గోదావరిఖని, ఫిబ్రవరి 14 : రామగుండం నగరపాలక సంస్థలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ అభ్యర్థులు నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అభ్యర్థులు తక్కువ మోజార్టీతో ఓటమి చెందిననప్పటికీ.. వారు కష్టపడిన తీరు, అధికార పార్టీపై చేసిన పోరాటం ఆభినందనీయమని ప్రశంసించారు. ఇది నైతికంగా బీఆర్ఎస్ పార్టీ, ప్రజల విజయమని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అరాచక పాలనకు తమ అభ్యర్థుల విజయం నిదర్శనమన్నారు. రామగుండం రాజకీయాల్లో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు. ఎన్ని ఇబ్బందులు కలిగించినా ప్రజలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా గొప్ప తీర్పునిచ్చారన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థులను సత్కరించారు.