Pothana Bhagavatam | శ్రీమద్భాగవతంలో భాసిస్తూ ఉన్న అన్ని కథల కన్నా ఎన్నగ పన్నగశాయి అనన్య భక్తుడైన ప్రహ్లాదుని కథను ఎంతో మిన్నగా విన్నవించాడు తెలుగునాట భక్తకవిగా పేరెన్నికగన్న పోతన్న. బాలప్రహ్లాదుని పాత్రలో భక్తి రసాన్ని పరవళ్లు తొక్కించి భావుక భాగవత భక్త చిత్తాలను మత్తెక్కించి మైమరపింప చేశాడు. సర్వవ్యాపకమైన- అంతటా పరచుకొని ఉన్న నిర్గుణ నిరాకార బ్రహ్మము వలె సగుణ సాకార భగవంతుడు కూడా అణువణువున విస్తరించి భక్తితో పిలిస్తే పలికి వెలికి వచ్చి వరాలు వర్షిస్తాడన్న వాస్తవాన్ని ఇంత సరళంగా, సరసంగా, ముగ్ధమనోహరంగా, స్నిగ్ధ శాస్త్రీయంగా ప్రస్తావించి విస్తారంగా వర్ణించి నిరూపించిన కథ ఇందు తప్ప మరెందునా కనిపించదు.
సత్యవస్తువు- బ్రహ్మము కేవలం నిర్గుణ నిరాకారము కాదు, కేవలం సగుణ సాకారమూ కాదు. నిజానికి అది ఉభయాకారం. ఇలా అనుభవం పొందడమే పూర్ణజ్ఞానం. నిర్గుణ నిరాకార బ్రహ్మము అరణి (కట్టె)లో అవ్యక్తం (అప్రకటితం)గా ఉన్న అగ్ని వంటిది. కళ్లకు కనిపించే వ్యక్తమైన (ప్రకటమైన) కృశానుడు (అగ్ని) సగుణ సాకార బ్రహ్మము. ఈ రెండూ అనిర్వచనీయాలే, అగాధాలే- గూఢములు, గంభీరములే. నిర్గుణ సగుణ బ్రహ్మల కన్నా భగవంతుని నామం మిక్కిలి మహిమోపేతం. నామ జపం వలన ఈ రెండూ సుగమాలు, సులభాలు అవుతాయి. సర్వజీవుల హృదయాలలో సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మ కచ్చితంగా కొలువై ఉన్నా జీవులు అతి దీనులుగాను, మతి హీనులుగాను దుఃఖ తతి (పరంపరల)చే సతమతమవుతున్నారుగా!
నామ మహిమను గుర్తించి త్రికరణ శుద్ధిగా జపించడం వలన ఆ పరబ్రహ్మ వ్యక్తం అవుతాడు. రూపుదాల్చిన బ్రహ్మానందమే భక్తలోకానికి అపురూప ఆదర్శమైన ప్రహ్లాదుడు. నవధా- తొమ్మిది విధాలుగా ఉన్న భక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన పరమ భాగవత శిఖామణి బాల ప్రహ్లాదుడు. ‘శ్రవణం, కీర్తణం విష్ణోః స్మరణం..’ ఈ క్రమంలో స్మరణ భక్తి మూడవది. ‘మామనుస్మర యుధ్య చ’- సర్వకాల సర్వావస్థలలో నన్ను స్మరిస్తూ కర్తవ్య నిర్వహణ గావిస్తూ ఉండమని గీతలో భగవానుని ఆదేశం. ‘ప్రహ్లాదః స్మరణే’-
ప్రహ్లాదుడు స్మరణ భక్తికి ప్రతీకం, దృష్టాంతం. ‘హరినామమే నరహరి అనగా నరసింహస్వామి! సమస్త పాప తాపాలకు నిలయమైన కలియుగమే కనక (హిరణ్య) కశిపుడు. హరినామ జపపరులే ప్రహ్లాదులు. నృసింహదేవుడు హిరణ్యకశిపుని వధించి ప్రహ్లాదుని వరించినట్లు హరినామం కలి కలుషా (పాపా)లను హరించి భక్తులను పరిపరి విధాల పరిపాలిస్తుంది’ అని భక్తకవి వతంసుడు తులసీదాసు తన ‘మానస రామాయణం’లో భవ్యంగా వర్ణించాడు.
రాజసూయ యాగ సందర్భంలో పాండుపుత్రుడైన ధర్మరాజుకు భక్తి విశారుదుడైన నారదుడు ప్రహ్లాద చరిత్రను సభాముఖంగా ఇలా ప్రవచించాడు.
కం॥ సోదరు జంపిన పగకై
యాదర మించుకయు లేక యసురేంద్రుడు కం
జోదరుపై వైరము దు
ర్మాద రతుండగుచుఁ జేసె మనుజాధీశా!
