e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News పోత‌న భాగ‌వ‌తం | దెయ్యాలూ వేదాలు వల్లిస్తాయి!

పోత‌న భాగ‌వ‌తం | దెయ్యాలూ వేదాలు వల్లిస్తాయి!


పోత‌న భాగ‌వ‌తం | దితి, దితి, దనువులు కశ్యప ప్రజాపతి పత్నులు. అదితి పుత్రులు ఆదితేయులు- దేవతలు. దితి సంతానం దైత్యులు. దనువు సంతతి దానవులు. ఈ దైత్య, దానవులనే- వారి సహజ స్వభావాన్ని బట్టి అసురులు, రాక్షసులు అనే గౌణ (గుణ గణాలకు అనుగుణమైన) నామాలతో కూడా పిలుస్తారు. మూర్తీభవించిన హింస, క్రౌర్యం, నిర్దయ రాక్షస స్వభావం. అసువులు అనగా ప్రాణాలు. ‘ప్రాణ’ శబ్దం ఇతర ఇంద్రియాలకు కూడా ఉప లక్షణం- సంకేతం. ఇంద్రియారాములు- ఇంద్రియ సుఖాలతో రమించువారు (మునిగితేలువారు) మూఢులు- అసురులు. విరమించువారు పండితులు- సురులు. ఇప్పటి అసురులు కూడా ఒకప్పటి సురులే- దేవతలే. కాని, అజాగ్రత్త- ప్రమత్తత (ప్రమాదం, సోమరితనం) వల్ల ఉన్నత స్థితి నుంచి పతితులైన వారు, ‘జయ-విజయు’ల వలె దిగజారిన వారు కనుకనే ‘పూర్వ దేవాః’- పూర్వపు దేవతలు అని పిలువబడ్డారు.

‘మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి’ అన్న వికృతపు కూతలు, చేతలు కలవారు. చేతల బట్టే కదా తలరాతలు! ఇతరులకు నీతులు నేర్పే ‘పాతక’ నేతలు! ఆ సంచిత పాపాల వల్లనే ‘అమృత’పానానికి నోచుకోక వంచితులై వారు అసురులు (సుర అనగా అమృతం. అది లేనివారు, దేవతలు కానివారు) అయ్యారు. సురులకు, అసురులకు కల అంతరం (భేదం) స్వరూపంలో కాదు, స్వభావంలో. ఆహార్యం (వేషం), ఆకారంలో కాదు; ఆచారంలో, ఆలోచనలో వ్యత్యాసం. “సాక్షరాః- సాక్షరులు అనగా అక్షరాస్యులు విపరీతులైతే- అడ్డం తిరిగితే ‘రాక్షసాః’ రాక్షసులు అవుతారు. కాని, ‘సరసః’ సరసుడు, స్వారస్యం కల సంస్కారవంతుడు విరుద్ధమైనా- తలకిందులైనా తన సరసత్వాన్ని వీడడు గదా!” ఈ సువర్ణ సూక్తి హిరణ్యకశిపునికి సూటిగా వర్తిస్తుంది.

- Advertisement -

అట్టహాసంగా సాగే భాగవత కథా గంగా ప్రవాహ ప్రధాన ఘట్టాలలో ‘ప్రహ్లాద చరిత్ర’ నిష్ఠగల భక్తులకు చాలా ఇష్టమైన ఒక విశిష్ట ప్రసంగం. ఈ ఘట్టంలో పుట్టుకవి పోతన హరిభక్తికి పట్టం కట్టిన తీరు పాఠకులను ఎంతగా ఆకట్టుకున్నదో ఒక్క పెట్టున పలకడం కష్టం. ఇప్పట్టున అమాత్యుని అనువాద కళ అనితరసాధ్యంగా మూలాన్ని మించి మేలైన రుచులతో మింటి చంద్రుని వలె మిలమిల మెరిసింది! భావుక భక్త హృదయాలపై భక్తిరస ధారలు కురిపించి, మురిపించి మైమరపించింది!

నారదుడు ధర్మరాజుతో.. హిరణ్యకశిపుడు దుఃఖంతో, హతుడైన తన సహోదరునికి- హిరణ్యాక్షునికి దాహక్రియలు చేసి, శోకంతో తల్లడిల్లుతున్న తల్లి దితిని, కుమిలిపోతున్న అతని భార్యలను, కుమారులను రప్పించి సేదతీరే విధంగా వారందరినీ ఓదార్చి ఒప్పించాడు. వేదాంతం ఉపదేశిస్తూ ఇలా ఊరడించాడు..

శా॥ నీరాగార నివిష్ట పాంథుల క్రియన్‌ నిక్కంబు సంసార సం
చారుల్‌ వత్తురు గూడి విత్తురు, సదా సంగంబు లేదొక్కచో
శూరుల్‌ వోయెడి త్రోవఁబోయెను భవత్సూనుండు దల్లీ! మహా
శూరుండాతఁడు తద్వియోగమునకున్‌ శోకింప నీ కేటికిన్‌?

