సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): విశ్వనగరం విష వలయంలో చిక్కుకుపోతున్నది. మహానగరంపైకి అక్రమార్కులు విష వాయువులను విడుదల చేస్తూ ప్రాణాంతకంగా మారుస్తున్నారు. పరిశ్రమలు, పలు నిర్మాణ సంస్థలు విచ్చలవిడిగా కాలుష్య కారకాలను వదులుతూ గాలిని విషతుల్యం చేస్తున్నారు. ముఖ్యంగా నిర్మాణాలు జరిగే ప్రాంతాలు, పారిశ్రామికవాడల నుంచి విష వాయువులు ఇష్టారీతిన విడుదలవుతున్నాయి. వారాంతాలు, రాత్రిళ్లు విషపు వాయువులను వదులుతూ నగర ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దీంతో గాలి నాణ్యత గణనీయంగా పడిపోతూ ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్నది. పీఎం-2.5, పీఎం-10 ధూళి కణాలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. సెలవు దినాలు, వారాంతాలు, రాత్రి సమయాల్లో అనుమతి లేని బ్లాస్టింగ్లు చేస్తూ దుమ్ము, ధూళిని నగర ప్రజలపైకి వదులుతున్నారు.
పరిశ్రమల యజమానులు విషపూరిత వాయువులను గాలిలోకి వదులుతూ ప్రాణాంతక వ్యాధుల బారిన పడేలా చేస్తున్నారు. ఇటీవల కాలంలో పీఎం-2.5, పీఎం-10 కణాలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నది. అత్యంత ప్రమాదకర స్థితిలోకి చేరుకుంటున్నది. తాజాగా నగరంలోని పలు చోట్ల 1600 నుంచి 2000 దాకా గాలి నాణ్యత సూచీ పడిపోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి వేడుక చూస్తున్నదని నగర ప్రజలు మండిపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే నగరం మరో ఢిల్లీలా మారుతుందని పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో వారాంతాలు, రాత్రిళ్లు, సెలవు రోజుల్లో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకరంగా క్షీణిస్తున్నది. దీనికి ప్రధాన కారణం నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో అనధికారిక బ్లాస్టింగ్లు, రాక్ కటింగ్స్, క్రషింగ్స్ జరుగుతుండటమేనని తెలుస్తున్నది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు లేకుండా కొంత మంది అక్రమార్కులు అనధికార బ్లాస్టింగ్లు, క్రషింగ్లకు పాల్పడుతున్నారు. ఈ పనులను రాత్రి సమయాలు, సెలవు రోజుల్లో చేస్తూ అధికారుల కండ్లు కప్పుతున్నారు.

Air Pollution
కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్ఎంసీ టాస్క్ఫోర్స్ అధికారుల నిరంతర పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారని ఆ ప్రాంతాల ప్రజలు చెప్తున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం 10 గంటలకు మణికొండ ఫ్రెండ్స్ కాలనీ పరిసర ప్రాంతంలో ఏక్యూఐ 1651గా నమోదైంది. అదే ప్రాంతంలో రాత్రి 8 గంటలకు 2063కు చేరింది. అదేవిధంగా ఫైనాన్సియల్ డిస్ట్రిక్ ప్రాంతంలో రాత్రి సమయాల్లో గాలి నాణ్యత సూచీ ప్రతిరోజు 650కి పైగా నమోదవుతున్నది. దీనికి కారణం ఆయా ప్రాంతాల్లో భారీ ఎత్తున నిర్మాణాలు జరుగుతుడంతో, అక్రమంగా క్రషింగ్స్, బ్లాస్టింగ్స్ చేస్తుండటమేనని పర్యావరణవేత్తలు చెప్తున్నారు.
ఆయా ప్రాంతాల్లో అధికారుల నిఘా కొరవడటం స్పష్టంగా కనిపిస్తున్నదని తెలుస్తున్నది. అదేవిధంగా పారిశ్రామిక వాడల్లోనూ రాత్రి సమయాల్లో విష వాయువులను గాలిలోకి వదులుతున్నారు. ఇలా ఇష్టారీతిన విష వాయువులను గాలిలోకి వదులతుండటం వల్ల శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ల బారిన పడే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీహెచ్ఎంసీ, పీసీబీ అధికారులు ఇప్పటికైనా స్పందించి గాలిని విషతుల్యం చేస్తున్న వారిపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.