ఆదిలాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : సముద్రం తలాపున పెట్టుకొని చేప దూపకేడ్చినట్టుగా ఉన్నది ఆదిలాబాద్ జిల్లాలోని రైతుల దుస్థితి. జిల్లాలోని ఐదు మండలాల్లో 51 వేల ఎకరాలకు సాగునీరు అందించే చనాక-కొరాట ప్రాజెక్టు పిల్లకాలువ పనులు పూర్తికాకపోవడంతో నీరు అందక రైతులు పంటలు నష్టపోవాల్సిన దుస్థితి నెలకొన్నది. రైతులకు సాగునీరు అందించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం మహారాష్ట్ర సరిహద్దులోని జైనథ్ మండలం కొరాట వద్ద పెన్‌గంగా నదిపై చనాక-కొరాట ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మహారాష్ట్ర సీఎం, మంత్రులు, అధికారులతో చర్చలు జరిపారు. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణానికి రెండు రాష్ర్టాలు ఆమోదం తెలిపాయి. మన రాష్ట్రంలోని భోరజ్ మండలం కొరాట వద్ద నిర్మించే బరాజ్, ప్రధాన కాలువల నిర్మాణానికి ప్రభుత్వం రూ.451.46 కోట్లు మంజూరు చేసింది. పంప్‌హౌస్ నిర్మాణ పనులకు రూ.118.92 కోట్లు కేటాయించింది. పెన్‌గంగ నీరు 0.98 టీఎంసీలను కొరాట వద్ద నిల్వ చేసేందుకు బరాజ్‌ను నిర్మించారు. రైతుల భూములకు సాగునీరు అందించడానికి 47 కిలోమీటర్ల ప్రధాన కాలువ, 129 బ్రిడ్జిలు నిర్మించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బరాజ్, పంప్‌హౌస్, ప్రధాన కాలువల పనులను పూర్తిచేయగా, డిస్ట్రిబ్యూటరీల కోసం భూ సేకరణ జరిపే సమయంలో ఎన్నికల కోడ్ వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. ప్రధాన కాలువ నిర్మాణం పూర్తికాగా డిస్ట్రిబ్యూటరీలు(పిల్ల కాలువలు) నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఈ కాలువలు పూర్తయితే రైతుల భూములకు పూర్తిస్థాయిలో సాగునీరు అందే అవకాశాలుండగా బిల్లుల జాప్యం కారణంగా మధ్యలోనే పనులు నిలిచిపోయాయి. 34 నెలలు గడుస్తున్నా పిల్ల కాలువల పనలు అతీగతీ లేకుండా పోయాయి. ప్రస్తుతం ప్రాజెక్టు ఆయకట్టులో 40 వేల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా ఎల్ నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కాయ దశలో ఉన్న పత్తి పంటకు మరో రెండు తడులు అవసరం కాగా.. రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు బరాజ్, పంప్‌హౌస్, ప్రధాన కాలువల పనులు పూర్తికావడంతో అధికారులు 2023 సెప్టెంబరు 28న హత్తిఘాట్ పంప్‌హౌస్‌లోని మోటర్లను ఆన్ చేసి విజయవంతంగా ట్రయల్న్ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండోసారి ఈ ఏడాది జనవరి 16న మరోసారి ట్రయల్న్ నిర్వహించారు. తమ క్రెడిట్ కోసమే సీఎం రెండోసారి ట్రయల్న్ నిర్వహించారని విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి స్వయంగా మోటర్లు ఆన్‌చేసి కాలువల్లోకి వదలడంతో తమ పొలాలకు నీరు అందుతుందని రైతులు ఆశించారు. తొమ్మిది నెలలు గడుస్తున్నా ఆయకట్టు రైతులకు చుక్కనీరు అందడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల పెట్టుబడితో పంటలు సాగు చేస్తున్నామని, చేతికివచ్చిన పత్తి వర్షాలు లేక ఎండిపోయే పరిస్థితి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రాజెక్టు నీటిని ప్రధాన కాలువల్లోకి వదిలితే తాము మోటర్ల సహాయంతో లేదా ఇతర మార్గాల ద్వారా పంటలను కాపాడుకుంటామని రైతులు అంటున్నారు. బరాజ్‌లో నీటిని ప్రధాన కాలువల్లోకి రెండు విడతలుగా వదిలితే తాము పంటలు నష్టపోకుండా ఉంటామని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
రైతుల పంటలను కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రధాన కాలువల పనులు ఎప్పుడో పూర్తయ్యాయి. జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మోటర్లు ఆన్‌చేసి కాలువల్లోకి నీటిని వదిలారు. ఈ ఏడాది వర్షాలు లేక పంటలు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రధాన కాలువలోకి నీళ్లు వదిలితే కాయదశలో ఉన్న పత్తిని కాపాడుకుంటం. బరాజ్‌లో నీటిని కాలువల్లోకి వదలడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరు. ప్రభుత్వం స్పందించి చనాక-కొరాట నీటిని ప్ర ధాన కాలువల్లోకి విడుదల చేయాలి.