Agni-4 : మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అయిన అగ్ని-4ను ఇండియా విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆగష్టు 6న జరిపిన అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతమైనట్లు కేంద్ర రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్ఎఫ్సీ) ఆధ్వర్యంలో ప్రయోగించిన ఈ క్షిపణి నిర్ణీత లక్ష్యాన్ని చేరుకుందని తెలిపింది.
నిర్వహణా సంబంధమైన, అలాగే సాంకేతికపరమైన అన్ని అంచనాల్ని అందుకుందని వివరించింది. భారీ ఫ్యుయెల్ రాకెట్ మోటార్ కలిగిన ఈ క్షిపణిని రెండు దశల్లో.. అంటే భూ ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించవచ్చు. ఇది 4,000 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకోగలదు. ఇది భారీ పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), ఎస్ఎఫ్సీ కలిపి అగ్ని-4 క్షిపణుల్ని తయారు చేస్తున్నాయి. దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో అగ్ని క్షిపణుల్ని తయారు చేస్తున్నాయి.
ఇంతకుముందు కూడా డీఆర్డీవో పినాకా అనే దీర్ఘ శ్రేణి గైడెడ్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. గత జూలై 8న జరిపిన ఈ పరీక్ష విజయవంతమైంది. ఈ ఏడాది ప్రారంభంలో అగ్ని ప్రైమ్, అగ్ని-3 క్షిపణుల్ని కూడా ఇండియా విజయవంతంగా ప్రయోగించింది.