హైదరాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ): ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలు ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడంతోపాటు కాంగ్రెస్ పార్టీలోనూ లొల్లి పుట్టించింది. తాను చేసినవి తప్పుడు ఆరోపణలని తెలియడంతో సీఎం రేవంత్‌రెడ్డి గప్‌చుప్‌గా ఉన్నట్టు తెలిసింది. అదే సమయంలో తగుదునమ్మా అంటూ కాంగ్రెస్ ఎంపీలు ఎర్రవెల్లి సందర్శన చేపట్టడం పార్టీలో దుమారం రేపింది.
శుక్రవారం ఫాంహౌస్‌కు వెళ్లి అసైన్డ్ భూములను పరిశీలించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిర్ణయించారు. ఇందుకోసం రెండు బుల్లెట్ ఫ్రూఫ్ బస్సులు సైతం అసెంబ్లీకి చేరుకున్నాయి. అయితే, ఈ విషయం తెలిసి.. సీఎం రేవంత్‌రెడ్డి తమ ఎంపీలపై చిందులేసినట్టు తెలిసింది. ‘అక్కడ అసైన్డ్ భూమి లేదని అధికారులే తేల్చారు. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్లి ఏం చేస్తర’ని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అసలు మిమ్మల్ని ఈ యాత్ర ఎవరు పెట్టుకోమన్నారని మండిపడినట్టు సమాచారం.
ఇప్పటికే తాను చేసిన ఆరోపణలు తప్పని తేలడంతో ఏం చెప్పాలో అర్థం కావడంలేదని, దీంతోనే పార్టీకి, ప్రభుత్వానికి డ్యామేజ్ అయిందని, ఇప్పుడు మీరు పోయి ఇంకా రచ్చ చేసి కంపు చేస్తరా? అని అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. అయితే, అప్పటికే మీడియాకు సైతం సమాచారం ఇచ్చామని, ఉన్నపళంగా యాత్రను రద్దు చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్లి ఇజ్జత్ పోతుందని ఎంపీలు చెప్పినట్టు తెలిసింది. దీంతో తెలివిగా ఎర్రవెల్లికి కాకుండా సిద్దిపేట జిల్లా రంగనాయక్‌సాగర్ వద్ద గల మాజీ మంత్రి హరీశ్‌రావు తోట వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. వెంటనే అసెంబ్లీ నుంచి బయల్దేరి.. అక్కడికి వెళ్లి హడావుడి చేసి రావడం గమనార్హం.