కాచిగూడ, సెప్టెంబర్ 20 : ప్రజాస్వామ్యానికి బీసీలే పునాదిరాళ్లు అని, అలాంటి బీసీలకు రాజ్యాధికారం దక్కకుండా అగ్రవర్ణాలు కుట్రలు పన్నుతున్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. ఆదివారం కాచిగూడలో జరిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బీసీ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశానికి మధుసూదనాచారి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. ప్రపంచాన్ని శాసించేది రాజ్యాధికారం, డబ్బేనని, అవి ఉన్నవారే నేటి సమాజంలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. బీసీలు ఎదగకుండా కులాల వారీగా విభజించి అణగదొక్కుతున్నారని, అందుకు వ్యతిరేకంగా బీసీలంతా ఏకమై ఉద్యామించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ‘బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి. బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమిలేయర్‌ను తక్షణమే తొలగించాలి.
కేంద్రస్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్‌తో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటుచేయాలి’ అని డిమాండ్ చేశారు. తెలంగాణ ఓబీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు దానకర్ణచారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రవికుమార్ ముదిరాజ్, రామరాజ్, అల్లం యాదయ్య, చెన్నయ్య, జీ మల్లేశ్, సీ రామమూర్తి, శ్రీశైలం, శ్రీనివాస్‌గౌడ్, ప్రదీప్, నగేశ్రాజ్, గౌతం, నీలం వెంకటేశ్, సీ రాజేందర్, నిఖిల్ పాల్గొన్నారు.