కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అనుకున్నం.. కానీ ఇప్పుడు ఎల్ నినో కంటే రేవంత్‌రెడ్డి డేంజర్‌గా తయారయ్యాడు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం ఇష్టం లేక, రైతుల పంట పండితే కొనాల్సి వస్త్తుందనే దురుద్దేశంతోనే ఈ కరెంట్ కోతలు, నీటి కోతలు విధిస్తున్నాడు. బొగ్గు లేదనే సాకుతో యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం ప్లాంట్లలో ఉద్దేశపూర్వకంగా విద్యుదుత్పత్తిని ఆపేశాడు.
– హరీశ్‌రావు
యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 20 : ఎల్ నినో కంటే సీఎం రేవంత్‌రెడ్డి డేంజర్ అని.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను పక్కనపెట్టి ప్రజలను మోసం చేస్తామంటే ఊరుకోబోమని, అమలుచేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు. పాలన చేతగాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు.
ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ పరిధిలోని మోటకొండూర్‌లో అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లేశ్ యాదవ్, అనంతుల శోభన్‌బాబు ఆధ్వర్యంలో సుమారు 2వేల మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరగా, వారికి హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి సర్కార్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ చేతగాని పాలనతో విసిగిపోయి ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని ముక్తకంఠంతో కోరుకుంటున్నారని చెప్పారు.
దమ్ముంటే రాత్రిపూట సబ్స్టేషన్ల వద్దకు వచ్చి కరెంట్ సరఫరాపై బహిరంగ చర్చకు రావాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలో ఉండి, ప్రభుత్వ విప్ ఉన్నప్పటికీ వందలాది మంది సీనియర్ నాయకులు బీఆర్ఎస్లో చేరడం.. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రాబోతుందనేందుకు స్పష్టమైన సంకేతమని పేర్కొన్నారు. మూడేండ్ల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఎన్నికలు పెడితే ఎవరు గెలుస్తారని సర్వేలు చేస్తే.. మళ్లీ కేసీఆర్ రావాలనే చెబుతున్నాయని చెప్పారు. విద్యార్ధులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు ఏ వర్గం చూసినా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని ముక్తకంఠంతో చెబుతున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్‌ది రైతు పాలన అయితే రేవంత్‌రెడ్డిది రాక్షస పాలన అని హరీశ్‌రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో 24గంటల కరెంట్ వస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 6-7 గంటలు మాత్రమే వస్తున్నదని మండిపడ్డారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ కేసీఆర్ రైతుబంధు ఆగకుండా ఇచ్చి రైతులను కాపాడారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి మాత్రం రైతుబంధు రూ.15వేలు ఇస్తానని చెప్పి, ఒక పంటకు రెండు ఎకరాలకే వేసి, ఇంకో పంటకు ఎకరానికే పరిమితం చేసి రైతులను నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు.
సాక్షాత్తు యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టుపెట్టి దేవుణ్ని సైతం మోసం చేసిన ఘనుడు రేవంత్‌రెడ్డి అని దెప్పిపొడిచారు. ఆగస్టు 15 డెడ్లైన్లు మూడు దాటిపోయినా ఇప్పటికీ సగానికి సగం మందికి రుణమాఫీ కాలేదని ధ్వజమెత్తారు. రైతు ఏ కారణం చేత చనిపోయినా వారం రోజుల్లో రూ.5 లక్షల బీమా ఇచ్చిన కేసీఆర్ ఎక్కడ.. ఆసలు రైతు బీమానే లేకుండా చేసిన రేవంత్‌రెడ్డి ఎక్కడ? అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో వడ్ల బస్తాకు 2 నుంచి 5కిలోల తరుగు తీస్తే.. అసెంబ్లీలో కూర్చొని తరుగు తీస్తే తోలుతీస్తానని డైలాగ్‌లు కొట్టిన రేవంత్‌రెడ్డి.. మిల్లర్లు, బ్రోకర్ల చేతుల్లో తోలుబొమ్మలా మారిపోయారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఇంటికే ఆటోలో యూరియా బస్తాలు వస్తే, నేడు యూరియా దొరుకక రైతులు క్యూలో నిలబడే దుస్థితికి దాపురించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రశ్నిస్తే కేసులు, జైళ్లు తప్ప ఈ ప్రభుత్వంలో ఒరిగిందేమీ లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ కోసం లాఠీదెబ్బలు తిని జైలుకు వెళ్లామని.. ఈ పిట్ట బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కరెంట్ రాకపోతే ఎల్ నినో, నీళ్లు రాకపోతే ఎల్ నినో అని సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని రేవంత్‌రెడ్డి వైఫల్యం వల్ల వచ్చి కరువని ధ్వజమెత్తారు. కృష్ణా నదిలో నీళ్లున్నా కల్వకుర్తిలో ఐదు మోటర్లకు రెండే నడుపుతున్నారని, ఏఎంఆర్, ఎస్ఎల్బీసీ మోటర్లు ఆన్ చేయడం లేదని దుయ్యబట్టారు. పట్టిసీమ, వెలిగొండ, రాయలసీమ లిప్టుల ద్వారా ఆంధ్రాకు నీళ్లు పోతుంటే.. తెలంగాణకు మాత్రం కన్నీళ్లు మిగిల్చారని ఆవేదన వ్యక్తంచేశారు.
