Lenin | అక్కినేని అఖిల్ హీరోగా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ ఈ ఏడాది టాలీవుడ్లో సంచలన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. థియేటర్లలో మంచి వసూళ్లు సాధించి అఖిల్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిన ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు వారి నిరీక్షణకు తెరపడింది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శన జరుపుకున్న అనంతరం ‘లెనిన్’ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ముందుగా ప్రకటించిన సమయానికంటే కొన్ని గంటల ముందే ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రత్యక్షమవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ‘లెనిన్’ సినిమా తెలుగు వెర్షన్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం ఈ చిత్రాన్ని జీ5లో వీక్షించవచ్చు. మిగతా భాషల విడుదలపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని తన కెరీర్లోనే భిన్నమైన పాత్రలో కనిపించి నటనతో ప్రశంసలు అందుకున్నాడు. హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే ఆకట్టుకోగా, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఎమోషన్, యాక్షన్ అంశాలను సమతూకంగా మేళవించి ప్రేక్షకులను మెప్పించారు.
సంగీత దర్శకుడు ఎస్. థమన్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ ఎపిసోడ్స్‌లో థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జునతో పాటు ప్రముఖ నిర్మాత నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు అఖిల్ కెరీర్‌కు కీలకమైన హిట్‌గా నిలిచింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు జీ5 వేదికగా ‘లెనిన్’ చిత్రాన్ని ఇంట్లోనే వీక్షించే అవకాశం పొందారు. ఎమోషన్, యాక్షన్, కమర్షియల్ అంశాలతో రూపొందిన ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.