథ అడ్డం తిరగడంతో ఆయన తీవ్ర నిరాశకు గురైనట్టు తెలిసింది. ఒకవేళ అక్కడ అసైన్డ్ భూమి ఉన్నదని తేలితే అసెంబ్లీ వేదికగా రచ్చ చేద్దామని సీఎం భావించినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రెవెన్యూ అధికారుల నివేదికను అసెంబ్లీ వేదికగా ప్రదర్శించి కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు భారీ ప్లాన్ వేసినట్టు తెలిసింది.
ఇందులో భాగంగానే రెవెన్యూ అధికారుల సర్వే పూర్తయ్యే వరకు అసెంబ్లీ సమావేశాలను పొడగించారనే చర్చ జరుగుతున్నది. వాస్తవానికి, బుధవారం అసెంబ్లీ సమావేశాలను పూర్తి చేసి నిరవధికంగా వాయిదా వేయాల్సి ఉన్నది. కానీ, ఫాంహౌస్‌లో సర్వేకు రెండు రోజుల సమయం పడుతుందని అక్కడి అధికారులు చెప్పడంతో ఉద్దేశపూర్వకంగానే శుక్రవారం వరకు అసెంబ్లీ సమావేశాలను పొడగించినట్టు తెలిసింది. గురువారమే కేసీఆర్ ఫాంహౌస్ భూములపై కొంత స్పష్టత రావడం, అది శుక్రవారం మధ్యాహ్నం వరకు పూర్తి స్పష్టత రావడంతో ఇక చెప్పేది, చేసేది ఏమీ లేక అసెంబ్లీ సమావేశాలను ముగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అందుకే, మరో రెండు మూడు రోజులు కొనసాగించాలనుకున్న సమావేశాలను శుక్రవారమే ముగించడం గమనార్హం.