సిరిసిల్ల గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగిరింది. అధికార పార్టీకి కోలుకోలేని దెబ్బకొడుతూ జయకేతనం ఎగరేసింది. జననేత, ప్రగతి ప్రధాత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కార్మికలోకం ఎనలేని విశ్వాసం చూపింది. సంక్షోభంలో కూరుకుపోయిన వస్త్రపరిశ్రమకు బీఆర్ఎస్ హయాంలో జౌళీశాఖ మంత్రిగా జీవం పోయడం, ఈ ప్రాంతాన్ని వందలాది కోట్లతో అభివృద్ధి చేయడం, ఊహించని విధంగా అమలు చేసిన సంక్షేమ పథకాలకు కృతజ్ఞతగా రామన్నకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏదో చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతన్న ఉపాధికి గండికొట్టడం, అనేక పథకాలకు కోతపెట్టి జీవితాలను రోడ్డునపడేసిన తీరును వివరించడం, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కేటీఆర్ పిలుపునివ్వడంతో సంపూర్ణ నమ్మకం ఉంచి తిరుగులేని విజయాన్ని అందించింది. ఎన్నికలేవైనా గులాబీదే హవా అని నిరూపించింది.

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ప్రజలతో మమేకమవుతూ ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భుజం తట్టే తీరు. సంతోషం, ఆనందంలోనూ పాల్గొనే నైజం.. పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం.. ఆయన ఇచ్చిన పిలుపుతో సిరిసిల్ల మున్సిపల్లో మరోసారి గులాబీ జెండా ఎగిరింది. హ్యాట్రిక్ విజయాన్ని అందించి అధికార పార్టీని చావుదెబ్బకొట్టింది.
స్వరాష్ట్రంలో కేసీఆర్ సీఎం కాగానే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేనేత, జౌళీశాఖ మంత్రిగా, పురపాలక శాఖ, పరిశ్రమల శాఖ మంత్రిగా సిరిసిల్లను అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. బీఆర్ఎస్ హయాంలో రూ.1564 కోట్లతో సిరిసిల్ల పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి, మౌళిక వసతులు కల్పించారు. రోడ్ల విస్తరణ, ఆహ్లాదమైన పార్కులు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటా తాగునీరు, డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. మెడికల్ కళాశాల, నర్సింగ్, అగ్రికల్చర్ పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాలలు, జేఎన్టీయూ తీసుకువచ్చి విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో గొప్పగా తీర్చిదిద్దారు.
అంతే కాదు, సంక్షోభంలో ఉన్న వస్త్ర పరిశ్రమకు పునర్జీవం పోశారు. నేత కార్మికుల ఆకలిచావులు, వలసలు నివారించి, రూ.3,964 కోట్లతో వస్త్ర పరిశ్రమను సంక్షేమం, అభివృద్ధిపై నడిపించారు. పదేళ్ల కాలంలో సిరిసిల్ల నేత కార్మికులకు చేతినిండా పనికల్పించి, అండగా నిలిచారు. కేసీఆర్ సర్కార్ హయాంలో సిరిసిల్ల పట్టణం రూపురేఖలు మారగా, కేంద్ర ప్రభుత్వం పలు అవార్డులు సైతం ఇచ్చి సత్కరించింది. దీంతో సిరిసిల్ల దేశంలోనే ఆదర్శ పట్టణంగా నిలవడం విశేషం.
బీఆర్ఎస్ హయాంలో 2014, 2020 మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే పట్టంగట్టిన సిరిసిల్ల ఓటర్లు, తాజాగా మూడోసారి సంపూర్ణ మద్దతు ప్రకటించి హ్యాట్రిక్ విజయాన్ని అందించారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో కేటీఆర్ వరుసగా మూడు రోజులపాటు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయగా, అప్పుడే మద్దతు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ మంత్రులు, అగ్ర నేతలు గల్లీ గల్లీ తిరిగి అబద్ధాలతో మభ్యపెట్టే ప్రయత్నం చేసినా తిప్పికొట్టారు. ఎవరెన్ని చెప్పినా.. బెదిరింపులకు దిగినా.. ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా రామన్నపై విశ్వాసం, అభిమానం, నమ్మకం ఉంచారు. బీఆర్ఎస్కు తిరుగులేని విజయాన్ని అందించారు. 39 వార్డులకు 27 వార్డుల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించారు.
మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. పార్టీ యంత్రాంగాన్ని అన్నీ తానై నడిపించారు. టికెట్ల కేటాయింపు, ప్రచారం, పోలింగ్ సరళిని స్వయంగా పర్యవేక్షించారు. ‘అధికార పార్టీ బెదిరింపులకు భయపడవద్దని, బెదరవద్దని, నేనున్నా’ అంటూ అభ్యర్థులకు భరోసా కల్పించారు. అంతేకాదు, ప్రచారంలో అభ్యర్థులను తన వెంట వీధివీధికీ తీసుకెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. ‘పదేళ్లలో అభివృద్ధి చేసుకున్నాం. మళ్లా మంచిగా అభివృద్ధి చేసుకుందాం.. రాబోయేది మన సర్కారే, ఇంటి పార్టీ అభ్యర్థులను గెలిపించండి’ అంటూ విజ్ఞప్తి చేశారు. అధికార కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
రాష్ట్ర సర్కారు మోసాలు, నేతన్న ఉపాధికి గండికొట్టడం, యారన్ సబ్సిడీని ఇవ్వకపోడం, త్రిఫ్ట్ను నీరురార్చడం, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకుండా నేతన్న జీవితాలను ఎలా ఆగం చేశారో..? వివరిస్తూ, అన్యాయాలను ఎత్తిచూపడంతో చైతన్యవంతమయ్యారు. ‘అంతేకాదు ఎన్నికల ముందు ఓటర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘పదేళ్ల అభివృద్ధి కండ్ల ముందే ఉన్నది. అన్ని వర్గాలకు చేయూతనిచ్చేలా ఎన్నో సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ హయాంలోనే ప్రవేశపెట్టినం. మీ అందరి సహకారంతో సిరిసిల్ల పట్టణం అనేక అవార్డులు కూడా దక్కించుకుంది. భవిష్యత్తులోనూ ఇదే ప్రగతి కొనసాగాలంటే మన ఇంటి పార్టీకే పట్టం కట్టాలే. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించండి’ అని విజ్ఞప్తి చేయడంతో ఆయనపై సంపూర్ణ నమ్మకం ఉంచి ఘన విజయాన్ని అందించారు.