ధర్మారం/వెల్గటూర్ సెప్టెంబర్ 20 : “ప్రజా మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ను బదనాం చేసేందుకు రేవంత్‌రెడ్డి కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నడు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో ఇంచు ప్రభుత్వ భూమి లేదని తేలితే రేవంత్ తప్పు ఒప్పుకొని ముకు నేలకు రాస్తాడా..?” అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గణేశ్ మండపాలను సందర్శించి, మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు నష్టం కలిగించేలా లక్షల ఎకరాల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని అసెంబ్లీలో ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై రేవంత్ సర్కార్ దురుద్దేశ పూరితమైన చర్యలు చేపట్టిందని దుయ్యబట్టారు. 22ఏ జాబితాలో భూములు చేర్చడం వల్ల తప్పు జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి అసెంబ్లీలో ఒప్పుకోవడమే ఇందుకు నిదర్శనమని గుర్తుచేశారు.
కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో అసైన్డ్ భూమి ఉన్నదని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ ప్రకటించడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవాచేశారు. వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌కు 62 ఎకరాల భూమి మాత్రమే ఉంటే, దానికి విరుద్ధంగా లక్ష కోట్ల విలువైన 1,000 ఎకరాల భూమి ఉన్నదని రేవంత్ మాట్లాడటం సరికాదని చెప్పారు. కేసీఆర్ ప్రజా మద్దతుతో ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, కేంద్ర మంత్రి హోదాలో పనిచేసిన గొప్ప నాయకుడని, అలాంటి నేత ప్రభుత్వ అసైన్డ్ భూమిని ఆక్రమించే అవసరం లేదని స్పష్టంచేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చడానికే రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని ఆరోపించారు. రేవంత్‌తోపాటు ప్రభుత్వంలో కొనసాగుతున్న పలువురు మంత్రులు ఎన్నో అక్రమ ఆస్తులు కూడ బెట్టుకున్నారని తెలిపారు. రూ.150తో ఎర్ర బస్సు ఎకి రాజధానికి వచ్చానని గతంలో ప్రకటించిన రేవంత్‌కు వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయని నిలదీశారు. ఈ సమావేశంలో నంది మేడారం పీఎసీఎస్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, పార్టీ ధర్మారం పట్టణ మాజీ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు తదితరులు ఉన్నారు.
బీఆర్ఎస్ ఎండపల్లి మండల మాజీ అధ్యక్షుడు సింహాచలం జగన్ కుటుంబానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు చేయూతనిచ్చారు. ఆదివారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలోని జగన్ నివాసానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెళ్లి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన రూ.10లక్షలతో పాటు నియోజకవర్గంలోని నాయకుల ద్వారా సేకరించిన రూ.11.36 లక్షలను జగన్ కుటంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, వివిధ మండలాల మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.