ఆ ఊరులో విద్యుత్తు లేదు, రహదారీ లేదు, అంగన్వాడీ లేదు. కానీ… ఇంటి ముందే నల్లా ఉన్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అశ్వాపురంపాడు గిరిజన ఆవాసంలో మేం ఫీల్డ్ విజిట్ చేస్తున్నాం. దట్టమైన అటవీ ప్రాంతంలోని ఆ పల్లెలో 30 కుటుంబాలకు చెందిన 125 మంది గుత్తికోయ ఆదివాసీలు నివసిస్తున్నారు. ‘మాకు కరెంట్ లేదు… రహదారి లేదు… మా పిల్లలకు అంగన్వాడీ బడి కూడా లేదు…’ అని ఒక మహిళ తన బాధలను చెప్పింది. తాగునీరు ఉన్నదా? అని అడిగాం. అప్పుడే ఒక యువకుడు ముందుకొచ్చాడు. ‘నీళ్లకు లోటులేదు… వాటి వల్లనే మేం ఈ మాత్రం జీవిస్తున్నాం’ అని తెలిపాడు. ఆ మాట మమ్మల్ని ఒక్క క్షణం ఆపింది. మీకు నీళ్లు ఎలా వస్తున్నాయి? అని అడిగాం. అతను పక్కనే ఉన్న నల్లాను చూపించాడు. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని తెలిపాడు.
మారుమూల గిరిజన పల్లెలో కూడా మిషన్ భగీరథ పైపుల ద్వారా ప్రతి ఇంటికీ రోజుకు రెండుసార్లు నీళ్లు వస్తున్నాయి. అడవిలో మిగిలిన అన్ని చీకట్ల మధ్య ఆ చిన్న నల్లా ఒక పెద్ద వెలుగులా అనిపించింది. ఎందుకంటే… తాగునీరు అంటే దాహం తీర్చే నీరు మాత్రమే కాదు. అది ఆరోగ్యం, అది సమయం. అది మహిళల శ్రమకు విముక్తి. అది పిల్లల బాల్యం. అది ఒక కుటుంబం తన గౌరవంతో జీవించే అవకాశం. తెలంగాణలోని అనేక మారుమూల, గిరిజన ప్రాంతాల్లో తాగునీటి కోసం మహిళలు, పిల్లలు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. కొన్ని చోట్ల బావులు, వాగులు, చెలిమెలే ఆధారం. వేసవిలో అవి ఎండిపోతే పరిస్థితి మరింత దారుణంగా మారేది. నీరు దొరికినా అది తప్పనిసరిగా సురక్షితమైన నీరు అవుతుందనే నమ్మకం ఉండదు. వాగుల్లో ప్రవహించే నీటిలోనే పశువులు తిరుగుతుంటాయి. అదే నీటిని ప్రజలు వడకట్టుకుని, మరిగించి లేదా కొన్నిసార్లు ఎలాంటి శుద్ధి లేకుండానే తాగాల్సి వచ్చేది. నీటి కోసం వెళ్లే ప్రతి ప్రయాణమూ అంటే ఒక మహిళకు గంటల సమయం. ఆమె ఆ సమయాన్ని కోల్పోతే కుటుంబ ఆదాయానికి, పిల్లల చదువుకు, తన ఆరోగ్యానికి నష్టం. అందుకే ఇంటి ముందుకు వచ్చే సురక్షితమైన నీటి నల్లా ఒక మౌలిక సదుపాయం మాత్రమే కాదు, సామాజిక మార్పుకు ఒక తొలి అడుగు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన, స్థిరమైన పైపుల తాగునీటిని అందించేందుకు భారీ స్థాయిలో మిషన్ భగీరథ పథకాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. 2016 ఆగస్టు 7న ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి, మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండలో మిషన్ భగీరథను అధికారికంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికీ రోజుకు 100 లీటర్ల చొప్పున శుద్ధి చేసిన నీటిని అందించడం, ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యాల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కోసం కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలు, వాటి ఉపనదులు, ప్రధాన జలాశయాలను నీటి వనరులుగా ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మిషన్ భగీరథ వెబ్సైట్ ప్రకారం ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలో 23,861 గ్రామీణ ఆవాసాలు, 54.61 లక్షల గ్రామీణ గృహాలు ఉన్నాయి. మొత్తం పైపులైన్ నెట్వర్క్ సుమారు 1.50 లక్షల కిలోమీటర్లు. 2021 తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం రాష్ట్రంలోని 24,028 గ్రామీణ ఆవాసాలు మిషన్ భగీరథ ద్వారా పైపుల నీటి సరఫరా పరిధిలోకి వచ్చాయి.
ప్రభుత్వ గణాంకాలు ప్రకారం మిషన్ భగీరథ ద్వారా 2023-24లో 23,960 హ్యాబిటేషన్లను కవర్ చేసింది. ఇదేమీ ఒక చిన్న నీటి పథకం కాదు. ఒక రాష్ట్రం మొత్తాన్ని నల్లాలతో అనుసంధానించాలనే అరుదైన భారీ ప్రయత్నం. అడవుల్లోని ఆవాసాలకు నీరు చేరడం… అంత సులభం కాదు.
మారుమూల గిరిజన ఆవాసాలకు పైపులు వేయడం మైదాన ప్రాంత గ్రామాలకు చేసినంత సులభం కాదు. కొండలు, అడవులు. వాగులు. రోడ్లు లేని మార్గాలు. చిన్న ఆవాసాలు. కొన్నిచోట్ల ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానం చేయడం సాధ్యం కాకపోవడంతో ప్రత్యామ్నాయ నీటి వనరులు, స్థానిక నీటి సరఫరా వ్యవస్థలు అవసరమవుతున్నాయి. 2020లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని రాళ్లాపురం గుత్తికోయ ఆవాసానికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందడం ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. ఆ సమయంలో ఆ ఆవాసాన్ని రాష్ట్రంలో పైపుల తాగునీరు పొందిన తొలి గుత్తికోయ ఆవాసంగా పేర్కొన్నారు. అదే సమయంలో మరో అసంపూర్ణ కథను కూడా ఉన్నది. అశ్వాపురంపాడులో ప్రాథమిక పాఠశాల గానీ, అంగన్వాడీ కేంద్రం గానీ లేదు. దీంతో అక్కడి 25 మంది చిన్నారులు ప్రాథమిక విద్యకు, పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. అభివృద్ధి ఒకేసారి అన్ని తలుపుల్ని తట్టలేదు. ఇది మన ప్రభుత్వాలకూ, అధికార వ్యవస్థకూ ఒక ముఖ్యమైన పాఠం. ఒక గిరిజన ఆవాసానికి నీరు అందించడం గొప్ప విషయం. కానీ అదే కుటుంబం రాత్రిపూట చీకట్లో ఉంటే? పిల్లలు బడికి వెళ్లడానికి రహదారి లేక ఇబ్బంది పడితే? చిన్నారులకు అంగన్వాడీ లేకపోతే? అప్పుడు నీటి నల్లా ఒక మంచి ప్రారంభం మాత్రమే. సంపూర్ణ అభివృద్ధి కాదు. మిషన్ భగీరథలాంటి భారీ పైపుల నీటి వ్యవస్థలను నిర్మించడం ఒక దశ. వాటిని నిరంతరం పనిచేసేలా చేయడం మరో పెద్ద బాధ్యత. ప్రభుత్వాలు దశల వారీగా అభివృద్ధిని కొనసాగించాలి. ప్రభుత్వం విద్యుత్తు, రహదారి, అంగన్వాడీ ఏర్పాటుపై దృష్టి సారించాలి.
2026 మార్చిలో ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోనే 141 ఆవాసాలను తాగునీటి కొరతకు గురయ్యే ప్రాంతాలుగా అధికారులు గుర్తించినట్టు నివేదికలు చెప్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కొన్ని గిరిజన ప్రాంతాల్లో వాగులు, చిన్న నీటి ప్రవాహాలు ఎండిపోయే దుస్థితిని మా ఫీల్డ్ విజిట్‌లో గుర్తించాం. అందువల్ల ఇంటికి నీరు రావడం మాత్రమే కాదు… రానున్న రోజుల్లో కూడా అదే నీరు రావాలంటే అడవులు, వాగులు, చెరువులు, భూగర్భ జలాలను కాపాడుకోవాలి. ‘నీళ్లకు లోటులేదు… వాటి వల్లనే ఈ మాత్రం జీవిస్తున్నాం’ అని అశ్వాపురంపాడు యువకుడు అన్నపుడు తాగునీరు లేని కుటుంబ జీవితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక మహిళ భుజాలపై మోసిన కుండలో కేవలం నీరు ఉండదు. ఆమె నడిచిన కిలోమీటర్లు ఉంటాయి. ఆమె కోల్పోయిన సమయం ఉంటుంది. ఆమె శరీరంపై పడిన శ్రమ ఉంటుంది. కొన్నిసార్లు… ఆ నీటితో వచ్చిన అనారోగ్యం కూడా ఉంటుంది. అందుకే ఇంటి ముందు ఒక నల్లా కనిపించినప్పుడు… ఒక కుటుంబానికి దక్కిన ఆరోగ్యం. ఒక పల్లెకు వచ్చిన గౌరవం. అభివృద్ధి అంటే భారీ నిర్మాణాలు మాత్రమే కాదు. మనిషి ఇంటి ముందుకు చేరిన చిన్న సౌకర్యమే… నిజమైన అభివృద్ధికి కొలమానం.