గద్వాల/అమరచింత, సెప్టెంబర్ 20: సాగునీరివ్వండి మహాప్రభూ.. అన్న అన్నదాతలపై సర్కార్ అక్కసు పెంచుకున్నది. ఎండుతున్న పంటలను కాపాడుకోవాలనే ఆశతో జూరాల ఎడమకాలువ గేట్లెత్తిన పాపానికి రైతులపైనే పోలీస్ కేసులు నమోదుచేసింది. ఆగమేఘాలపై రైతులు తెరిచిన గేట్లను మూసివేసి, ప్రాజెక్టు వద్దకు ఏ ఒక్కరినీ రానివ్వకుండా ఉండేందుకు పోలీస్ పహారా పెట్టింది. నీళ్లివ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ, రైతులపైనే కేసులు నమోదు చేసిన సర్కార్ వైఖరిపై పాలమూరు ఉమ్మడి జిల్లా రైతాంగం మండిపడుతున్నది.
రైతులపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఏకంగా జూరాల ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వెళ్తామని ప్రకటించారు. జూరాల ఆయకట్టు కింద తమ పంటలు ఎండుతున్నాయని ఆవేదన చెందిన రైతాంగం గత పది రోజులుగా వరుస ఆందోళనలకు దిగుతున్నది. ఈ క్రమంలోనే శనివారం రెండు జిల్లాల పరిధిలోని పలు గ్రామాల రైతులు గద్వాల కలెక్టరేట్‌తోపాటు జూరాల డ్యామ్‌పై ఆందోళనకు దిగారు. అయినా అధికారులు స్పందించడం లేదన్న ఆగ్రహంతో అక్కడికి వచ్చిన వందలాది మంది రైతులు రాత్రి జూరాల డ్యామ్ ఎడమ కాలువ షట్టర్లను పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
సుమారు గంటపాటు కాలువలో నీళ్లు ప్రవహించాయన్న విషయం తెలుసుకొన్న ప్రాజెక్టు అధికారులు హుటాహుటిన ఎడమ కాలువ వద్దకు చేరుకొని తూములను బంద్ చేశారు. ఆదివారం జూరాల ప్రాజెక్టు మొత్తాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీసులతో దిగ్బంధించారు. నీళ్లు విడుదల చేసిన రైతులపై చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు డీఈ షమీ ఉల్లా, ఏఈ వంశీకృష్ణ అమరచింత పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ రైతుల వీడియోలను పోలీసులకు అప్పగించారు. ఆ ఫిర్యాదుతోనే కేసులు నమోదు చేశామని, వీడియోల ఆధారంగా ఎంతమంది రైతులపై కేసులు నమోదు చేయాలో ఇంకా నిర్ణయించలేదని అమరచింత ఎస్సై స్వాతి మీడియాకు వెల్లడించారు.
జూరాల ప్రాజెక్టు పరిధి ఆయకట్టును కాపాడాలని, పంటపొలాలకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని, రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సాగునీళ్లు అడిగిన పాపానికి రైతులపైనే కేసులు నమోదు చేస్తారా? అని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలకు వారు పిలుపునిచ్చారు. అదేరోజు జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తామని ప్రకటించారు. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాల్లేవని అందుకే ఉన్న జలాలను తాగునీటి కోసం ఉంచామని మాట మారుస్తున్నారు.
జోగుళాంబ గద్వాల-వనపర్తి జిల్లాల సరిహద్దులోని జూరాల ప్రాజెక్టు వద్ద పోలీస్ పహారా ఏర్పాటుచేశారు. పోలీసులతోపాటు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు అక్కడే ఉన్నారు. ఆదివారం ఉదయం నుంచి డ్యామ్ కుడి, ఎడమ కాలువల వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎడమ కాలువ వద్ద సీఐ, ఇద్దరు ఎస్సైలతోపాటు 30 మంది ఏఆర్ పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. రైతులెవరూ ప్రాజెక్టు వైపు వెళ్లకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉదయం కుడి కాలువ వద్దకు కొందరు రైతులు చేరుకోగా, గద్వాల సీఐ శ్రీనివాసులు తన సిబ్బందితో ప్రాజెక్టు వద్దకు చేరుకొని నచ్చజెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నీటి విడుదల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై రైతులు ఇంకా ఆగ్రహంతో ఉన్నారు.