సిటీబ్యూరో: గ్రేటర్ ప్రయాణికులపై ఆర్టీసీ మరోసారి భారం మోపింది. టీ 24 టికెట్ ధరను పెంచింది. ఇప్పటివరకు రూ.130 ఉన్న టికెట్ ధరను ఆదివారం నుంచి రూ. 150కి పెంచింది. ఒకేసారిగా 20 రూపాయల భారం ప్రయాణికుడిపై పడింది. అలాగే సీనియర్ సిటిజన్లకు రూ. 110 ఉన్న ధర రూ. 120గా మార్చింది. పిల్లలకు రూ. 90లుగా ఉండగా, రూ. 100 చేశారు. గ్రేటర్లో ఏసీ మెట్రో డీలక్స్ బస్సుల్లో 15% రాయితీ కల్పించామని గొప్పలు చెప్పుకొంటున్నఆర్టీసీ టీ 24 టికెట్ ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతున్నది.
స్టూడెంట్ బస్సు పాస్, జనరల్ బస్సు చార్జీలు పెంచిన ఆర్టీసీ..టి20 టికెట్ ధరలు పెంచడంతో ఆర్టీసీ ప్రయాణం ఖరీదుగా మార్చేస్తున్నది. 25 బస్సు డిపోల పరిధిలో 12 వేలకు పైగా టి24 టికెట్లను ఆర్టీసీ జారీ చేస్తున్నది. మహాలక్ష్మి పథకంతో బస్సులు రద్దీగా ఉంటున్నాయని బస్సు పాస్ చార్జీలు పెంచి తమకు సీట్లు కూడా ఉండని పరిస్థితి నెలకొందని ప్రయాణికులు ఆగ్రహిస్తున్నారు.