బొగ్గు లేదనే సాకుతో 4వేల మెగావాట్ల యాదాద్రి పవర్‌ప్లాంట్, 500 మెగావాట్ల భద్రాద్రి, 800 మెగావాట్ల కొత్తగూడెం ప్లాంట్లలో ఏకంగా 3,500 మెగావాట్ల ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగా ఆపేశారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ 24గంటల కరెంటు ఇచ్చినప్పుడు ఎప్పుడో గంట కరెంట్ పోయినా సబ్స్టేషన్ల వద్దకు వెళ్లి లాగ్‌బుక్స్ చెక్‌చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఇవాళ ఆరు గంటల కూడా రాక రైతులు అల్లాడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
‘భువనగిరి ఎంపీ చామల కిరణ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.. దమ్ముంటే రాత్రిపూట ఆలేరులోని ఏ సబ్‌స్టేషన్‌కైనా రావాలని, కరెంట్ ఎందుకు ఇవ్వడం ఇద్దరూ రైతులకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. యాదాద్రి భువనగిరి ప్రాంతంలో ఎంతోమంది రైతులు, పేదల భూములను రాత్రికి రాత్రి 22ఏ నిషేధిత జాబితాలో పెట్టి వారి ఆస్తుల విలువను సున్నా చేశారని మండిపడ్డారు. మోటకొండూర్ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక ఒక్క కొత్త చెరువైనా తవ్వారా? ఒక్క కాలువైనా తీశారా? ఇవాళ ఇంత మంచి పంటలు పండుతున్నాయంటే అది ఆనాడు కేసీఆర్ తవ్వించిన చెరువులు, కట్టిన చెక్‌డ్యాముల చలువేనని హరీశ్‌రావు గుర్తుచేశారు.
తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ చావుకోరుకోవడం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి వికృత, పైశాచిక మనస్తత్వానికి నిదర్శనమని హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘నీకు చేతనైతే కేసీఆర్ కంటే ఎక్కువగా రూ.15వేల రైతుబంధు, 4వేల పెన్షన్, 24గంటల కరెంటు ఇచ్చి చూపించు. చేతకాకపోతే చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పు. కేసీఆర్ ప్రభుత్వంలో కంటివెలుగు, కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, దళితబంధు, గొర్రె పిల్లల పంపిణీ అన్ని సక్రమంగా జరిగేవి.. ఇవాళ కల్యాణలక్ష్మీ చెక్కులు కూడా పిల్లలు పుట్టి, ఏడాదో రెండేండ్ల తర్వాత వస్తున్నాయ్.
రేవంత్‌రెడ్డి పాతరోజులు తెస్తా అన్నట్టు .. నిజంగానే పాతరోజులు తెచ్చాడు. ఇదీ కాంగ్రెస్ తెచ్చిన మార్పు’ అని దుయ్యబట్టారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజలకు అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బండ నరేందర్, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నేవూరి ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఏదో ఇస్తారని ఆశపడి కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశాం సార్.. అంటూ మహబూబ్‌పేట మహిళలు హరీశ్‌రావుతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. మోటకొండూర్‌లో చేరికల సభకు వెళ్తుండగా, మధ్యలో హరీశ్ వారితో ముచ్చటించారు. 24గంటల కరెంటు వస్తున్నదా?, రూ.2,500 అందుతున్నదా? అని అడుగగా.. స్పందించిన మహిళలు ఏమీ రావడం లేదని.. కరెంట్ ఉండటం లేదని బదులిచ్చారు.