హైదరాబాద్, సెప్టెంబర్ 18 నమస్తే తెలంగాణ): తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌పై ఇన్నాళ్లూ అసత్య ఆరోపణలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు 1,000 ఎకరాల భూములు ఉన్నాయంటూ ఇన్నాళ్లూ పదే పదే ఊదరగొట్టిన రేవంత్‌రెడ్డి, చివరకు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌కు ఉన్నది 67 ఎకరాలేనని ఒప్పుకోవడంతో ప్రజల ముందు ఆయనే దోషిగా నిలబడ్డారని చెప్పారు.
ఇదంతా ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే రాజకీయ కుట్రలో భాగమేనని దుయ్యబట్టారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 22ఏ నిషేధిత భూముల జాబితా అంశంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నదని, ఈ అంశంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ గట్టిగా నిలదీస్తుందనే భయంతోనే ముఖ్యమంత్రి డైవర్షన్ రాజకీయాలకు దిగారని మండిపడ్డారు. పద్నాలుగేండ్లపాటు ఉద్యమం నడిపి స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ తన జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని, ఆయన నిర్ణయాలన్నీ ఎల్లప్పుడూ పేదలు, అణగారిన వర్గాల కేంద్రంగానే ఉంటాయని తేల్చిచెప్పారు.
రెవెన్యూ అధికారులు చేయాల్సిన విచారణ పనులను రాజకీయ నేతలు చేస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు హద్దులు దాటి తమ నేతల భూముల్లోకి చొరబడాలని చూస్తే స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కచ్చితంగా ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. ‘కాంగ్రెస్ నేతల్లారా.. ఖబర్దార్! అని ఆయ న తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. సమావేశంలో గెల్లు శ్రీనివాస్‌యాదవ్, దూదిమెట్ల బాలరాజ్యాదవ్ పాల్గొన్నారు.