హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యుత్తు ఉద్యోగులకు వేతనాల షాక్ తగులబోతున్నది. వారి వేతనాలను ఇప్పట్లో సవరించకపోగా ఉన్న వేతనాల్లో కోత పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఆర్ అండ్ బీ పేస్కేల్స్‌ను విద్యుత్తు సంస్థల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు విద్యుత్తు ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పీఆర్సీ విషయంపై ఇటీవల కొందరు విద్యుత్తు ఉద్యోగులు సచివాలయంలో ఓ ఉన్నతాధికారిని కలిశారు. ఆయన చెప్పిన సమాధానంతో నేతలు ఖిన్నులవ్వాల్సి వచ్చింది. ‘విద్యుత్తు సంస్థల్లో భారీగా వేతనాలున్నాయి. ఆర్‌అండ్‌బీలో చాలా తక్కువ వేతనాలున్నాయి. మీకు కూడా ఆర్ అండ్ బీ పేస్కేల్స్ వర్తింపజేయమంటారా?’ అంటూ సదరు అధికారి ప్రశ్నించడంతో ఆ నేతలంతా తీవ్ర నిరాశతో తిరిగివచ్చేశారు.
విద్యుత్తు ఉద్యోగుల వేతనాల్లో కోత పడటం ఖాయమని విద్యుత్తు సౌధ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఆర్అండ్బీ పేస్కేల్స్ వర్తింపజేస్తే వేతనాల్లో 25 నుంచి 40% మేరకు కోత పడుతుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ప్రస్తుతం విద్యుత్తు సంస్థల్లో ఏఈల ప్రారంభ వేతన స్కేల్ రూ.64,295గా, ఆర్ అండ్ బీలో రూ.54,220గా ఉన్నది. ఈ లెక్కన ఈ ఒక్క క్యాడర్లోనే రూ.10 వేల వేతనం కోత పడే అవకాశం ఉన్నది. విద్యుత్తు సంస్థల్లో ప్రతి నాలుగేండ్లకోసారి వేతన సవరణ చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఇదివరకు గరిష్ఠంగా 33%, కనిష్ఠంగా 7% పీఆర్సీ అమలు చేసిన సందర్భాలున్నాయి. పాత పీఆర్సీ గడువు ముగియడంతో ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉన్నది. కానీ, ఇంతవరకు ఆ కమిటీని వేయలేదు.
విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లకు వేతనాలు, ఇతర ప్రయోజనాలు కల్పించే విషయంలో రేవంత్‌రెడ్డి సర్కార్ తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నది. రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో దాదాపు 20 వేల మంది ఆర్టిజన్లు పనిచేస్తున్నారు. ఇటీవల సమ్మెకు దిగిన ఆర్టిజన్లతో చర్చలు జరిపిన ప్రభుత్వం.. అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరించుకోవాలని వారికి సూచించింది. ఇది జరిగి నెలలు గడుస్తున్నా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. దీనిపై ఆర్టిజన్ సంఘాల నేతలు సచివాలయంలో ఓ ఉన్నతాధికారిని కలిసినా ఫలితం లేకపోయింది. ‘మీకు ఇచ్చే జీతంతో నలుగురిని పెట్టి పనిచేయిస్తా’ అని ఆ ఉన్నతాధికారి చెప్పారట. దీంతో ఇదేం పద్ధతి, ఇవేం బెదిరింపులని ఆర్టిజన్ సంఘాల నేతలు మండిపడుతున్నారు. నిత్యం ప్రాణాలకు తెగించి పనిచేసే తమను ఆర్ అండ్ బీ సిబ్బందితో ఎలా పోల్చుతారని ప్రశ్నిస్తున్నారు.
విద్యుత్తు సంస్థల్లో వేతనాల బడ్జెట్‌ను తగ్గించుకునేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నది. అందులో భాగంగా కొత్త ఉద్యోగాల భర్తీని నిలిపివేసింది. ట్రాన్స్‌కోను కేవలం 40% అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులతో నడుపుతున్నారు. ఉత్తర డిస్కమ్‌లో దాదాపు 4 వేల జూనియర్ లైన్మెన్ పోస్టులు ఖాళీలున్నాయి. ప్రస్తుతమున్న సిబ్బందిపై పనిభారం తీవ్రంగా పెరుగుతున్నా కొత్త ఉద్యోగులను నియమించడంలేదు. తద్వారా ముగ్గురు చేయాల్సిన పనిని ఒక్కరితో చేయిస్తున్నారు.