రామగిరి, ఆగస్టు 08 : మారుతున్న సాంకేతిక యుగానికి అనుసంధానంగా బోధనలో టెక్నాలజీని ఉపయోగించుకుని విద్యార్థులకు నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని, ఆ దిశగా అధ్యాపకులంతా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ, న్యూఢిల్లీకి చెందిన మదన్ మోహన్ మాలవ్య టీచర్ ట్రైనింగ్ సెంటర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (NIEPA) సంయుక్త ఆధ్వర్యంలో గత నెల 30 నుండి ఈ నెల 7వ తేది వరకు వారం రోజుల పాటు నిర్వహించిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (FDP) విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో ఎంజీయూ వీసీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. 21వ శతాబ్దంలో మారుతున్న విద్యా రంగానికి అనుగుణంగా అధ్యాపకులు నిరంతరం నేర్చుకునే వారిగా ఉండాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా స్వీకరించి, బోధనా ప్రక్రియలో సాంకేతికతను అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించవచ్చని పేర్కొన్నారు. డిజిటల్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు (AI) వంటి ఆధునిక సాధనాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
నిపుణుల బోధన : ’21వ శతాబ్దంలో బోధనా పరివర్తనలు – ఉపాధ్యాయుల పాత్రలు , బాధ్యతలు’ అనే అంశంపై నిపుణులైన రిసోర్స్ పర్సన్లు విలువైన ఉపన్యాసాలు అందించారు.
నిర్వాహకులు : ఈ కార్యక్రమానికి మహాత్మా గాంధీ యూనివర్సిటీ అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డా. వై. ప్రశాంతి కోఆర్డినేటర్గా వ్యవహరించగా.. ఢిల్లీ నీపా నుండి ప్రొఫెసర్ పారేపల్లి శంకర్, ప్రొఫెసర్ అమిత్, డాక్టర్ ఏ.ఎన్. రెడ్డి డైరెక్టర్లుగా వ్యవహరించారు.
మహాత్మా గాంధీ యూనివర్సిటీ అకాడమిక్ కార్డు డైరెక్టర్ శిక్షణ కోఆర్డినేటర్ డాక్టర్ వై ప్రశాంతి మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, సిబ్బందికి, రిసోర్స్ పర్సన్లకు కృతజ్ఞతలు తెలిపారు.