హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): పీఆర్సీ రిపోర్ట్‌ను స్వీకరించడంలో సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదా..? ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నదా.. ? అంటే అవుననే అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. రిపోర్ట్ సమర్పించాలని పీఆర్సీ కమిటీకి లేఖ రాసిన సర్కార్, దానిని తీసుకునేందుకు మాత్రం సమయం ఇవ్వడం లేదు. ఈ నెల 9న పీఆర్సీ కమిటీకి సీఎస్ సంజయ్ జాజు లేఖ రాయగా, ఇప్పటికే 11 రోజులు గడిచిపోయాయి. కానీ ఇంత వరకు నివేదికను సర్కార్ తెప్పించుకోలేకపోయింది. పీఆర్సీ రిపోర్ట్ విషయంలో సర్కార్ అనుసరిస్తున్న తీరును ఉద్యోగ సంఘాల నేతలు తప్పుబడుతున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణకు పీఆర్సీ నివేదిక సిద్ధమైంది. ప్రభుత్వం కోరగానే నివేదిక అందించేందుకు కమిటీ కూడా రెడీగా ఉంది. అయినా ప్రభుత్వం మాత్రం స్వీకరించేందుకు ముందుకు రావడం లేదు. అపాయింట్మెంట్ ఇవ్వడంలేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ సంజయ్‌జాజు, ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ సందీప్‌కుమార్ సుల్తానియా, జీడీఏ అధికారులను మెయిల్ ద్వారా కమిటీ సంప్రదించింది. అంతకుముందు అసెంబ్లీ సమావేశాల సాకుతో వాయిదా వేసింది. ఇప్పుడు సమావేశాలు ముగిసినా ‘మేం చెప్పినప్పుడు.. రమ్మనప్పుడే రండీ’ అంటూ సమాధానమిచ్చినట్టు సమాచారం.
పీఆర్సీ నివేదిక అంటేనే సర్కార్ వర్గాలు జంకుతున్నాయి. నివేదిక సర్కార్‌కు చేరితే బహిర్గతపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పీఆర్సీ నివేదిక అందజేయకుండా ప్రభుత్వమే వ్యూహాత్మకంగా అడ్డుకుంటున్నట్టుగా ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక సర్కార్ సతమతమవుతున్నది. ఆదాయం కోసం భూముల విక్రయాలు, వేలంపాటలను నిర్వహిస్తున్నది. అప్పుల మీద అప్పులు చేస్తున్నది. ఈ తరుణంలో ఫిట్మెంట్ ఆశాజనకంగా లేకపోయినా ఉద్యోగ వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకతకు దారితీయనుంది. దీంతోనే సర్కార్ జాప్యం చేస్తున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 9న సీఎస్ సంజయ్ జాజు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. అంతకు ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం చర్చలు జరిపారు. పీఆర్సీ నివేదిక సమర్పించాలని కమిటీకి లేఖ రాశారు. సీపీఎస్‌పై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సీఎం కూడా ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఈ నెల 18న జేఏసీ నేతలను సర్కార్ చర్చలకు ఆహ్వానించింది. ఆ తర్వాత సోమవారానికి వాయిదావేసింది. ఇప్పటివరకు మూడు సార్లు చర్చలు జరులగగా, సోమవారంతో నాలుగోసారి అవుతున్నది.
సోమవారం సానుకూల స్పందన రాకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు సోమవారం నాటి చర్చలను బహిష్కరించాలని. ఉద్యోగులు, జేఏసీ నేతలు కోరుతున్నారు. పీఆర్సీ రిపోర్ట్‌ను స్వీకరిస్తేనే సీఎస్‌తో చర్చలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కొందరు జేఏసీ నాయకత్వానికి బహిరంగ లేఖను కూడా రాశారు. సీఎస్‌తో కాకుండా సీఎంతోనే చర్చలు జరుపాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయంగా జీఎస్డీపీ 7శాతముంటే. తెలంగాణ జీఎస్డీపీ 10.7శాతమున్నది. అయినా ఇంకెంతకాలం ఆర్థిక పరిస్థితి బాగాలేదని సర్కార్ తప్పించుకుంటుందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.