హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ మూడు మున్సిపాలిటీల్లో శనివారం ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్-163 ప్రకారం నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పోలీస్ అధికారులు ప్రకటించారు. ఈ మూడుచోట్లా బీఆర్ఎస్కే స్పష్టమైన మెజారిటీ ఉన్నది. అయితే, గతంలో కాంగ్రెస్ నాయకులు సృష్టించిన ఆటంకాలు, కోర్టు కేసుల కారణంగా ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. హైకోర్టు జోక్యంతో ఎన్నికల సంఘం ఎట్టకేలకు శనివారం ముహూర్తం ఖరారు చేసింది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులకుగాను చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు అవసరమైన 13 మంది కౌన్సిలర్లను బీఆర్ఎస్ గెల్చుకున్నది. ఇండిపెండెంట్ అభ్యర్థి మురళీకృష్ణతోపాటు బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడంతో బీఆర్ఎస్ బలం 15కు చేరింది. కాగా గతంలో కౌన్సిలర్లను కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ పొత్తు పెట్టుకోగా, 22 వార్డులకుగాను 10 వార్డుల్లో బీఆర్ఎస్, 4 వార్డుల్లో సీపీఐ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్-సీపీఐ కూటమికి స్పష్టమైన బలం ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థులు ఏడు స్థానాల్లోనే గెలిచారు. కానీ, మంత్రి వివేక్, కాంగ్రెస్ నేతల అరాచకాల వల్ల గతంలో చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 స్థానాలకుగాను బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వతంత్య్ర అభ్యర్థి ఒకస్థానంలో గెలిచారు. చైర్పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నికలకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకీ దక్కలేదు. ఎన్నిక తొలి రోజు ఫిబ్రవరి 16న కోరం లేక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మరుసటి రోజు కొన్ని పార్టీల కౌన్సిలర్లు హాజరుకాకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11 ఎన్నికలు నిర్వహించగా, 13న ఫలితాలు వెలువడ్డాయి. అదే నెల 16న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక జరిగింది. నాడు వివిధ వివిధ కారణాలతో క్యాతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక వాయిదా పడింది.
మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్ఠానం అప్రమత్తమైంది. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను అడ్డుకొనేందుకు, తమ కౌన్సిలర్లను కాపాడుకొనేందుకు సీనియర్ నాయకులను పరిశీలకులుగా నియమించింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి పార్టీ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మాధవరం కృష్ణారావు, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, క్యాతనపల్లికి మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఖానాపూర్‌కు మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అనిల్‌జాదవ్‌ను ఇన్చార్జులుగా నియమించింది. అధికార కాంగ్రెస్ నాయకుల గత అరాచకాలను దృష్టిలో పెట్టుకొని వారి ఆగడాలను అడ్డుకొనేందుకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్టు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి.