న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఓ నకిలీ వైద్యుడి నిర్వాకం వల్ల గర్భిణి మృతిచెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అంబేద్కర్ నగర్‌లోని బస్ఖారి ప్రాంతంలో యోగేశ్ వర్మ అనే సర్జన్ కొన్నేండ్లుగా క్లినిక్‌ను నడుపుతున్నాడు. స్థానికంగా ఉండే ఓ గర్భిణి ఫిబ్రవరి 5న ప్రసవం కోసం దవాఖానలో చేరింది. సిజేరియన్ ఆపరేషన్ అనంతరం తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనపై మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. వైద్యుడిగా చలామణి అవుతున్న యోగేశ్ వర్మకు వైద్య అర్హతలు లేవని దర్యాప్తులో గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. యోగేశ్ బీఏ చదివాడని.. వైద్య వృత్తిలో ఎటువంటి అనుభవం లేదని పోలీసులు తెలిపారు. అతడు ఎక్కడా ప్రత్యేక వైద్య శిక్షణ కూడా తీసుకోలేదన్నారు. నకిలీ క్లినిక్ నిర్వహిస్తూ.. సిజేరియన్తో సహా ఇతర శస్త్రచికిత్సలు సైతం చేస్తున్నారని అన్నారు. వెంటనే క్లినిక్‌ను సీజ్ చేసిన పోలీసులు, యోగేశ్‌ను, అతడి సహాయకుడిని అరెస్ట్ చేశామని అన్నారు.