తల్లీ! ఈ సంసారం ఒక చలివేంద్రం వంటిది. ప్రాణులందరూ దాహార్తులై- దాహశాంతి కోసం చలిపందిరి లోనికి ప్రవేశించిన దేహయాత్రా పథికులే- బాటసారులే. వారు వచ్చి చల్లని వారి-నీరు, సేవించి, వారివారి వీథులలోకి విధి నిర్వహణకు వెళ్లిపోవు విధంగా; మనం కూడా ఈ అవని-భూమి, మీదకు వచ్చిన పని ముగించుకొని చనిపోతాము. ఎప్పుడూ ఒక్కచోటనే కలిసి ఉండం. కూడుతూ వడివడిగా వీడుతూ- విడిపోతూ ఉంటాం. మాతా! నీ చిన్నిపట్టి (కొడుకు) జగజ్జెట్టి- జగదేకవీరుడు, మహాశూరుడు. నిన్ను వీరమాతను చేసి వాడు వీరస్వర్గం విజయం చేశాడు. అట్టివాని వియోగానికి నీవు వెత చెందకమ్మా!

జననీ! ఉపాధి (శరీర) రహితుడైన పరమాత్మను అన్నివిధాల ఉపాధిగల వానిగా భావించుటే అజ్ఞానం. దీనివలననే సమస్త ఆధి, వ్యాధులు, ఇష్టాయిష్ట వస్తు సంయోగ వియోగాలు సంభవిస్తాయి. ఆత్మ నిత్యం, సత్యం, అవ్యయం, ఆద్యంత రహితం. ఆత్మకు కాయా (శరీర) సంబంధం కేవలం మాయా మూలకం. జీవునికి కర్మలతో కలిగిన సంబంధం వల్లనే సంసార బంధం- జన్మ మరణ చక్ర పరిభ్రమణం! జన్మ మరణాలు, శోక మోహాలు, చింతా స్మరణలు- అన్నిటికీ అజ్ఞానమే కారణం. మాతా! ఈ పరమార్థ విజ్ఞానాన్ని విశదీకరించడానికి విజ్ఞులు ‘సుయజ్ఞోపాఖ్యానం’ ప్రతిపాదించారు. రుగ్వేదంలోని ‘సుబంధు ఉపాఖ్యానం’ వంటిదే ఇది. ఈ రెండింటి పరమార్థం ఒక్కటే. ఈ ఇతిహాసానికి ‘ప్రేతబంధు యమ సంవాదం’ అని కూడా నామధేయం. అది నీకు వినిపిస్తా విను అన్నాడు హిరణ్యకశిపుడు.

దీనిని బట్టి వేదాంతం కూడా దైవమని, దైత్య (ఆసుర)మని ద్వివిధం (రెండు విధాలు)గా ఉంటుందన్నమాట! తన దోషాలను- అఘాయిత్యాలను, అత్యాచారాలను సమర్థించుకొంటూ ఆలపించే వేదాంతం ఆసుర (రాక్షస) వేదాంతం. ఇతరులకు ఉపదేశించేది దైవ వేదాంతం. పరోపదేశం చేయడంలో వ్యాస-పరాశరుల వలె అందరూ పండితులే. కాని, ఆచరణలో మాత్రం పామరుల వలె ప్రవర్తిస్తారు. చెప్పడానికి, చేయడానికి చాలా ఎడం! చెప్పినట్లు చేయడం కొందరు ప్రాజ్ఞు (మహాత్ము)లకే పరిమితం! తన దుఃఖాన్ని సత్యం (యథార్థం)గా, ఇతరుల దుఃఖాన్ని మిథ్యగా తలచేవాడే రాక్షసుడు- అసురుడు. స్వదుఃఖాన్ని మిథ్యగా, పరదుఃఖాన్ని సత్యంగా భావించి వర్తించువాడు సరసుడైన సంత మహాత్ముడు, సాధు పురుషుడు! (సశేషం)

జీవునికి కర్మలతో కలిగిన సంబంధం వల్లనే సంసార బంధం- జన్మ మరణ చక్ర పరిభ్రమణం! జన్మ మరణాలు, శోక మోహాలు, చింతా స్మరణలు- అన్నిటికీ అజ్ఞానమే కారణం.

– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 98668 36006

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

వైరులూ హరి వారలే!

పోత‌న భాగ‌వ‌తం | దీని భావమేమి శుక మునీంద్ర

పోత‌న భాగ‌వ‌తం | ప్రచేతసుల పరమపద ప్రాప్తి

భద్రమైన గురుబోధ

పరివర్తన చెందడానికే!

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement