Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలతో వార్తల్లో నిలిచిన మను భాకర్ (Manu Bhaker) మళ్లీ ఆ స్థాయిలో రాణించలేకపోతోంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పతకాల వేట కొనసాగిస్తుందనుకుంటే అనూహ్యంగా ఖాళీ చేతులతో నిష్క్రమిస్తోంది. తాజాగా ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భాకర్ నిరాశపరిచింది. కైరో వేదికగా జరిగిన టోర్నీలో విఫలమైన ఆమె ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా ప్రతిరోజూ విజయం సాధించలేరు, ఈ పరాజయం నుంచి చాలా నేర్చుకుంటాను అని అంటోంది విశ్వ విజేత.
ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పతకం సాధించేలా కనిపించిన మను భాకర్ ఫైనల్లో తేలిపోయింది. ర్యాపిడ్ ఫైరింగ్ క్వాలిఫికేషన్లో 586 పాయింట్లు సాధించి టాప్-8లో నిలిచిన ఆమె.. ఫైనల్లో గురి తప్పింది. కేవలం రెండు సార్లు మాత్రమే లక్ష్యాన్ని సాధించి నిరాశపరిచింది. తన ఓటమిపై స్పందించిన ఆమె.. ‘వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకాలే లక్ష్యంగా పెట్టుకున్నాను. కానీ, మెరుగైన ప్రదర్శనే చేయలేదు. మంచి స్కోర్లే సాధించినా.. పోడియం మీద నిల్చోలేకపోయాను. నా టీమ్మేట్ ఇషా పతకం సాధించింది.
VIDEO | Delhi: Here’s what double Olympic medallist Manu Bhaker (@realmanubhaker ) had to say on the launch event of ASMITA (Achieving Sports Milestone by Inspiring Women) social media handle, her performance in the recently concluded World Championships and on India’s… pic.twitter.com/3EhiqK6CYD
— Press Trust of India (@PTI_News) November 18, 2025
క్రీడల్లో మనం ప్రతిసారి, ప్రతిరోజు గెలవలేం. కొన్నిసార్లు ఓడిపోతాం కూడా. నావరకైతే ఈ పోటీల్లో భారత్‌కు పతకం రావడమే ముఖ్యం. ఆ మెడల్ నేను సాధించినా.. మరొకరు గెలిచినా సంతోషమే. అందుకే ఇషా విజయాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నా. ఏ స్పోర్ట్స్‌లో అయినా ఇలానే ఉండాలి. ఇక దివ్యాంగులైన అథ్లెట్ల ప్రదర్శనను ఎంతో మెచ్చుకోవాలి. వైకల్యాన్ని ఎదిరించి విశ్వ వేదికలపై సత్తా చాటుతున్న వాళ్లు మనందరికి స్ఫూర్తిదాయకం’ అని వెల్లడించింది. ఇదే పోటీల్లో తెలంగాణ షూటర్ ఇషా సింగ్ సత్తా చాటి కాంస్యం కైవసం చేసుకుంది.
ఒలింపిక్స్ పతకం కోసం సుదీర్ఘ సాధన చేసిన మను భాకర్ నిరుడు తన కల నిజం చేసుకుంది. మాజీ షూటర్, కోచ్ జస్పాల్ రాణా (Jaspal Rana) శిక్షణలో రెండు కాంస్యాలతో చరిత్రను తిరగరాసింది. పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ దేశం తరఫున పతక బోణీ కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల వ్యక్తిగత విభాగంలో కంచు మోత మోగించింది. ఆ తర్వాత సరబ్జోత్ సింగ్ జతగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లోనూ సత్తా చాటిన ఆమె దేశానికి రెండో కాంస్యం అందించింది.
మను భాకర్, సరబ్జోత్ సింగ్

దాంతో, ఒకే విశ్వక్రీడల్లో రెండు కాంస్యాలతో చరిత్ర పుటల్లో నిలిచింది మను. అయితే.. ఆ తర్వాత ఈ ఏడాదిలో ఆమె గన్ అంతగా పేలలేదు. ఒలింపిక్ ఛాంపియన్‌గా మరిన్ని పతకాలు పట్టేస్తుందనుకుంటే.. తను మాత్రం ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ కాంస్యంతో సరిపెట్టుకుంది.