హైదరాబాద్, జూలై 24 (నమస్తేతెలంగాణ)/హిమాయత్‌నగర్: నీట్ పేపర్ లీకేజీ అంశంలో కేంద్రం తీరును నిరసిస్తూ విద్యార్థి, యువజన సంఘాలు శుక్రవారం పిలుపునిచ్చిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యార్థులు, యువజనులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున బంద్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నీట్ నిర్వహణలో వైఫల్యం, విద్యార్థుల ప్రాణాలు బలిగొన్న ఘటనలకు రాజకీయ, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా విశ్వసనీయత కోల్పోయిన ఎన్టీఏను వెంటనే రద్దు చేసి, పారదర్శకమైన ప్రవేశ పరీక్షల వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు దాడులు చేయడం దారుణమని, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో విద్యార్థి, యువజన సంఘాల రాష్ట్ర నాయకులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ (ఏఐఎస్ఎఫ్), టీ నాగరాజు (ఎస్ఎఫ్ఐ), ఎస్ అనిల్ (పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి), పీ మహేశ్, పొడపంగి నాగరాజు (పీడీఎస్‌యూ), పల్లె మురళి, గడ్డం నాగార్జున (ఏఐఎఫ్డీఎస్), నవీద్ హకీమ్ (ఏఐఎస్బీ), గోపాల్ (ఏఐపీఎస్యూ) కోట రమేశ్, ఆనగంటి వెంకటేశ్ (డీవైఎఫ్ఐ), వలి ఉల్లాఖాద్రీ (ఏఐవైఎఫ్), పెద్దింటి రామకృష్ణ (పీవైఎల్), వనం సుధాకర్ (ఏఐఎఫ్‌డీవై) తదితర నాయకులు పాల్గొన్నారు.