ప్రభుత్వానికి ఉండాల్సిన 388 ఎకరాల భూమి ఎవరి ఆధీనంలో ఉన్నది? ఈ రోజు ఆ భూమిని ప్రభుత్వం తీసుకొని, ఎర్రవల్లిలో డప్పు కొట్టిన ఒక్కో దళితుడికి అర ఎకరం చొప్పున.. 800 ఫ్యామిలీలకు పట్టాల రూపంలో పంచుతా. ఆ జిల్లా మంత్రి రాజనర్సింహ, ఇన్చార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామితోపాటు రెవెన్యూ అధికారులకూ నేను ఆదేశాలు జారీ చేస్తున్న. 30 రోజుల్లో ఈ 388 ఎకరాల సంగతి తేల్చాలి. ఆ గడువులోపల పని చేయకపోతే, అధికారుల మీద, మంత్రుల మీద కూడా నేను చర్యలు తీసుకొంటా. వాళ్లను క్షమించే ప్రసక్తే లేదు. డప్పుకొట్టిన 800 మంది దళితులను ఆ భూములకు యజమానులను చేస్తా.
– ఈ నెల 16న శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి మోగించిన ‘డప్పు’ ప్రకటన వెనుక అత్యంత ప్రమాదకరమైన దళిత వ్యతిరేక కుట్ర దాగుందన్న పచ్చి నిజం బట్టబయలైంది. మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్ష్రేతం లెకలు తేలుస్తామని, భూములు గుంజుకొని నిరుపేదలకు పంచుతామని సీఎం ఇచ్చిన పిలుపు.. చిట్ట చివరికి ఎర్రవల్లి దళిత రైతుల మెడకు ఉరితాడుగా మారుతున్నది. అకడ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం లాకోవాలని చూస్తున్నది కేసీఆర్ వ్యవసాయ భూమిని కాదు.. తరతరాలుగా చెమటోడ్చి, రాతిబండలను సేద్యపు నేలలుగా మార్చుకున్న అసలైన ఎర్రవల్లి దళిత రైతుల భూములేనన్న వాస్తవం అధికారవర్గాల అంతర్గత సమాచారంతో వెలుగుచూసింది.
గులాబీ బాస్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలన్న గుడ్డి కక్షతో.. నాలుగు దశాబ్దాలుగా మట్టినే నమ్ముకున్న దళితుల పొట్టకొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త దగాకు తెరలేపింది. 1980లో నాటి ప్రధాని ఇందిరమ్మ ఇచ్చిన అసైన్డ్ పట్టాలనే రద్దు చేసి, సర్వే నంబర్ 325లోని దాదాపు 330 ఎకరాల సాగు భూమిని నిర్దాక్షిణ్యంగా గుంజుకోవాలని చూస్తున్నది. ఆ భూమిని తమ కంటి సైగ మేరకు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వద్ద డప్పుకొట్టిన కాంగ్రెస్ పార్టీ దళిత కార్యకర్తలకు పంచిపెట్టి రాజకీయ పహారా కాయించాలనే కుటిల వ్యూహం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నది.
శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘ఎర్రవల్లి సర్వే నంబర్ 325లో 388 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నది. కానీ ఈ రోజు 295 ఎకరాలే రికార్డుల్లో ఉన్నది. మిగిలిన భూమి ఎక్కడ ఉన్నది? 700 ఎకరాల ఫామ్ హౌస్ నీ ఆధీనంలో ఉన్నదా? లేదా? ఈరోజు కేసీఆర్ సమాధానం చెప్పాలి. నేను ఇకడి నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్కు, కలెక్టర్‌కు ఆదేశాలిస్తున్నా. తక్షణమే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి ఆయన కొనుగోలు చేసింది ఎంత? అకడ అందుబాటులో ఉన్న భూమి ఎంత? ప్రభుత్వానికి ఉండాల్సిన 388 ఎకరాల భూమి ఎవరి ఆధీనంలో ఉన్నది? ఈ రోజు ఆ భూమిని ప్రభుత్వం తీసుకొని.. ఏ దళితులైతే, ఫామ్‌హౌస్ ముందు డప్పు కొడితే పసుపు నీళ్లు చల్లిండ్రో.. ఈ 388 ఎకరాలను.. ప్రతి దళితుడికి అర ఎకరం కింద.. 800 ఫ్యామిలీలకు పట్టాల రూపంలో పంచుతా. ఆ జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహకు .. ఆ జిల్లా ఇన్చార్జి మినిస్టర్ వివేక్ వెంకటస్వామికి, రెవెన్యూ మినిస్టర్‌కు నేను ఆదేశాలిస్తున్నా.. 30 రోజుల్లో ఇది తేల్చాలి. రెవెన్యూ అధికారులకు నేను ఆదేశాలిస్తున్నా.. 30 రోజుల్లో పని చేయకపోతే, అధికారుల మీద, మంత్రుల మీద కూడా నేను చర్యలు తీసుకుంటా. క్షమించే సమస్యే లేదు’ అని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు టార్గెట్ చేసిన సర్వే నంబర్ 325 వెనుక ఒక సుదీర్ఘ చరిత్ర ఉన్నది. 1980లో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలోనే ఇకడి 80 నిరుపేద దళిత కుటుంబాలకు అసైన్డ్ పట్టాలిచ్చారు. నాటి నుంచి దళితులు ఆ భూమినే నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ నాలుగు దశాబ్దాల్లో వారి సంతానం విస్తరించింది. దాదాపు 180 కుటుంబాలు అయ్యాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎర్రవల్లి గ్రామ పునర్నిర్మాణం చేపట్టి, 180 మంది దళిత కుటుంబాలకు పకా ఇండ్లు కట్టించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. ఈ మొత్తం కుటుంబాలకు సర్వే నంబర్ 325లోని భూమే జీవనాధారం.
