Harish Shankar | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను తమిళ్ స్టార్ విజయ్ నటించిన తేరికి రీమేక్‌గా తీస్తున్నారనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. అయితే సినిమా వాయిదా పడటం, ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం, అనంతరం ఆయన విజయంతో కథలో మార్పులు జరిగాయనే చర్చలు మొదలయ్యాయి.ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, గ్లింప్సులు చూసిన కొంతమంది ప్రేక్షకులు ఇది ‘తేరి’ రీమేక్నేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ మరోసారి ఈ వివాదంపై స్పందించారు.
హరీష్ శంకర్ మాట్లాడుతూ, “గబ్బర్ సింగ్ సినిమాకి నేను ‘మార్పులు – దర్శకత్వం’ అని మాత్రమే క్రెడిట్ తీసుకున్నాను. అది అధికారిక రీమేక్. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి నేను కథ, మాటలు, దర్శకత్వం అని క్రెడిట్ తీసుకుంటే రీమేక్ అంటారేంటి? మొదట్లో ‘తేరి’ రీమేక్‌గా ఆలోచించాం కానీ తర్వాత పూర్తి స్థాయిలో కథ మార్చేశాం. ఇప్పుడు తీస్తున్నది పూర్తిగా కొత్త కథ” అని స్పష్టం చేశారు. గబ్బర్ సింగ్’లో నేను పెట్టిన అంత్యాక్షరి సీన్ తర్వాత ‘తేరి’లో అలాంటి రైమ్స్ సీన్ కనిపించింది. నా సినిమాలోని కొన్ని అంశాలు అక్కడ కనిపించాయి. అయితే ఇప్పుడు నా సినిమాను ‘తేరి’ రీమేక్ అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇంకేం చెప్పగలను? అని ప్రశ్నించారు.
హరీష్ శంకర్ వ్యాఖ్యలతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై నెలకొన్న రీమేక్ సందేహాలకు కొంతవరకు సమాధానం లభించినట్టే కనిపిస్తోంది. అయితే సినిమా విడుదలైన తర్వాతే అసలు విషయంపై స్పష్టత రానుంది. మరోవైపు, పవన్ కళ్యాణ్‌ను చాలా కాలం తర్వాత మాస్ అవతార్‌లో చూడబోతున్నామన్న ఉత్సాహం అభిమానుల్లో నెలకొంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలా మెప్పిస్తుందో చూడాలి.