మహారాజా! విరించి (బ్రహ్మదేవుడు) తను వరించిన వరాలన్నీ మారెంచక ప్రసాదించాడనే గౌరవం ఇంచుక కూడా లేకుండా, తన తమ్ముడైన హిరణ్యాక్షుని వధించినందుకు హిరణ్యకశిపుడు మదించి హరిపై అదను చూసి పగ సాధించాలని నిర్ణయించుకున్నాడు. విష్ణువుపై విరోధం పెంచుకున్నాడు. బ్రహ్మదేవుని వరం అసురునికి అమోఘమైన బ్రహ్మాస్త్రమై అలరారింది. ఆ దైత్యవిభుని దురాగతాలు దేవతలకు దుర్భరమైపోయాయి. వరగర్వం వలన కళ్లకు పొరలు కమ్మగా దితి పుత్రుడు దిమ్మదిరిగే పరాక్రమంతో ప్రాణికోటిని పీడించసాగాడు. ఆ దుష్టుని నిరంకుశ నికృష్ట శాసనానికి సృష్టి అంతా భ్రష్టు పట్టింది.
కం॥ కన్నకొడుకు శమదమ సం
పన్నుడు నిర్వైరుడనక ప్రహ్లాదుని వాఁ
డెన్నడు రోషంబున నా
పన్నత నొందించు నాడె పట్టి వధింతున్:
లోకమంతా ఏకాధిపత్యం సాధించి అసురరాజు సురలోకం (స్వర్గం) ఆక్రమించాడు. విధి, విష్ణు, విశ్వేశ్వరులు తప్ప తక్కిన విబుధు (దేవత)లంతా తలలు వంచి అమర విరోధి (అసురుని)కి వశమై అడుగులకు మడుగులొత్తారు. కరుణించమని శరణుకోరారు. భూలోకంలోని ఏ భాగంలో యాగాలు జరిగినా హవిర్భాగాలను హిరణ్యకశిపుడే వచ్చి బలాత్కారంగా హరించుకుపోయేవాడు. యథేచ్ఛగా ఇంద్రియ భోగాలు అనుభవిస్తూ తృప్తిపడక దృప్తుడై- మదగర్వంతో ధర్మమర్యాద (హద్దు)లను అతిక్రమించాడు. ‘శరాబ్ (మద్యం) తాగనివాని దిమాగ్ ఖరాబ్’ అన్న విధంగా మధువును సేవించి మదించి విందుపొందులతో వినోదించేవాడు. వాని ధాటికి ధరణి- భూమి కూడా దున్నకనే అన్ని పంటలు పండేది. దైత్యరాజు రాజదండానికి భయపడిన దేవతలు దిక్కులన్నిటికీ దిక్కయిన దివ్యమూర్తి దేవదేవునికి రక్షించమని మొక్కుకున్నారు. కంటికి కనిపించకుండా కమలనాభుడు- విష్ణువు దేవతలకు ధైర్యం చెబుతూ ఇలా అన్నాడు- ‘అమరులారా! అరమరిక లేక వినండి. మీకు అభయం ఇస్తున్నా. అసుర నాయకుడు చేస్తున్న అశాస్త్రీయ ఆగడాలు నాకు తెలుసు. వాడి పాపం పండి కాలం మూడినప్పుడు వాణ్ని సంహరిస్తా. సాధువులను బాధించేవాడు, విబుధు (దేవత)లను వేధించేవాడు, నిగమా (వేదా)లను నిందించేవాడు, విప్రులకు అప్రియం ఆచరించేవాడు, గోవులను హింసించేవాడు, ధర్మపదవి (మార్గం) తప్పి నాపై పగబూనిన వాడు పెక్కురోజులు నిలువక పతనమైపోతాడు-
నిర్జరులారా! ఈ దుర్జనుడు తన కన్నకొడుకైన ప్రహ్లాదుని, మిగుల సజ్జనుడనీ, శమ దమాది సద్గుణ సంపన్నుడనీ, అజాత శత్రువనీ ఏ మాత్రం ప్రేమ అభిమానాలు లేక ఎప్పుడు బాధిస్తాడో అప్పుడే వాణ్ని వధిస్తా. నేను అన్య (ఇతర)మైనది ఏదైనా సహిస్తాను కానీ, అనన్య భక్తునికి చేసిన ద్రోహాన్ని భరిస్తూ మాత్రం మిన్నకుండలేను. మీకు శుభం కలుగుతుంది. సందేహించక వెళ్లిరండి.’ అచ్యుతుని నుంచి ఇలా అభయం పొంది అమరులు ఆనందిస్తూ తమ ఆవాసాలకు వెళ్లారు. (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 98668 36006
Read More :
పోతన భాగవతం | దెయ్యాలూ వేదాలు వల్లిస్తాయి!
పోతన భాగవతం | వైరులూ హరి వారలే!
పోతన భాగవతం | దీని భావమేమి శుక మునీంద్ర
పోతన భాగవతం | ప్రచేతసుల పరమపద ప్రాప్తి
పోతన భాగవతం | భద్రమైన గురుబోధ
పోతన భాగవతం | పరివర్తన చెందడానికే!