ప్రస్తుతం అదే సర్వే నెంబర్లోని భూమిలో రెవెన్యూ రికార్డుల ప్రకారం 243 మంది దళితులు పట్టాదారులు ఉన్నారు. అందులో 236 మందికి 2 ఎకరాల్లోపు, ఆరుగురికి 2 ఎకరాలు, మరొకరికి 2.20 ఎకరాల భూమికి చట్టబద్ధమైన అసైన్డ్ పట్టాలున్నాయి. దాదాపు 13 బీసీ కుటుంబాలకూ భూములున్నాయి. కాలక్రమంలో కొంత భాగం కొండపోచమ్మ ప్రధాన కాలువకు పోగా, మరికొంత పాండురంగ చెరువు, కోణం కుంటల ముంపునకు గురైంది. ఇవన్నీ పోను ప్రస్తుతం 300 నుంచి 330 ఎకరాల విస్తీర్ణం మాత్రమే దళితుల ప్రత్యక్ష ఆధీనంలో సాగుకు అనువుగా మిగిలింది. దశాబ్దాలుగా ఎవరూ అధికారికంగా ల్యాండ్ డివిజన్ చేయకపోవడంతో, రైతులు పట్టా విస్తీర్ణానికి అటుఇటుగా ఆ భూమిని కబ్జాలో ఉంచుకొని రాత్రింబవళ్లు శ్రమించి పచ్చని పంటచేలుగా మలుచుకున్నారు.
ఎర్రవల్లి దళిత రైతుల చేతుల్లోంచి భూములను లాకోవడానికి ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా, నిర్దాక్షిణ్యమైన ప్రణాళికను సిద్ధం చేసింది. 1980లో నాటి ప్రధాని ఇందిరమ్మ హయాంలో పేదలకు దకిన అసైన్డ్ హకులను ఏ విధంగా రద్దు చేయవచ్చో తేల్చేందుకు ప్రత్యేకంగా రెవెన్యూ చట్టాలు, నిబంధనలను లోతుగా అన్వేషించాలని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ప్రధానంగా ‘తెలంగాణ అసైన్డ్ భూముల (బదలాయింపు నిషేధ) చట్టం-1977లోని నిబంధనలు, అందులోని ‘షరతుల ఉల్లంఘన’ (Violation of Assignment Conditions) క్లాజులనే రేవంత్ సరార్ ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నట్టు సమాచారం.
ముఖ్యమంత్రి నిర్దేశించిన 30 రోజుల డెడ్‌లైన్‌తో గజగజలాడుతున్న జిల్లా యంత్రాం గం, క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది రాత్రింబవళ్లు పాత రికార్డులు, ఖాస్రా పహాణీలు, అసైన్మెంట్ రిజిస్టర్లను తిరగేస్తూ కసరత్తు ముమ్మరం చేశారు. సర్వే నంబర్ 325 పరిధిలోని ప్రస్తుత పట్టాదారులుగా నమోదై ఉన్న 243 మంది దళిత రైతులకు వ్యక్తిగతంగా ‘షోకాజ్ నోటీసులు’ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ‘మీరు పట్టా నిబంధనలను ఎందుకు ఉల్లంఘించారు? ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సాగులో ఎందుకు వ్యత్యాసాలు ఉన్నాయి?’ అనే అంశాలపై సంజాయిషీ కోరుతూ వారికి నామమాత్రపు వ్యవధి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది.
దశాబ్దాలుగా ఎర్రవల్లి దళితుల చేతుల్లో ఉన్న సాగు భూమిని బలవంతంగా వెనకి తీసుకొని, ప్రతి దళిత కుటుంబానికి అర ఎకరం చొప్పున కేటాయించి, దాదాపు 660 మందికి కొత్తగా అసైన్డ్ పట్టాలు పంచేలా పకా ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిసింది. అంటే, తరతరాలుగా నెత్తురు ధారపోసి రాతి భూములను సేద్యపు నేలలుగా మార్చుకున్న అసలైన ఎర్రవల్లి దళిత రైతులు ఇందిరమ్మ ఇచ్చిన చట్టబద్ధమైన పట్టాలు కోల్పోయి, తమ సొంత భూమిలో ఏకంగా మూడో వంతును శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తున్నది. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం చుట్టూ కాంగ్రెస్ రాజకీయ కార్యకర్తలతో శాశ్వతంగా ‘పహారా’ ఏర్పాటు చేయడమే సరార్ ప్రధాన వ్యూహంగా సమాచారం.
మరోవైపు ప్రభుత్వ ఏకపక్ష వైఖరిపై ఎర్రవల్లి అసైనీ కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. తమ భూములపై అనుభవం, సాగు పరిస్థితిని సమగ్రంగా సర్వే చేయకుండానే పట్టాల రద్దుకు చర్యలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా మట్టిని నమ్ముకున్న దళిత కుటుంబాల భూముల విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ముందుగా తమకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు, సాగు అనుభవం, భౌతిక స్వాధీనం, నివాస పరిస్థితులు, రెవెన్యూ రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని ఎర్రవల్లి దళిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి సర్వే నిర్వహించకుండా, సాగుదారుల వాదనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయనిచ్చేది లేదని చెప్తున్నారు. గ్రామంలో టెంట్ వేసి ప్లకార్డులతో ప్రత్యక్ష నిరసనలకు దిగేందుకు సంసిద్ధమవుతున్నారు. ‘325పై రాజకీయం చేయకండి.. మా పొట్టకొట్టకండి’ అని గళమెత్తుతున్నారు.