Crime news : ఎవరైనా తమ పిల్లలు సన్మార్గంలో నడవాలని, విద్యాబుద్ధులు నేర్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటారు. కానీ ఆ తల్లి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. తన రెండో భర్తతో కలిసి కొడుకును ఉగ్రవాదుల్లో చేర్చేందుకు ప్రయత్నించింది. తల్లి, సవతి తండ్రి కలిసి ఉగ్రవాదం గురించి ఆ 16 ఏళ్ల బాలుడికి నూరిపోశారు. బాలుడి ప్రవర్తనలో తేడాను గమనించిన స్కూల్ యాజమాన్యం తల్లి తరఫు బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాకు చెందిన మహిళ మొదటి భర్తతో ఒక కుమారుడు జన్మించిన తర్వాత విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఇస్లాం మతంలోకి మారి వెంబుయమ్ ప్రాంతానికి చెందిన ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే కొడుకును భర్తకు అప్పగించకుండా తన కస్టడీలోనే ఉంచుకుంది. అతడు కేరళలోని ఓ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తుండగా.. అతడి తల్లిసవతి తండ్రి యూకేలో ఉంటున్నారు.
ఈ క్రమంలో ఇటీవల యూకే వెళ్లిన బాలుడికి తల్లి, సవతి తండ్రి ఉగ్రవాదం గురించి నూరిపోశారు. పలు వీడియోలు చూపించి ఉగ్రవాదం వైపు ప్రేరేపితమయ్యేలా చేశారు. ఈ క్రమంలో యూకే నుంచి కేరళకు తిరిగివచ్చిన అతడి ప్రవర్తనలో ఆకస్మిక మార్పును ఉపాధ్యాయులు గమనించారు. ఆరా తీయగా అసలు విషయం బయటపడటంతో వెంటనే అతడి తల్లి తరఫు బంధువులకు సమాచారం ఇచ్చారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఆరోపణల్లో నిజం ఎంత అనే కోణంలో వారు దర్యాప్తు చేస్తున్నారు. తన విడిచిపెట్టి వెళ్లడమేగాక, కొడుకును కస్టడీకి ఇవ్వడంలేదనే కోపంతో ఆమె మొదటి భర్త ఏమైనా కుట్ర చేశాడా..? అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. అదే సమయంలో ఐసిస్ ఉగ్రవాదులతో బాలుడి తల్లి, సవతి తండ్రికి ఉన్న సంబంధం ఏమిటి..? అనే కోణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు.