నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రైతుల పొలాలను ఎండబెడుతున్నది.. ఇది కేవలం నిర్లక్ష్యమే కాదూ… నేరపూరిత చర్య అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌నినో అని చెప్తున్నా… కృష్ణానదీలో ఎగువ నుంచి వరద వచ్చింది. శ్రీశైలంలో నీళ్లు ఉన్నాయి… సాగర్లోనికి వచ్చాయి.. అయినా ఎల్ఎల్బీసీ మోటర్లు నడిపి ఎందుకు చెర్వులు, కుంటలు నింపడం లేదు..?, ఎందుకు పొలాలను ఎండబెడుతున్నారు..? అని ప్రశ్నించారు.
కేసీఆర్ హయాంలో పదేండ్లు సమృద్ధిగా నీళ్లు… నిరంతరం కరెంట్‌తో పంటలు పండించుకున్న రైతులు.. ఇప్పుడు ఎండుతున్న పంటలు చూసి కన్నీళ్లు పెడుతున్నరని ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా కనగల్ మండలం తేలకంటిగూడెంలోని ఏఎమ్ఆర్పీ ఆయకట్టు పరిధిలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా తిమ్మారెడ్డిగూడెం సబ్‌స్టేషన్‌లో లాగ్‌బుక్ పరిశీలించి కరెంట్ కోతలపై ఆరా తీశారు. అనంతరం పంట ఎండిపోయిన రైతులు బైరగోని పెద్దలింగయ్య, యాదయ్యలకు చెందిన నాలుగు ఎకరాల వరి పొలాలను పరిశీలించిన జగదీశ్‌రెడ్డి అందులోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తేలకంటిగూడెం చుట్టుపక్కలనే నాలుగు వందల ఎకరాల్లో ఇప్పటికే వరి పంట ఎండిపోయిందని తెలిపారు. ఈ ప్రాంతానికి కీలకమైన కనగల్ చెర్వును ఏఎమ్ఆర్పీ నీళ్లతో ఎందుకు నింపడం లేదో… పంటలను ఎండుకు ఎండబెడుతున్నారో మంత్రి కోమటిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరెంట్ కోసం రైతులు నిత్యం రోడ్డెక్కుతున్న పరిస్థితికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించాలని కోరారు. ఎల్‌నినో పేరు చెప్పి మంత్రులు తప్పించుకుంటున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ హయాంలో 21వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధిస్తే.. ప్రస్తుతం ఎందుకు 19వేల మెగావాట్ల ఉత్పత్తి దాటడం లేదని నిలదీశారు. యాదాద్రి, కొత్తగూడెం, భద్రాద్రి పవర్ ప్లాంట్లల్లో విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లను ఎందుకు నిలిపివేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో బొగ్గు నిక్షేపాలు బాగా ఉన్నాయని, ఇతర రాష్ట్రాలకు బొగ్గు ఇస్తున్నప్పటికీ తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని కోరారు. రైతులు ఏడు గంటల కరెంట్ కూడా సక్కగా వస్తలేదని చెప్తుతున్నారని, సబ్స్టేషన్లలో లాగ్ బుక్స్‌ను పరిశీలిస్తే అదే విషయం స్పష్టమైందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తాం, పాత రోజులు తేస్తామంటే పొలాలు ఎండబెట్టుడు… కరెంటు ఇవ్వకపోవడమేనా అని ప్రశ్నించారు.
కనగల్లు మండలంలోని తిమ్మన్నగూడెం విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పరిశీలించారు. అయితే స్థానిక రైతులు చెప్పేది ఒక విధంగా ఉంటే… ఇక్కడ సబ్‌స్టేషన్ లాగ్బుకులో మరోలా ఉండడం ఏంటనీ ఈ సందర్భంగా సిబ్బందిని నిలదీశారు. రోజుకు 13 గంటల నుంచి 17 గంటలు వస్తుందని లాగ్బుకుల్లో రాయగా, రైతులు మాత్రం కనీసం ఏడు గంటలు కూడా వస్తలేదని అక్కడే ఆధారాలతో చూపారు. చివరికి పైనుంచి వస్తున్న ఆదేశాల ప్రకారమే తాము పనిచేస్తున్నామంటూ, తమ చేతిలో ఏమీ లేదంటూ చివరకు సిబ్బంది ఒప్పుకున్నారు.
లాగ్‌బుక్స్‌లో ఎంట్రీలు కూడా తప్పుగా చేస్తూ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. ఎక్కడా 10గంటలకు మించి కరెంటు రావడం లేదని, మెజార్టీ ప్రాంతాల్లో ఏడెనిమిది గంటలే వస్తుందని వివరించారు. అందుకే నిత్యం రైతులు రోడ్డెక్కుతున్నా జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు పట్టడంలేదని, వాళ్లు నల్లగొండ జిల్లాకు పట్టిన శని అని జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నేతలు చీర పంకజ్‌యాదవ్, మందడి సైదిరెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి, ఎస్కే కరీం పాషా, అయితగోని యాదయ్య, తుమ్మల లింగస్వామి, దేప వెంకట్‌రెడ్డి, గోన రవీందర్రావు, మారగోని గణేశ్, దీప్లానాయక్ తదితరులు పాల్గొన్నారు.